అతి తక్కువ ఖర్చుతో మట్టిలో జీవాన్ని పెంచి, మొక్కలకు బలాన్నిచ్చే లిక్విడ్‌ ఫెర్టిలైజర్‌ గురించి తెలుసుకుందాం. ఈ ద్రావణాన్ని తయారు చేసుకున్న తర్వాత మూడు నుంచి ఆరు సంవత్సరాల వరకు కూడా నిల్వ ఉంచుకొని వాడుకోవచ్చు. మొక్కలు చక్కగా పెరిగేందుకు మ్యాక్రో, మైక్రో పోషకాలు అవసరం అవుతాయి. నైట్రోజన్‌, ఫాస్పరస్‌, పొటాషియం, మెగ్నీషియం, బోరాన్‌, జింక్‌, కాపర్, ఐరన్‌, మాంగనీస్‌ లాంటివి మొక్కలకు చాలా అవసరం. బీ1, బీ 2, విటమిన్ ఏ, కే లాంటివి కూడా మొక్కల ఎదుగుదల కోసం కావాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మట్టిలో జీవం పెంచే లిక్విడ్ ఫెర్టిలైజర్‌లో పుష్కలంగా ఉంటాయి. బయో ఎంజైమ్స్‌ మొక్కలకు ఎలా పనిచేస్తాయి? మొక్కలకు ఎలా వాడాలి? ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

మట్టిలో ఉండే పోషకాలను మొక్కకు ఎంత ఇచ్చామనేది కాకుండా అది ఎంత తీసుకుందనేది చాలా ముఖ్యం, ఒక చెంచాడు నేలమట్టిలో కాని, కుండీలలోని మట్టిలో కాని ఉపయోగకరమైన 50 బిలియన్ల మంచి బ్యాక్టీరియాలు, ఫంగస్‌లు, నెమటోడ్స్‌, ప్రోటోజోవాలు లాంటి జీవజాలం ఉంటాయి. సాధారణంగా నెమటోడ్స్‌ అంటే మొక్కలకు హాని చేస్తాయని భావిస్తాం. కానీ వాటిలో మేలు చేసే పీడియాట్రీ నెమటోడ్స్, బ్యాక్టీరియల్ పీరియాడ్ నెమటోడ్స్‌, ఫంగల్‌ పీరియాడ్‌ నెమటోడ్స్‌ అనే మూడు రకాల నెమటోడ్స్‌ ఉంటాయి. ఈ మూడూ మొక్కలకు చాలా అవసరం. వానపాములు కూడా ఒక విధంగా నెమటోడ్స్‌ కిందికే వస్తాయి. అయితే.. మొక్కలకు హానిచేసేవి రూట్‌నాట్‌ నెమటోడ్స్‌. బయో ఎంజైమ్స్‌ మట్టిలోని ఆర్గానిక్‌ పదార్థాన్ని పెంచుతాయి. కార్బన్‌, నైట్రోజన్‌ స్థిరీకరణకు ఉపయోగపడతాయి. కార్బన్ నైట్రోజన్‌ సమానంగా స్థిరీకరణ చెంది సమస్థితిలో ఉంచుతాయి. మట్టి కూడా ఎప్పుడూ గుల్లగా ఉంచేందుకు సహాయం చేస్తాయి.మొక్కలకు వర్మీ కంపోస్ట్‌, మేకల ఎరువు లాంటి ఏ కంపోస్ట్‌ ఎరువు ఇచ్చినా.. మొక్క వాటిని నేరుగా తీసుకోదు. ఎలాంటి పోషకాన్నయినా.. మట్టిలో ఉండే బ్యాక్టీరియా, ఫంగస్‌లు ముందుగా వాటిని తింటాయి. ఈ బ్యాక్టీరియా, ఫంగస్‌లను నెమటోడ్స్‌ తింటాయి. వాటిని ఏక కణ జీవులైన ఆర్థోపాండ్స్‌, ప్రోటోజోవాలు తినేస్తాయి. ఇదంతా ఒక చైన్‌ విధానం. ఇవి వదిలిపెట్టే సెకండరీ మెటలాయిడ్స్‌ని మొక్క తీసుకుంటుంది. మట్టిలో ఇంత చైన్‌ ప్రాసెస్‌ జరుగుతుంది. ఈ విధానం వల్ల మట్టిలో జీవం పెరుగుతూ ఉంటుంది. రసాయన ఎరువులు వాడితే ఈ బ్యాక్టీరియాలు, ఫంగస్‌లు చనిపోయి, మొక్కలకు పోషకాలు అందించే చైన్ తెగిపోతుంది. నెమటోడ్స్‌కి తినేందుకు ఆహారం దొరకదు. దాంతో అవి మొక్క మీద దాడికి దిగుతాయి. దీనితో మొక్కలు చనిపోతాయి. అందువల్ల ఆర్గానిక్‌ విధానంలో మొక్కలు పెంచితే ఎలాంటి ఇబ్బంది ఉండదు.