పెన్సిల్ దొండకాయలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రక్తంలోని సుగర్ లెవెల్స్‌ను చక్కగా అదుపు చేస్తుంది. దీనిలోని ఎక్కువ పీచుపదార్థం జీర్ణక్రియ చక్కగా జరిగేలా చేస్తుంది. మలబద్ధకం ఉన్నవారు పెన్సిల్ దొండను ఆహారంలో తీసుకుంటే ఆ సమస్య తగ్గిపోతుంది. 100 గ్రాముల దొండలో కేవలం 18 నుంచి 20 కేలరీలే ఉంటాయి. బరువు తగ్గాలంటే ఇది మంచి ఆహారం. దొండకాయలలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఐరన్ బాగా ఉన్నందున రక్తహీనత తగ్గిపోతుంది. దొండలోని రిబో ప్లోవిన్ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. తద్వారా డిప్రెషన్‌ను నియంత్రిస్తుంది. బీటా కెరోటిన్ కారణంగా గుండె ఆరోగ్యం ఉంటుంది. రక్తపోటు నియంత్రణకు దోహదం చేస్తుంది. దొండకాయలను క్రమంగా ఆహారంగా తీసుకున్నవారిలో ఉబ్బసం సమస్యలు తగ్గినట్లు అధ్యయనాలు స్పష్టం చేశాయి.
సన్నగా పొడవుగా ఉండే గుజరాత్ పెన్సిల్ దొండకాయలు చూసేవారిని ఆకర్షిస్తాయి. రుచికరంగా ఉండడంతో పెన్సిల్ దొండను ఒకసారి తింటే తరచూ వీటినే కావాలంటారు. సాధారణ దొండకాయల మాదిరిగా ఎరుపు రాదు, లావుగా తయారవకపోవడం పెన్సిల్ దొండ ప్రత్యేకత. ఈ రకం దొండ కోసుకోవాల్సి సమయానికి నాలుగైదు రోజులకు మించి పాదునే ఉంచితే.. మరింత పొడవు అవుతుంది. ముదిరిన పెన్సిల్ దొండలో రుచి కూడా తగ్గుతుంది. పెన్సిల్ దొండ మొక్క నాటిన 9 నెలలకే తొలి కాపు వస్తుంది. ఏ సమయంలో అయినా పెన్సిల్ దొండ కిలో రూ.25 నుంచి రూ.30 ధర పలుకుతుంది.
పెన్సిల్ దొండ మొక్క నాటిన 50 రోజుల నుంచే కాపు మొదలవుతుందని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గండిగూడ రైతు రాజశేఖర్ చెప్పారు. రాజశేఖర్‌కు 18 సంవత్సరాలుగా దొండపంట సాగుచేస్తున్న అనుభవం ఉంది. నాణ్యమైన రకం కావాలనే ఉద్దేశంతో తాను గుజరాత్ నుంచి తెప్పించారు. ఒక మొక్క రూ.25 చొప్పున తమ వద్దకే కొరియర్ ద్వారా పంపించినట్లు తెలిపారు. ఈ రకం దొండపాదుల ఆకులు పచ్చబడినప్పుడు ఏడాదిలో బ్యాక్ ప్రూనింగ్ చేశారు. పెన్సిల్ సైజ్ మండలు ఉంచి, మిగతావన్నీ తీసేస్తారు. బ్యాక్ ప్రూనింగ్ చేసిన 30 నుంచి 35 రోజుల్లో ఈ దొండపాదు పందిరి మొత్తం కమ్ముకొని, దిగుబడి ఇవ్వడం మొదలవుతుందన్నారు రాజశేఖర్. దొండకాయలు తయారైన తర్వాత ప్రతి మూడు రోజులకు కొత వస్తూనే ఉంటాయి. ఎలాంటి బ్రేక్ లేకుండా సుమారు 8 నెలల పాటు పంట దిగుబడి ఇస్తూనే ఉంటుంది. ఇలా రెండేళ్లు దిగుబడి తీసుకున్న తర్వాత పెన్సిల్ దొండ పాదులను వేళ్లతో సహా తీసేసి, భూమిని మళ్లీ చదును చేసుకుని కొత్త మొక్కలు నాటుకోవాలి.
