Coconut, Jack Fruit, Betel Nutఅనుకొని పది ఎకరాల్లో కొబ్బరి నాటారు కృష్ణాజిల్లా బట్లపెనుమర్రులోని ఆదర్శ రైతు చలసాని శరత్‌బాబు. కొబ్బరి మొక్కల మధ్య అనుకోకుండా పనస, వక్క మొక్కలు నాటారు. అయినా నేల ఇంకా ఖాళీగా ఉందని మొక్కల మధ్య మినుము పంట కూడా వేశారు. ఒక్క మినుము పంటే ఏటా ఎకరం నేల నుంచి ఏటా ఏడు బస్తాల వరకు దిగుబడి వస్తోంది. ఇలా కొబ్బరితోటలో అంతర పంటలుగా బహుళ పంటలు సాగుచేస్తున్నారు రైతు శరత్‌బాబు. బహువార్షిక పంటలుగా కొబ్బరి, పనస, వక్క సాగుచేశారు. వార్షిక పంటగా మినుము పండిస్తున్నారు. శరత్‌బాబు సాగు విధానంలో రైతుకు నిరంతరం ఆదాయం అందిస్తోంది. ఏకపంటపై ఆధారపడిన రైతు కష్టాలకు శరత్‌బాబు బహుళ పంటల విధానం లాభదాయకంగా మారుతుందనడం లేదు.

మాగాణి భూములను కూడా మెట్టగా మార్చుకొని శరత్‌బాబు ఇలా బహుళ పంటల విధానంలో ముందుకు సాగిపోతున్నారు. పొలం పనులకు కూలీలు దొరకకపోవడంతో సమయానికి తాను ఏమీ చేయలేక ముందుగా అనుకొని కొబ్బరి వేశారు శరత్‌బాబు. కొబ్బరి మొక్కల మధ్యన ఖాళీ ఉందని పనస మొక్కలు నాటారు. పనస మొక్కల మధ్య ఉన్న ఖాళీలో వక్క మొక్కలు నాటారు. మూడు రకాల బహుళ వార్షిక మొక్కల మధ్యన భూమి ఇంకా ఖాళీ ఉండడంతో మినుము పంటా వేసినట్లు చెప్పారు. అంతర పంటలను ఇష్టం వచ్చిట్లు ఆషామాషీగా కాకుండా పొందికగా, ఒక ప్లాన్‌ ప్రకారం చేయాలని శరత్‌బాబు తెలిపారు. భూమిని ఖాళీగా ఉంచకూడనే ఉద్దేశంతో ఏది అనుకూలంగా ఉంటుందో దాననే తాను ఎంపిక చేసుకొని అంతర పంటలు వేసినట్లు చెప్పారు. పనస మొక్కల్లో తాను ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్న ‘రామ్‌గంగ’, తమిళనాడు నర్సరీ నుంచి తెచ్చిన ‘చిరంజీవి’,  వియత్నాం సూపర్‌ ఎర్లీ జాక్‌ ఫ్రూట్‌ చెట్లు పెద్ద ఎత్తున పెరగవు. నాటిన ఏడాది లోగానే కాపు కాస్తాయి.ముందుగా కొబ్బరి మొక్కలను ఒకదానికి ఒకదానికి మధ్య 27 అడుగుల దూరంలో నాటినట్లు చెప్పారు. కొబ్బరి మొక్కల మధ్యన 9 అడుగుల దూరంలో రెండు వక్క మొక్కలు పెట్టారు. ఇంకా స్థలం ఉందని నాలుగు కొబ్బరిమొక్కల మధ్య ఒక్కో పనసమొక్క నాటారు. ఎకరంలో 60 కొబ్బరి, 60 పనస, 180 వక్క మొక్కలు నాటారు. ఇక కొబ్బరిమొక్కకు మొక్కకు మధ్య 20 అడుగులదూరం పెట్టిన తోటలో ఎకరానికి 100 కొబ్బరి మొక్కలు, పనస 100 మొక్కలు, వక్కలు 200 మొక్కలు నాటారు. ఇంకా నేల ఖాళీగా ఉందని మినుము వేసినట్లు చెప్పారు.రామ్‌గంగ కొబ్బరి మొక్క మూడేళ్లకే కాపు కాస్తుంది. ఇది పొట్టీ కాదు.. పొడుగూ కాదు. దీన్ని సెమీ డ్వార్ఫ్ ్రకం అంటారు. రామ్‌గంగ తయారైన బొండంలో 300 నుంచి 400 మిల్లీ లీటర్ల నీరు ఉంటుంది. నీళ్ల కోసమే కాకుండా కొబ్బరికి కూడా ఈ రకం పనికివస్తుంది. ఏడాదికి 14 మట్టలు, 14 గెలలు వస్తాయి. పోషణ సరిగా చేసుకునే దాన్నిబట్టి కాయలు నిలబడతాయి. తాను నాటి మొక్కలకు 30 నెలల నుంచే పువ్వు మొదలైదని శరత్‌బాబు చెప్పారు. చిరంజీవి రకం పెద్దగా ఎదగవు. మొక్కకు మొక్కకు మధ్య 20 అడుగులు ఉంటే సరిపోతుంది. అందుకే ఇవి ఎకరంలో 100 మొక్కలు వచ్చాయి. ద్వారకా తిరుమల నర్సరీ నుంచి తీసుకొచ్చిన నాటు వక్క మొక్కలు నాటారు శరత్‌బాబు. నాటు వెరైటీ అయితే.. తెగుళ్లు ఉండవని, దిగుబడి గ్యారంటీ ఉంటుందని నిపుణులు చెబితే వేశానన్నారు. మినప పంట త్వరగా వస్తుందని, వియత్నాం పసన ఏడాదికే కాస్తుంది. ఆ తర్వాత కొబ్బరి ఆదాయం, దాని తర్వాత వక్క పంట వస్తుందన్నారు. మొక్క తెచ్చిన ఏడాదికే మొగ్గలు వస్తే.. తెంపేశామన్నారు. అక్కడక్కడా మిగిలిపోయి మొగ్గలు కాయలు, పండ్లు అయ్యాయని, అవి చాలా రుచిగా ఉన్నాయని శరత్‌బాబు చెప్పారు. వియత్నాం పనస ఏడాది పొడవునా దిగుబడి ఇస్తూనే ఉంటుంది.