గుమ్మడికాయలో ఏ, సీ, ఈ విటమిన్లు, పొటాసియం, రాగి, మాంగనీస్‌, ఐరన్‌, భాస్వరం లాంటి ఖనిజాలు, పీచుపదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు ఎన్నో ఉన్నాయి. దీనిలో లభించే కెరోటినాయిడ్లు కంటిని ఆరోగ్యంగా ఉంచుతాయి. టోకోఫెరోల్స్‌ చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ట్రిప్టోఫాన్‌ నాణ్యమైన నిద్రను అందిస్తుంది. కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ను గుమ్మడిలోని డెల్టా 7 స్టెరాల్స్‌ నియంత్రిస్తాయి. గుమ్మడికాయలను ఎక్కువగా ఆహారంగా తీసుకున్న వారికి ఊబకాయం, మరణాల ప్రమాదాలు తగ్గుతాయని అధ్యయనాలు తెలిపాయి. గుమ్మడికాయను సూపర్‌ వెజిటబుల్‌ అంటారు. గుమ్మడి గింజలలో పొటాషియం, జింక్‌, మాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి. వీటిలో విటమిన్‌ కే, ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. గుమ్మడికాయలతో అనేక రకాల ఆహార పదార్థాలు తయారు చేస్తారు.

గృహప్రవేశం చేసినప్పుడు గుమ్మం వద్ద తప్పకుండా గుమ్మడికాయ కొడతారు. ఏడాది పొడవునా గుమ్మడి వినియోగం ఉంటుంది. సంవత్సరంలో ఎప్పుడు నాటినా గుమ్మడి పంట పండుతుంది. దీనికి ఎర్రనేలలు, నల్లనేలలు అనుకూలం. దిగుబడి ఎక్కువ రావాలంటే.. ఎక్కువ విత్తనాలు నాటితే మంచిది. ఎక్కువ దూరంలో నాటితే పంట తక్కువ వస్తుందని నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూర్ మండలం మేడికూరు రైతు రాఘవేందర్ తెలిపారు. ధశాబ్ద కాలానికి పైగా ఆయన మూడు ఎకరాల్లో ఆయన గుమ్మడి సాగు చేస్తున్నారు. తాను సాలుకు సాలుకు 5 అడుగులు, మొక్కల మధ్య అడుగు లేదా అర అడుగు దూరం ఉండేలా నాటినట్లు చెప్పారు. ఈ మాదిరిగా విత్తనాలు నాటితే ఎకరానికి 10 కిలోల విత్తనం అవసరం అవుతుంది. ఒక్కో గుమ్మడి పాదుకు రెండు నుంచి నాలుగు కాయలు కాస్తాయి.గుమ్మడి సాగు కోసం కూలీల అవసరం పెద్దగా ఉండదు.గుమ్మడి పంట సాగు చేయాలనుకునే రైతులు ముందుగా భూమిని బాగా దున్నుకోవాలి. తర్వాత బోదెలు చేసి, విత్తనాలు నాటుకోవాలి. విత్తనం నాటిన మూడు రోజులకు గుమ్మడి మొక్కలు వస్తాయి. పదును ఆరిన తర్వాత వారం రోజులకు డ్రిప్‌ ద్వారా నీరు అందించినా తట్టుకోగల మొండి రకం గుమ్మడి. పాదుకు నీళ్లు ఎక్కువ ఇస్తే ఆకులు, పూలు, పిందెలు కుళ్లిపోయే ప్రమాదం ఉంది. గుమ్మడికి తక్కువ నీరు అవసరం. వర్షాలు ఎక్కువ కురిసినప్పుడు ఫంగిసైడ్‌ వస్తే.. దాని నివారణ మందు కొడితే సరిపోతుందని రైతు రాజశేఖర్‌ తెలిపారు. నాలుగేళ్లుగా ఆయన గుమ్మడి సాగు చేస్తున్నారు.విత్తనం నాటిన 20 రోజులకు ఒకసారి, మరో ఐదు రోజులకు మరోసారి ఎకరానికి మూడు కిలోల మూడు 19లు చొప్పున అందించాలి. 30 రోజులకు ఆడపువ్వులు ఎక్కువ, మగ పూలు తక్కువ వచ్చేందుకు ఉపయోగపడే బోరాన్‌ మందు పిచికారి చేయాలి. విత్తనం నాటిన 35 రోజుకు గుమ్మడి పాదుకు పూత, 45 రోజులకు పిందె వస్తుంది. గుమ్మడి విత్తనాలు నాటిన 40 నుంచి 45 రోజుల మధ్య తీగ వచ్చి, పూత, పిందె వస్తాయి. పిందె వచ్చినప్పుడు పంటను పండు ఈగ ఆశిస్తుంది. దాని నివారణ మందు స్ప్రే చేయాలి. పండు ఈగ మందు కొట్టిన తర్వాత కాల్షియం, నైట్రేట్‌ ఒక్కసారి ఇస్తే సరిపోతుంది. గుమ్మడిపాదులను దోమ ఆశిస్తే.. నివారణ మందులు స్ప్రే చేయాలి.