ఎకరం భూమిలో దాదాపు 900 మొక్కలు నాటినట్లు రాజశేఖర్ తెలిపారు. 14 అడుగుల మధ్యలో 4 మొక్కలు నాటుకోవచ్చు. పెన్సిల్ దొండపాదుల మొదలు చాలా బలిష్టంగా తయారవుతాయి. మొక్క నాటిన 30 నుంచి 35 రోజుల్లో పాదు పందిరిలో సగం నిండిపోయేలా పాకుతుంది. రెండు నుంచి మూడు అడుగుల మేర తీగ సాగినప్పటి నుంచి పువ్వులు, పిందెలు మొదలవుతాయి. పువ్వు పుట్టిన మూడు రోజులకే పిందె అవుతుంది. అది తయారై కోతకు రావడానికి ఐదు రోజులే సరిపోతుంది. ప్రతి ఆకుకు ఒక కాయ రావడం పెన్సిల్ దొండ ప్రత్యేకత అని చెప్పారు రాజశేఖర్. తమ క్షేత్రంలో రెండున్న ఎకరాల్లో పెన్సిల్ దొండ సాగుచేస్తున్నారాయన. ఒక క్రాపులో తమకు అత్యధికంగా 50 కిలోల బరువుండే 55 సంచుల్లో దిగుబడి వచ్చిందన్నారు. సగటున 35 నుంచి 40 బ్యాగుల దొండకాయల దిగుబడి ఉంటుందని చెప్పారు. దీంతో తాము పండించిన దొండకాయలు మరింత రుచిగా ఉంటాయి. అందువల్ల గృహిణులు ఒకసారి తీసుకెళితే ప్రతిసారీ వీటినే కోరుకుంటారని చెప్పారు.
రాజశేఖర్ క్షేత్రంలో సహజసిద్ధ ఎరువులతో సాగు చేస్తారు. దానివల్ల దొండకాయల నాణ్యత బాగుంటుంది. దేశీ ఆవుల పేడతో తయారుచేసిన వర్మీ కంపోస్ట్, వర్మీ యాష్ ఫర్మాంటేషన్ చేసిన గో అమృతం మాత్రమే తాము వాడతామని అన్నారు. గో అమృతం తయారు చేసేందుకు గుజరాత్ నుంచి తీసుకొచ్చిన 5 వేల లీటర్ల సామర్ధ్యం ఉన్న వెస్సల్స్ వాడుతున్నట్లు తెలిపారు. వీటిలో ఆవు మూత్రం, మొలాసిస్, ఆవుపేడ, ఆవు మజ్జిగ, వంటింటి వ్యర్థాలు, వేపాకులతో కలిపి గో అమృతం తయారు చేస్తున్నట్లు చెప్పారు. వీటన్నింటినీ కలిపి వెస్సల్ వేసిన 45 రోజులకు చక్కని అరుకు తయారవుతుందన్నారు. గో అమృతాన్ని తాము మొక్కలు ఆరోగ్యంగా, బాగా ఎదగడం కోసం మొక్కల మొదళ్లకు డ్రిప్ ద్వారా అందిస్తారు.
ఎండాకాలంలో దొండమొక్కలకు ప్రతిరోజు రెండు గంటల పాటు నీటిసరఫరా చేయాలి. డ్రిప్‌కు బిగించిన ఒక డిప్పర్ రెండు గంటల్లో 16 లీటర్ల నీటిని అందిస్తుంది. వర్షాకాలంలో అయితే.. నేల తడిగా ఉంటుంది. కాబట్టి దొండమొక్కలకు నీళ్లు ఇవ్వాలో అక్కరలేదో రైతుకే అర్థం అయిపోతుందన్నారు. చలికాలంలో అయితే నీటి అవసరం మరింత తక్కువ ఉంటుంది.