వియత్నాం పనసను ముదరక ముందు కూర కోసం వాడుకోవచ్చు. తయారైతే పండుగా పనికి వస్తుంది. దేశం అంతా పనసకు డిమాండ్ ఉంది. ఉత్తర భారత దేశంలో అయితే మరింత ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ పనసను కూరగాయగా విజయవాడ మార్కెట్‌కు పంపితే కిలో రూ.70 వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు శరత్‌బాబు. అరకిలో నుంచి 2 కిలోల సైజు వరకు దీన్ని కూరగాయగా అమ్ముకోవచ్చు. ఒక వియత్నాం పసన చెట్టు నుంచి 200 నుంచి 300 కిలోల కాయలు వచ్చినా.. కిలో రూ.10కి అమ్మినా రైతుకు 3 వేల రూపాయలు ఆదాయం వస్తుందని ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలోని నందిని ఆగ్రో నర్సరీ యజమాని పీవీడీఎన్‌ ప్రసాద్‌ తెలిపారు. ఎకరంలో 200 మొక్కలు నాటితే రూ.3 వేలు చొప్పుల రూ.6 లక్షల ఆదాయం వస్తుందని విరించారు. కిలోకు రూ.10 కన్నా ఎక్కువ ధర వస్తే ఆ ఆదాయం మరింత అధికంగా ఉటుంది.నాటు వక్క మొక్క నాటిన 7వ సంవత్సరం నుంచి ఆదాయం వస్తుంది. వక్క కాయలు వచ్చే సమయానికి ఒక్కో చెట్టును వ్యాపారులు రూ.250 నుంచి 500 రూపాయల వరకు కొంటున్నారని శరత్‌బాబు చెప్పారు. కాయలను కూడా వ్యాపారులే కోసుకుంటారు. రైతుకు కోత ఖర్చు కూడా ఉండదు. వక్కల ఆదాయం తోట మెయింటెనెన్స్‌కు సరిపోయినా.. కొబ్బరి, పసన నుంచి రూ.600 కచ్చితంగా ఆదాయం వస్తుందన్నారు. కొబ్బరి బొండంగా అమ్మితే తాను రూ.20 వస్తుందనుకుంటే ఒక్కో బొండానికి రూ.25 వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. బొండాలు ఎక్కువ సంఖ్యలో ఉంటే వ్యాపారులే వచ్చి కోసుకెళతారు. రామ్‌గంగ రకం చెట్టు నెలకు 300 కాయలు వరకు కాస్తుంది. ఇలా ఏడాదికి రూ.2.50 లక్షల ఆదాయం వస్తుంది.మొక్క నాటిన మూడేళ్ల నుంచి కొబ్బరి నుంచి, మరో రెండేళ్లకు పనస చెట్ల ద్వారా, ఇంకో రెండేళ్లకు అంటే ఏడు సంవత్సరాలకు వక్క ఆదాయం వస్తుంది. ఇవే కాకుండా నేలపైన మినుము, తీగజాతులు, కూరగాయలు లాంటివి పండించుకుంటే ఈ విధానంలో నిత్య ఆదాయం వస్తుంది. ఈ విధంగా సాగుచేస్తే.. ఏడాదికి ఎకరం నేల నుంచి ఐదారు లక్షల రూపాయల ఆదాయం తప్పకుండా వస్తుందని ప్రసాద్‌ చెప్పారు.ఇంతవరకు ఆదాయం, లాభాల గురించే తెలుసుకున్నాం కదా.. ఇప్పుడు కొబ్బరిలో పనస, వక్క, మినుపు పంటల కోసం చేయాల్సిన ఖర్చు గురించి కూడా చూద్దాం. తొలి ఏడాది తనకు ఎకరాకు లక్షన్నర రూపాయలు ఖర్చు అయిందన్నారు శరత్‌బాబు. మొక్కలు కొనడం, రవాణా, నాటడం, చేనును సిద్ధం చేయడం, గుంతలు తీయడం, ఎరువులు వేయడం అన్నీ కలిపి ఖర్చు మొత్తం లక్షన్నర అయిందన్నారు. ఆ తర్వాత పెద్దగా ఖర్చు లేదన్నారు. మినుము ఆదాయం త్వరగా రావడంతో తన చేతి నుంచి పెద్దగా పెట్టుబడి పెట్టింది లేదన్నారు. మాగాణి భూమిని మెట్టగా మార్చుకొని, డ్రిప్‌ వేశారు. చుట్టూ ఉన్నవి మాగాణి భూములే కాబట్టి తన తోటకు తేమ తగిలిందన్నారు. అందుకే తమ తోట చుట్టూ పెద్ద గట్టు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వ్యవసాయంలో లాభ నష్టాలు రైతువే. కష్ట సుఖాలు అనుభవించాల్సింది కూడా రైతే. కాబట్టి ఏ రైతు అయినా స్వానుభవంతో వ్యవసాయంలో మెళకువలు తెలుసుకోవాలని శరత్‌బాబు చెప్పారు. ఔత్సాహిక రైతులు మరిన్ని కొత్త కొత్త ఆలోచనలు విధానాలతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

(కర్షక మిత్ర సౌజన్యంతో..)