గుమ్మడి 90 రోజుల పంట. చాలా మంది రైతులు గుమ్మడి పంట దసరా, దీపావళి పండుగ రోజుల్లో వచ్చేలా సాగు చేస్తారని నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండపేటలోని అభ్యుదయ రైతు మేకల లక్ష్మీనారాయణ తెలిపారు. ఆ సమయంలోనే రైతుల నుంచి పంట దిగుబడులు ఎక్కువ రావడం వల్ల ధర తగ్గుతుందన్నారు. రైతులు దసరాకు మూడు నెలల ముందు విత్తనాలు పెడతారు. మిగతా రైతులు ఎవరూ సాగు చేయని సమయంలో గుమ్మడి సాగు చేస్తే.. డిమాండ్‌ వచ్చి, ధర ఎక్కువ వస్తుందని చెప్పారు. ధర తక్కువ ఉందనుకుంటే నెల రోజులు నిల్వ ఉంచినా గుమ్మడికాయలు చెడిపోవు. గుమ్మడికాయ ఎర్రరంగులోకి మారిన తర్వాత కోసుకోవాలి.గుమ్మడి విత్తనాలు 50 గ్రాముల ప్యాకెట్లలో లభిస్తాయి. ఒక్కో ప్యాకెట్‌ ధర సుమారు రూ.600 ఉంటుంది. విత్తనాలను సాలుకు సాలుకు మధ్య 4 అడుగుల దూరం, విత్తనానికి విత్తనానికి మధ్య 2 అడుగుల దూరం ఉండేలా నాటుకోవాలని లక్ష్మీనారాయణ చెప్పారు. లక్ష్మీనారాయణ చేసిన అర ఎకరంలో విత్తనాలకు రూ.3 వేలు, దుక్కి దున్నేందుకు రూ.3 వేలు ఖర్చయినట్లు చెప్పారు. కలుపు తీత కూలీలకు, బస్తా 20:20:13 ఎరువుకు రూ.14 వందలు అవుతుంది. విత్తనం నాటిన 40 రోజులకు ఆకుముడత పురుగు నివారణ మందు స్ప్రే చేసేందుకు మరో రూ.15 వందలు ఖర్చయిందని లక్ష్మీనారాయణ తెలిపారు. అర ఎకరానికి తాను సుమారు రూ. 9 వేలు ఖర్చు చేశారాయన.నలభై కిలోలు ఉండే ఒక్కో గుమ్మడికాయల బ్యాగ్‌ను రూ.800కు విక్రయించారు. మార్కెట్‌ను జాగ్రత్తగా గమనించి అమ్ముకుంటే బ్యాగ్‌ ధర రూ.12 వందలు కూడా పలుకుతుంది. తమ అర ఎకరంలో 70 నుంచి 80 బ్యాగ్‌ల గుమ్మడి దిగుబడి వచ్చిందని లక్ష్మీనారాయణ చెప్పారు. అంటే సుమారు మూడు టన్నులకు పైగా పంట వచ్చిందన్నారు. కనీస ధర రూ.800 కే అమ్మినా అన్ని ఖర్చులూ పోగా మంచి లాభమే వచ్చినట్లు తెలిపారు. మార్కెట్‌కు కాయలు రవాణా చేయడంతో పాటు అన్ని ఖర్చులూ కలిపి సుమారు రూ.25 వేల ఖర్చు వస్తుందన్నారు. పంట అమ్మితే రూ.55 వేలు ఆదాయం వచ్చిందన్నారు. దిగుబడి ఎక్కువ వస్తే.. బ్యాగ్‌కు నాలుగైదు వందల ధర వచ్చినా లాభంగాను ఉంటుంది. తమ పొలంలో ఒక్కో గుమ్మడికాయ రెండు నుంచి ఐదు కిలోల మధ్య బరువు తూగిందని వెల్లడించారు. అర ఎకరంలో గుమ్మడికాయలను ఒక మనిషి గంట నుంచి రెండు గంటల్లో కోసేయవచ్చు. సంచులు నింపేందుకు ఇద్దరు, వాహనంలో ఎక్కించేందుకు మరో ఇద్దరు మనుషులు సరిపోతారు.గుమ్మడికాయలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అయితే.. మార్కెట్‌లో ఎప్పుడెప్పుడు ధర ఎక్కువ వస్తుందో రైతులు గమనించి, దానికి అనుగుణంగా పంట చేతికి వచ్చేలా సాగు చేస్తే మంచిదని అనుభవం ఉన్న ఈ ముగ్గురు రైతులు వెల్లడించారు. సుమారు ఎకరం గుమ్మడిసాగు కోసం అన్నీ కలుపుకొని రూ.50 వేలు ఖర్చయితే.. కనీసం లక్షా 50 వేల రూపాయల వరకు మిగిలే అవకాశం ఉంటుందని చెప్పారు.