ఈ విధంగా చైన్‌ ప్రాసెస్ జరగాలంటే.. స్వీట్ బయో ఎంజైమ్స్‌, చేదు బయో ఎంజైమ్స్‌, సిట్రస్ బయో ఎంజైమ్స్‌ అవసరం. మామిడి, బొప్పాయి, సపోటా అన్ని రకాల తియ్యని పండ్లతో తయారు చేసిన లిక్విడ్‌లో స్వీట్ బయో ఎంజైమ్స్‌ చాలా ఎక్కువగా ఉండి మొక్క బాగా పెరిగేందుకు తోడ్పడుతాయి. నిమ్మ, నారింజ, ద్రాక్ష, స్టార్ ఫ్రూట్స్‌, ఉసిరికాయలు, టమాటాలతో సిట్రస్ బయో ఎంజైమ్ తయారు చేయవచ్చు. వేపాకులు, ఎండబెట్టిన వేపకాయల పొడితో బిట్టర్ బయో ఎంజైమ్‌ తయారు చేసుకోవచ్చు. వీటితో పాటు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చితో కూడా బయో ఎంజైమ్‌ తయారు చేయొచ్చు. ఒక్కో కప్పు బెల్లంపొడి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చికి 10 కప్పుల నీళ్లు పోసి ఈ బయో ఎంజైమ్ తయారు చేసుకోవాలి. ఈ ఎంజైమ్‌లో ఉండే ఘాటు వల్ల మొక్కలను క్రిమి కీటకాలు ఆశించవు. వేపాకు, వేపకాయలతో తయారుచేసిన ద్రవం కూడా చేదుగా ఉండి క్రిమి కీటకాలను మొక్కల దరి చేరనీయదు.కాల్షియం, ఫాస్పరస్‌ ఎక్కువగా ఉండే నల్లనువ్వుల కేక్‌తో బయో ఎంజైమ్‌ తయారు చేసి వాడితే మొక్కలకు బాగా పనిచేస్తుంది. మొక్కలకు కొత్త చిగుర్లు రావాలన్నా, కొత్త వేర్లు పుట్టాలన్నా కణ విభజన జరగాలి. అలా కణ విభజన జరగాలంటే కాల్షియం చాలా అవసరం. కాల్షియం సమృద్ధిగా మొక్కకు అందితే పూలు, పిందెలు మొక్కల నుంచి రాలిపోకుండా స్థిరంగా ఉంటాయి. కాల్షియం సరిగా అందని మొక్కలకు పగుళ్లు వస్తాయి. ఆ పగుళ్లలో బ్యాక్టీరియా చేరి స్టెమ్‌రాట్‌ లాంటి తెగుళ్లు సోకుతాయి. మొక్క వేళ్లలో తయారైన పోషకాలు మొక్కల చివరి వరకు అందాలన్నా, ఆకుల్లో తయారైన పోషకాలు వేళ్ల వరకు చేరాలననా ఫాస్పరస్‌ వాహకంగా పనిచేస్తుంది. మొక్కలకు అవసరమైన కార్బొహైడ్రేట్స్‌, విటమిన్స్‌ లాంటి అనేకం మారేడులో అత్యధిక సంఖ్యలో ఉంటాయి. వేసవి కాలంలో మారేడు రసం తాగితే శరీరాన్ని చల్లబరుస్తుంది కాబట్టి తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు.తియ్యని పండ్లతో తయారు చేసే స్వీట్ బయో ఎంజైమ్స్ వాడినప్పుడు కూరగాయ మొక్కలు, పండ్ల మొక్కల నుంచి మంచి సైజులో కాయలు, పండ్లు పెరుగుతాయి. పండ్లు నిగనిగలాడి మంచి రుచిగా ఉంటాయి. పూలమొక్కలకు దీన్ని వాడినప్పుడు చక్కని రంగుతో పూలు ఎక్కువగా పూస్తాయి. పూత రాని మొక్కలకు హార్మోన్స్‌ విడుదల చేసి, త్వరగా పూత వచ్చేలా సిట్రస్‌ బయో ఎంజైమ్స్‌ పనిచేస్తాయి. సిట్రస్ బయో ఎంజైమ్స్‌తో మట్టిలో పీహెచ్‌ స్థాయిలను సమస్థితిలో ఉంచుతాయి. చేదు బయో ఎంజైమ్స్‌ క్రిమి నివారణగా, వేరుకుళ్లు, వేరు పురుగులు రాకుండా పనిచేస్తాయి. ఏ బయో ఎంజైమ్‌లో అయినా పీహెచ్‌ వాల్యూ 3 ఉంటుంది. కనుక ఈ బయో ఎంజైమ్స్‌ను మొక్కలకు ఎక్కువ మోతాదులో ఇవ్వాల్సిన అవసరం ఉండదు. లీటర్ నీటిలో ఒక మిల్లీ లీటర్‌ బయో ఎంజైమ్‌ కలిపితే సరిపోతుంది. కొంచెం అటూ ఇటైనా పరవాలేదు కానీ ఎక్కువ మాత్రం అస్సలు వేయకూడదు. అరటిపండ్ల గుజ్జుతో తయారు చేసిన బయో ఎంజైమ్‌ను ప్రతి వారం ఇండోర్‌ మొక్కలకైనా, బయట పెంచుకునే మొక్కలకైనా ఇవ్వవచ్చు.బయో ఎంజైమ్‌ ఎలా తయారు చేయాలి? నిష్పత్తి గురించి తెలుసుకుందాం. ఒక వంతు బెల్లం, మూడు వంతుల ఏదైనా తియ్యని పండ గుజ్జు, బాగా ముగ్గిపోయిన అరటి పండ గుజ్జు అయితే మరీ మంచిది. పది వంతుల నీటితో కలిపి స్వీట్ బయో ఎంజైమ్‌ తయారు చేసుకోవచ్చు. ఈ మూడింటి మిశ్రమ ద్రవం 90 రోజుల్లో తయారవుతుంది. ఈ ద్రవం మరికాస్త త్వరగా రెడీ కావాలంటే వేస్ట్‌ డీ కంపోజర్‌ ద్రవం, పది కప్పుల వాడవెలి డీసీ వాటర్‌ కలిపితే 45 రోజుల్లోనే స్వీట్‌ ఎంజైమ్‌ సిద్ధం అవుతుంది. మొక్క సైజును బట్టి ఒకటి నుంచి మూడు మిల్లీలీటర్ల బనానా బయో ఎంజైమ్‌ ప్రతివారం మొక్కలకు వేస్తే చక్కని ఫలితాలు ఇస్తుంది. అయితే.. మంచి వాసనతో ఉండే ఈ ఎంజైమ్‌ను చల్లగా, పొడిగా ఉండే వాతావరణంలో నీళ్లు పడకుండా జాగ్రత్తగా చూసుకుంటే మూడేళ్ల వరకు మొక్కలకు వాడేందుకు పనికివస్తుంది.బయో ఎంజైమ్స్‌ను ప్లాస్టిక్‌ సీసాలు లేదా డబ్బాల్లో తయారు చేసుకోవాలి. ఈ క్రమంలో వాటిని ప్రతిరోజు ఒకసారి మూత తీసి మళ్లీ పెడుతూ ఉండాలి. ఏ రోజున బయో ఎంజైమ్‌ ప్రాసెస్‌ మొదలుపెట్టామో ఆ తేదీ రాసిన స్టిక్టర్‌ డబ్బాలకు అంటిస్తే.. ఎప్పటికి బయో ఎంజైమ్‌ తయారవుతుందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. బయో ఎంజైమ్‌ తయారైన తర్వాత చక్కగా ఫిల్టర్ చేసి పరిశుభ్రంగా ఉన్న ప్లాస్టిక్ లేదా గాజు సీసాలోకి, డబ్బాలోకి తీసుకొని నీడలో నిల్వ చేసుకోవాలి. వేసవి కాలంలో త్వరగా డీ కంపోజ్‌ అవుతాయి కాబట్టి బయో ఎంజైమ్స్ తయారీకి ఎండాకాలం చాలా అనువైనది. ఇలా తయారైన బయో ఎంజైమ్‌ మూడేళ్ల వరకు మొక్కలకు వినియోగించుకోవచ్చు.బయటి నుంచి ఏదీ డబ్బులు ఖర్చుచేసి, కొనే పని లేకుండా మన ఇంటిలో దొరికే వాటితోటే ఈ బయో ఎంజైమ్స్‌ తయారు చేసుకోవచ్చు. వీటిలో విటమిన్స్‌, ప్రోటీన్స్‌, మినరల్స్‌, కాల్షియం, ఫాస్పరస్‌ లాంటివి సమృద్ధిగా ఉంటాయి కాబట్టి మొక్కలు చాలా త్వరగా, నిగనిగలాడుతూ ఎదుగుతాయి. చక్కని ఫలితాలు అందిస్తాయి.