నిజమే..! వ్యవసాయ క్షేత్రంలో కలుపు మొలిస్తే.. ప్రధాన పంటకు శత్రువుగా భావిస్తారు అన్నదాతలు. కానీ కలుపునే బంగారంగా మార్చి, పొలంలోని అణువణువునూ ఆదాయ వనరుగా మార్చుకున్నాడో ఔత్సాహిక రైతు. కూలీలను పెట్టి రైతులు కలుపు తీయిస్తుంటారు. ఆధునిక కాలంలో కూలీలు దొరకడం కష్టం అయిపోయింది. ఖర్చు కూడా ఎక్కువే అవుతోంది. ఈ నేపథ్యంలో రసాయన శాస్త్రవేత్తలు కలుపు నివారణ కోసం గడ్డిమందు రూపొందించారు. అయితే.. కలుపు మందు వాడకంతో అనేక అనర్థాలు జరుగుతుండడంతో పాటు భూమి సారానికి నష్టం చేస్తుండడంతో ప్రభుత్వాలు బ్యాన్‌ చేశాయి.

అయితే.. పొలంలో కలుపు ఎంత వస్తే.. అంత మేలు అని చెబుతున్నారు రైతు పిట్టల శ్రీశైలం. ప్రధాన పంటకు కలుపే ప్రధాన ఆధారంగా తయారుచేసి చూపించారాయన. ప్రతిరోజూ ఆదాయం వచ్చే విధానం చూపించారు. కలుపుతో బంగారం లాంటి ఎరువు ఎలా తయారుచేయవచ్చో చేసి, నిరూపించారు. పిట్టల ఆర్గానిక్‌ ఫామ్‌ పేరిట శ్రీశైలం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అంకుశాపూర్‌లో నిర్వహిస్తున్నారు. ఉపాధి అవకాశాల కోసం ఏమి చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు తనకు వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమే ఏకైక మార్గం అనిపించిందన్నారు. దీంతో ఎకరం భూమి నుంచి నెలకు రూ.30 వేలు ఆదాయం వచ్చే మోడల్‌ను రూపొందించినట్లు చెప్పారు. ఈ విధానానికి 2024లో తాను బీజం వేసినట్లు వెల్లడించారు.కలుపును మిగతా రైతులు ఎందుకూ పనికిరాని వ్యర్థపదార్థంగా పరిగణిస్తారు. అయితే.. తాను మాత్రం దీన్ని సాగు బంగారం అని చెబుతానంటారు శ్రీశైలం. వ్యవసాయ క్షేత్రంలో ఎంత ఎక్కువ కలుపు వస్తే.. రైతుకు, భూమికి అంత మేలు అన్నారు. నేల నుంచి తీసుకున్న కలుపును తిరిగి నేలకే ఇచ్చేయడం తన సాగు విధానంలోని ప్రధాన సూత్రం అంటారు శ్రీశైలం. దీని ద్వారా మన భూమికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. కలుపుమొక్కలను 200 లీటర్ల డ్రమ్ముల్లో వేసుకొని 18 రోజుల్లో ఎరువు తయారు చేయొచ్చు. డబ్బాలో 50 కిలోల కలుపు మొక్కలు వేసి.. ఎరువు తయారు చేస్తే కిలోకు రూ.10 రూపాయలు ధర అనుకున్నా 50X10= రూ. 500 వచ్చినట్టే. కలుపు తీయడానికి కూలీలను పెట్టుకున్నా వారి కూలి డబ్బులు వచ్చేసినట్టే.వ్యవసాయ భూమిలో శ్రీశైలం రెండు అడుగుల ఎత్తు, మూడు అడుగుల వెడల్పు, 100 అడుగుల పొడవుతో బెడ్లు తయారు చేశారు. ఆ బెడ్‌పై శ్రీశైలం ఐదు రకాల పంటలు పండిస్తున్నారు. బెడ్లపై మునగ చెట్లు పెంచుతున్నారు. బెడ్ల అంచుల్లో బోడకాకర పాదులు పెట్టారు. అవి తీగజాతి కాబట్టి ఆధారాలతో పైకి పాకుతాయి. వాటికి సమీపంలో నల్ల పసుపు దుంపలు నాటారు. నాలుగో పంటగా ఆకు కూరలు వేశారు. ఐదవదిగా గుబురుగా పెరిగే టమోటా మొక్కలు పెంచుతున్నారు. దీంతో ఒకే బెడ్‌పైన స్థలం ఏమాత్రం వృథా లేకుండా పంటలు పెట్టారు. తాము పెట్టిన మొక్కలు ఒకదానితో మరొకటి పోటీపడే రకాలు కావు. దాంతో అన్ని మొక్కలకు బెడ్ల నుంచి పోషకాలు సమృద్ధిగా అందుతాయి. పంటలు ఏపుగా పెరుగుతాయి. దిగుబడి, ఆదాయం ఎక్కువగా వస్తాయి. ఈ విధానంతో రైతులకు ఏడాది పొడవునా ఆకు కూరలు, దుంపలు, కూరగాయలు, పండ్ల దిగుబడి తీయొచ్చు. ఇలాంటి సాగు పద్ధతిలో ఒక్కో బెడ్‌ నుంచి రైతుకు నెలకు తక్కువలో తక్కువ వేసుకున్న వెయ్యి రూపాయలు ఆదాయం వస్తుందననారు శ్రీశైలం.