బ్రోకలీని పోషకాహార నిధి అని చెబుతారు ఆరోగ్య, ఆహారం నిపుణులు. విటమిన్ సీ, కే, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచేందుకు, గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు, క్యాన్సర్ ముప్పును తప్పించేందుకు, జీర్ణక్రియను పెంచుతుంది. బ్రోకలీలో తక్కువ క్యాలరీల వల్ల బరువు తగ్గడానికి పనికొస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను దీనిలోని యాంటీఆక్సిడెంట్లు, సల్ఫోరాఫేస్ సమ్మేళనాలు అడ్డుకుంటాయి. దీనిలో విటమిన్ కే, కాల్షియంలు ఎముకల ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. బోలు ఎముకల వ్యాధిని నివారిస్తాయి. బ్రోకలీలోని విటమిన్ ఏ కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఆరోగ్యానికి బ్రోకలీ మంచిదే. కానీ థైరాయిడ్ సమస్యలు, బ్లడ్ థిన్నర్లు వాడేవారు వైద్యుల సలహాతో పరిమితంగా తీసుకుంటే మేలు.
విదేశాల్లో, చలి వాతావరణంలో ఎక్కువగా పండే బ్రోకలీని ఎక్సోటిక్ కూరగాయ అని చెప్పొచ్చు. ఇది క్యాలీఫ్లవర్ జాతికి చెందిన మొక్క. ఇప్పుడు ఇండియాలో కూడా దీని సాగు, వినియోగం బాగా పెరిగింది. పచ్చరంగులో పువ్వులా ఉండే బ్రోకలీని పాలీహౌస్‌లు, షేడ్ నెట్ల కింద సాగు చేస్తారు. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం మూలమాడలో రైతు పాండురంగారెడ్డి విజయవంతంగా బ్రోకలీ పంట సాగుచేస్తున్నారు. మార్కెట్లో మంచి ధరకు అమ్మి లాభాలు ఆర్జిస్తున్నారు.
‘సఖి’ వెరైటీ విత్తనం తెచ్చి పాండురంగారెడ్డి బ్రోకలీ సాగు ప్రారంభించారు. తులం బరువుండే ప్యాకెట్లో 2,000 విత్తనాలు ఉంటాయి. ఈ ప్యాకెట్ ధర సుమారు రూ.900 ఉంటుంది. ఎకరంలో సాగు కోసం 8 ప్యాకెట్ల విత్తనాలు కావాలి. ఈ విత్తనాలను నర్సరీలో ఇచ్చి, నారు పెంచుకోవాలని పాండురంగారెడ్డి తెలిపారు. నర్సరీలో నారు పెంచి ఇచ్చేందుకు ఒక్కో మొక్కకు సుమారు 40 నుంచి 60 పైసలు తీసుకుంటారు. విత్తనం వేసిన 20 నుంచి 25 రోజులకు నారు తయారవుతుంది.
బ్రోకలీ మొక్కలు నాటుకునే ముందుగా భూమిని ట్రాక్టర్‌తో లేదా నాగలితో బాగా దున్ని, రోటావేటర్తో చదును చేయాలి. డీఏపీ ఎరువు భూమిలో వేసి, డ్రిప్ పరిచి మొక్కలను జిగ్‌జాగ్ విధానంలో నాటుకోవాలని రైతు చెప్పారు. మొక్కల మధ్య అడుగు దూరం ఉండేలా చూసుకోవాలి. మొక్కల సాళ్ల మధ్య రెండు అడుగుల దూరం ఉంయాలి. ఒక ఎకరంలో దాదాపు రూ.18 వేల మొక్కలను నాటుకోవచ్చని పాండురంగారెడ్డి చెప్పారు. ఒక ఎకరంలో బ్రోకలీ మొక్కలు నాటేందుకు నలుగురు కూలీలు అవసరం అవుతారు.
బ్రోకలీ నారు నాటిన తర్వాత 70 నుంచి 90 రోజులకు పంట వస్తుంది. విత్తనం వేసినప్పటి నుంచి 90 నుంచి 110 రోజులకు పంట పూర్తవుతుంది. బ్రోకలీ పంట కోసిన తర్వాత బోయిన్పల్లి మార్కెట్లో టోకు ధర కిలో రూ.65 వరకు అమ్ముతామని రైతు చెప్పారు. స్విగ్గీ సంస్థ ఏ రోజు రేటును బట్టి ఆ రోజు ఒక పువ్వును రూ.25 నుంచి రూ.30 చొప్పున కొంటుంది. మూడు నుంచి నాలుగు పువ్వులు కిలో బరువు వస్తాయి. అయితే.. బ్రోకలీ పంటను కొనుగోలు చేసిన వారికి రైతే అందజేయాల్సి ఉంటుంది.
