veragrofarms.com వెబ్ సైట్ సృష్టికర్త, కర్మ, క్రియ అన్నీ తానై నడిపించిన మా హితుడు, శ్రేయోభిలాషి, మేమందరం వైఎస్ఆర్‌గా పిలుచుకునే యెన్నా శ్రీనివాసరావు శివైక్యం పొంది నేటికి సరిగ్గా ఏడాది గడిచిపోయింది. ఈ వెబ్‌సైట్‌కు ఫౌండర్ ఎడిటర్‌గా వ్యవహరించిన వైఎస్‌ఆర్ గారు తన తుదిశ్వాస విడిచే వరకు దిగ్విజయంగా నడిపించి ప్రకృతి వ్యవసాయం పట్ల పదిమందికీ అర్థమయ్యే రీతిలో అందంగా తీర్చిదిద్దారు. 2021 మే 7వ తేదీన వైఎస్‌ఆర్ గారు రాసి, వెబ్‌సైట్‌లో పోస్టుచేసిన ‘సరికొత్తగా ఆర్గానిక్ ఎరువుల తయారీ’ చిట్టచివరి ఆర్టికల్. ఆ తర్వాత రెండు రోజులకే అంటే మే 9వ తేదీ నాటికే వైఎస్‌ఆర్ గారు కరోనా బారిన పడ్డారు. మే 13 నుంచి జూన్ 2వ తేదీ వరకు కరోనా మహమ్మారికి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. అక్కడితో ఆయన veragrofarms.com వెబ్‌సైట్ ద్వారా చేసిన ప్రకృతి వ్యవసాయం సేవ నిలిచిపోవడం బాధాకరం.
వైఎస్‌ఆర్ ఓ జర్నలిస్టు రుషి. మూర్తీభవించిన నిజాయితీ. అద్భుతమైన స్నేహశీలి. ఆజాత శత్రువు అనే మాటకు మన కళ్ల ముందు కదలాడిన ప్రత్యక్ష నిదర్శనం వైఎస్‌ఆర్. దయాగుణం ఆయన ఆభరణం. వనమూలికా వైద్యంలో నిష్ణాతుడు. సంస్కృతం, తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి పట్టున్న వ్యక్తి. మనుషుల పట్ల ఎంత ప్రేమగా, ఆదరంగా వ్యహరించేవారో జంతువులను కూడా వైఎస్‌ఆర్ అలాగే చూసేవారు. వైఎస్‌ఆర్ గారిలో ప్రకృతి వ్యవసాయ విధానాల విషయ పరిజ్ఞానం ఎంతో ఉంది. అందువల్లే ఆయన ప్రకృతి వ్యవసాయ విధానాలకు సంబంధించిన ఎంతో విలువైన సమాచారాన్ని ఎక్కడెక్కడి నుంచో అధ్యయనం చేసి మరీ మన వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ప్రకృతి వ్యవసాయ ప్రేమికులు ఎందరికో ఆయన స్ఫూర్తి కలిగించారు. వైఎస్ఆర్ చేతిలో veragrofarms.com వెబ్‌సైట్ ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, సమాచార భాండాగారంలా రూపుదిద్దుకుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రకృతి వ్యవసాయంలో ఎక్కడెక్కడ ఎవరు విశేష కృషి చేసినా పరిశోధించి, పరిశీలించి మరీ వారి విజయగాధలు ఎన్నింటినో మన వెబ్‌సైట్‌లో వైఎస్‌ఆర్ గారు పొందుపరిచేవారు. మన వెబ్‌సైట్ ద్వారా ప్రకృతి ప్రేమికులకు మామూలుగా అందుబాటులో దొరకని ఎన్నో విలువైన సమాచారాలను వెతికి వెతికి మరీ అందుబాటులో ఉంచేవారు.
veragrofarms.com వెబ్‌సైట్ ప్రారంభించినప్పటి నుంచీ సర్వం తానే అయి నడిపించిన మన యెన్నా శ్రీనివాసరావుగారికి స్మృత్యంజలి ఘటిస్తున్నాం.
మీ
వర్రే గంగాధర్
చీఫ్ ఎడిటర్
veragrofarms.com





