రైతు రాజశేఖర్ దొండపాదులు పందిరిపైకి పాకుతాయి కాబట్టి, కింద ఉండే భూమిని కూడా నిరుపయోగంగా వదిలేయలేదు. కింద భూమిని బెడ్లుగా చేసి, పందిరి కింది వరకు ఎదిగే బెండ మొక్కలను అంతర పంటగా పెంచారు. బెండసాగులో రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి తాము సాగుచేస్తున్నట్లు చెప్పారు. పందిరిపై దొండపాదు పూర్తిగా కమ్మేసే లోపు అంటే మూడు నుంచి నాలుగు నెలలలోపే బెండ దిగుబడి వచ్చేస్తుందన్నారు. బెండకాయలు కూడా ఆరు నుంచి ఏడు అంగుళాల పొడవు ఎదుగుతాయి. రోజు విడిచి రోజు బెండకాయలు తెంపుకోవచ్చు. ఈ అంతర పంట వల్ల రైతులకు డబుల్ ఆదాయం వస్తుంది. భూమిలో కలుపు రాదు.
ఒక కూలీ రోజులో 150 కిలోల వరకు దొండకాయలను తెంపుతాడు. శంషాబాద్ మార్కెట్‌లోనే తమ దొండపంటను ఎక్కువగా అమ్ముతామన్నారు రాజశేఖర్. ఎకరంలో గ్రానైట్ రాళ్లు, జీఐ వైరుతో దొండపందిరి వేయడానికి సుమారు రూ.3 నుంచి రూ. 3.50 లక్షల ఖర్చు వస్తుంది. వెయ్యి మొక్కలకు రూ.25 వేలు అవుతుంది. దానిపైన దిగుబడి వచ్చే వరకు మరో రూ.50 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. డ్రిప్ వేయడానికి అయ్యే ఖర్చు ఉంటుంది. అయితే.. ఈ రెండు ఖర్చులూ ఒకసారి పెడితే చాలా సంవత్సరాల వరకు మళ్లీ పెట్టుబడి ఉండదు.
దొండపాదుకు ముఖ్యంగా వచ్చేది పౌడరీ తెగులు. రసం పీల్చుకునే చిన్న నల్లపేను ఆశిస్తుంది. పొడపాము మాదిరి చారలు చారలు కూడా వస్తాయి. ఇవి వస్తే మాత్రం నివారణ కోసం మోనోక్రోటోఫాస్ లాంటి రసాయన మందులు వాడతామన్నారు. ఇలా ఎకరం పెన్సిల్ దొండసాగు కోసం సుమారు రూ.4.50 లక్షలు ఖర్చు చేస్తే.. పంట బ్రహ్మాండంగా వస్తుంది. మొదటి ఏడాదిలోనే పెట్టుబడి పెట్టిన మొత్తం డబ్బులు తిరిగి వచ్చేస్తాయి. కష్టపడి, జాగ్రత్తగా చేసుకుంటే పెన్సిల్ దొండ లాభసాటి వ్యవసాయం అన్నారు రైతు రాజశేఖర్. మంచి భూమి ఉండి, నీటి సదుపాయం ఉన్న రైతులు పెన్సిల్ దొండ సాగుచేయ వచ్చని చెప్పారు. చవుడు, నల్లరేగడి తప్ప నీళ్లు నిలబడని ఏ భూమి అయినా పెన్సిల్ దొండసాగుకు అనుకూలం. కలుపు నివారించుకుంటే.. క్వాలిటీ పంట వస్తుంది. దానికి మార్కెట్‌లో మిగతా వాటికన్నా పది రూపాయలు ఎక్కువే ధర వస్తుంది.
పెన్సిల్ దొండ మొక్కలు, ఇతర వివరాల కోసం రైతు రాజశేఖర్‌ను 9505110755లో సంప్రదించవచ్చు.





