నల్ల పసుపు 9 నెలల పంట. బోడకాకర 6 నెలల పంట. పొదజాతి పంటల్లో టమోటా, బెండ, వంగ, గోకర లాంటివి పెంచుకోవచ్చు. బెడ్‌ మీద పెంచే మొక్కలు కొన్ని నెలవారీ, మరికొన్ని నాలుగు నెలలకు, ఇంకొకటి ఆరు నెలలకు, మరొకటి 9 నెలలకు ఆదాయం ఇస్తాయి. మునగ అయితే.. ఏడాదికి రెండు సార్లు దిగుబడి ఇస్తాయి. మునగాకును పౌడర్‌గా తయారుచేసి అమ్ముతున్నట్లు చెప్పారు. మునగాకు 100 గ్రాములు వంద రూపాయలకు మార్కెట్‌లో అమ్మినా.. కిలోకు వెయ్యి రూపాయలు వస్తుంది. ఏడాదికి 10 కిలోల మునగాకు పౌడర్‌ దిగుబడి వచ్చినా రూ.10 వేల ఆదాయం లభిస్తుంది. ఒకవేళ మునగాకు పౌడర్ చేసి అమ్మాలనుకోకపోతే.. దాన్ని కట్‌చేసి, బెడ్‌పై వేస్తే.. చక్కని కంపోస్ట్‌ ఎరువుగా తయారుచేసి, మొక్కలకు వేస్తే ఆరోగ్యకరమైన బలాన్నిస్తుంది. సహజసిద్ధ విధానంలో పండిన ఈ పంటలను మార్కెటింగ్‌ చేసుకునే అవసరం తక్కువగా ఉంటుంది. వినియోగదారులే నేరుగా క్షేత్రాలకు వచ్చి వాటిని కాస్త ఎక్కువ ధర కూడా ఇచ్చి కొని, తీసుకెళ్తున్నారు. తమ క్షేత్రానికి వచ్చే వినియోగదారులు అక్కడి వాతావరణాన్ని చక్కగా ఆస్వాదిస్తున్నారు. విష రసాయనాలు లేని ఆరోగ్యకరమైన ఆహార పంటలు తీసుకెళ్తున్నారు. తద్వారా రైతులు నిరంతరం ఆదాయం సంపాదించవచ్చు.శ్రీశైలం చేసిన మరో ప్రయోగం.. టబ్‌లలో మట్టి లేకుండా మొక్కలు పెంచి, ఆదాయం సంపాదించడం. టబ్‌లో మట్టి వేయకుండా కేవలం క్షేత్రం నుంచి తీసిన కలుపు మొక్కలు, బయోచార్‌, ఆర్గానిక్‌ ఎరువు ఉపయోగించి ఫలితాలు రాబడుతున్నారు. టబ్‌లలో కూడా ఐదు రకాల మొక్కలు నాటారు. ఒక వైపున టబ్‌లలో పసుపు, మరో పక్కన అరటి, వాటి సమీమపంలో తీగజాతి మొక్కలు, ఇంకా ఆకు కూరలు, దుంప జాతులు పెంచి, మంచి దిగుబడులు తీస్తున్నారు. ఈ విధానంలో మొక్కలకు గాలి, వెలుతురు సమృద్ధిగా వచ్చి, మొక్కలు ఏపుగా ఎదుగుతాయి. దుంపలు బాగా పెరుగుతాయి, ఆకు కూరలు, అరటి కాయలు, తీగజాతి పాదులు చక్కగా కాస్తాయి. డీటాక్సికేషన్‌ కోసం ప్రస్తుత కాలంలో శంకు పూలు బాగా వినియోగిస్తున్నారు. అలాగే శంకుపూలతో తయారుచేసే టీ బ్లూ టీగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. వాటిని కూడా ఒక ఆదాయ వనరుగా చేసుకోవడానికి శ్రీశైలం ఒక బెడ్‌పై శంకుపూల సాగు చేపట్టారు. మార్కెట్‌లో 100 గ్రాముల శంకుపూలకు రూ.300 నుంచి 600 వరకు ధర డిమాండ్ ఉంది. మరో బెడ్‌ మీద నల్లేరు సాగు చేశారు. సాధారణంగా ఇది అడవులలో పొలం గట్ల మీద పొదల్లో పెరుగుతుంది. దీన్ని మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల నివారణ కోసం వాడతారు. పూర్వకాలంలో మనుషుల్లో కాల్షియం పెరగాలన్నా, ఇమ్యూనిటీ సిస్టం అభివృద్ధి చెందాలన్న నల్లేరు పచ్చడి చేసి పెట్టేవారు. నల్లేరును పచ్చడి చేసి గానీ, పౌడర్ రూపంలో గానీ, ఎండబెట్టి గానీ అమ్ముకుంటే మంచి ఆదాయం వస్తుంది. రైతులు ఒకే పంట కాకుండా బహు పంటలు సాగు చేస్తే.. ఒక దానిలో ఆదాయం అనుకున్నంతగా రాకపోయినా.. మరో పంటలో వస్తుందని తెలుసుకోవాలన్నారు.ఒకే బెడ్‌ మీద పలు రకాల పంటలు వేయడం ద్వారా నేలను ఏమాత్రం వృథాగా ఉంచకుండా ఆదాయం సంపాదించడమే శ్రీశైలం ఫార్మ్‌లోని ప్రత్యేక ప్రధాన అంశం. ఈ విధానంలో ఒక్కో బెడ్ నుంచి నెలకు తక్కువలో తక్కువగా వెయ్యి రూపాయలు ఆదాయం లభిస్తుంది.