బ్రోకలీ సాగులో మొక్కలు నాటక ముందు డీఏపీ ఎరువు వేస్తారు. తర్వాత 20:20, 0:0:40 లాంటి కాంప్లెక్స్ ఎరువులను డ్రిప్ ద్వారా వదులుతామని పాండురంగారెడ్డి చెప్పారు. మొక్కలు చిన్నగా ఉన్నప్పుడైతే ఎరువులను భూమిపై చల్లుతామన్నారు. దుక్కి దున్నిన 15 రోజులకు ఒకసారి, తర్వాత మూడు నాలుగుసార్లు ఎరువులు వేస్తే సరిపోతుంది. నల్లరేగడి నేలలో బ్రోకలి పంట బాగా వస్తుందని రైతు తెలిపారు. ఎర్రనేలలు దీనికి అనుకూలం కాదని రైతులు గ్రహించాలి.
బ్రోకలీ ఆకు వెనుక భాగంలో పచ్చపురుగు ఆశిస్తుంది. ఆకులు తిన్న తర్వాత పువ్వులను కూడా తినేస్తాయి. పచ్చపురుగు నివారణకు వారానికి ఒకసారి పురుగుల మందులు స్ప్రేచేయాలి. పచ్చపురుగు రాక ముందే మందు స్ప్రే చేస్తే వాటి బెడద చాలవరకు తగ్గుతుందని రైతు తెలిపారు. ఆకులు మాడిపోయే అగ్గితెగులు కూడా వస్తుంది. అగ్గి తెగులు వస్తే మొక్కలన్నీ మాడిపోతాయి. బ్రోకలీ మొక్కలకు వర్షాలను తట్టుకునే గుణం లేదు. వర్షాకాలంలో పురుగుల బెడద ఎక్కువ ఉంటుంది. మబ్బులు వచ్చినప్పుడు పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి.
బ్రోకలీ మొక్కలు అక్టోబర్ చివరిలో లేదా నవంబర్ మొదటి వారంలో నాటుకుంటే మేలు. సంక్రాంతి పండుగ నాటికి మంచి దిగుబడి వస్తుంది. ధర కూడా ఎక్కువ పలుకుతుంది. బ్రోకలీని చలికాలం, ఎండాకాలం పంటగా సాగుచేస్తే మేలు అన్నారు పాండురంగారెడ్డి. బ్రోకలీకి ఎక్కువ నీరు అవసరం ఉండదు. డ్రిప్ పైప్ ద్వారా బ్రోకలీ మొక్కలకు వారానికి ఒకసారి రెండు గంటల పాటు నీరు సరఫరా చేస్తే సరిపోతుంది. నేలలో చెమ్మ ఉంటే సరిపోతుంది. బ్రోకలి పువ్వును సరైన సమయానికి కోయకపోతే విడిపోతుంది. దీంతో మార్కెట్లో కొనేవారు ఉండరని గ్రహించాలి.
బ్రోకలీ నారుకు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎకరంలో బ్రోకలీ సాగుకు సుమారు లక్ష రూపాయల వరకు పెట్టుబడి వస్తుంది. మార్కెట్‌కు రవాణా చార్జీలు మరో లక్ష రూపాయలు వేసుకున్నా రూ.2 లక్షలు అవుతుంది. పంట సరిగా వచ్చి, ధర కిలోకు రూ.60, రూ. 70 వస్తే ఎకరానికి రూ.2 నుంచి రూ.3 లక్షలకు తగ్గకుండా లాభం ఉంటుందని పాండురంగారెడ్డి చెప్పారు. ఒకసారి పువ్వు తెంపిన తర్వాత, ఎరువులు అందిస్తే మరి కొన్నిసార్లు పిలకలు వచ్చి, వాటి నుంచి మరో 20 రోజులకే పంట వస్తుంది. కాకపోతే అవి కొద్దిగా చిన్నగా ఉంటాయి. పువ్వు బరువు తగ్గుతుంది. రాబడి కూడా తొలిసారి పంటకు వచ్చినంతగా రాదు.
ఎక్సోటికా రకమైన బ్రోకలీని జాగ్రత్తగా సాగు చేసుకుంటే లాభాలకు లోటు ఉండదని పాండురంగారెడ్డి చెప్పారు. మంచి నేల ఉండి, పెట్టుబడి పెట్టగల ఔత్సాహిక రైతులకు బ్రోకలీ సాగుతో మేలే జరుగుతుందన్నారు.





















