యాపిల్‌ రేగుపండును పోషకాల నిలయం అంటారు. రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఈ పండు బాగా పనిచేస్తుంది. పీచుపదార్థం అధికంగా ఉన్నందున ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. యాపిల్ రేగులో ఏ, బీ, సీ విటమిన్లు, కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, ఫైబర్ అధికంగా ఉంటాయి. బరువు తగ్గడానికి, రక్తశుద్ధికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది. యాపిల్ రేగులోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ సీ రోగనిరోధకశక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. దీనిలో ఉండే తక్కువ క్యాలరీలు, ఎక్కువ పీచు పదార్థం ఆకలిని నియంత్రిస్తాయి. బరువు తగ్గించేందుకు సహాయపడతాయి. రక్తాన్ని శుద్ధి చేసి, రక్తపోటు రాకుండా చేస్తాయి. యాపిల్‌ రేగు పండు తిన్నవారి మెదడు బాగా పనిచేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మంచి నిద్ర పట్టేలా చేస్తుంది.

భారతీయ మార్కెట్‌లో యాపిల్ బేర్‌ పండు ఒక సంచలనం అయింది. దీనికి తొలి రోజుల్లో మంచి డిమాండ్‌ ఉండేది. అయితే.. ఆ పండ్లలో నీటిశాతం ఎక్కువ, తియ్యదనం తక్కువ ఉండడంతో క్రమేపీ కనుమరుగయ్యాయి. అయితే.. బంగ్లాదేశ్‌లో విరివిగా పండించే యాపిల్ రేగుపండు ఎంతో రుచిగా ఉంటుంది. రంగు బాగుంటుంది. తింటుంటే ఇంకా బాగుంటుంది. తిన్న తర్వాత మరింత బాగుంటుంది. కడుపులో జీర్ణక్రియకు సంబంధించి ఎన్ని రకాల సమస్యలు ఉన్నా ఈ పండు తిన్న తొలి రోజు నుంచే ఉపశమనం మొదలవుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక బంజర గ్రామంలో యాపిల్ రేగు సాగుచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు క్రీస్తురాజు ఈ విషయం చెప్పారు. ఆరేళ్లుగా ఆయన యాపిల్‌ రేగు పంట ఐదెకరాల్లో పూర్తి ఆర్గానిక్‌ విధానంలో సాగు చేస్తున్నారు. యాపిల్‌ రేగు పండ్లను హోల్‌సేల్‌గా ఆయన అమ్మరు. తమ క్షేత్రం వద్దే ఫార్మ్‌ సేల్‌ విధానంలో వినియోగదారులకు నేరుగా విక్రయిస్తున్నారు.బంగ్లాదేశ్‌ నుంచి ఒక్కో మొక్క రూ.400కి కొని తెచ్చి, తమ క్షేత్రంలో నాటి సాగు చేస్తున్నట్లు క్రీస్తురాజు తెలిపారు. మొత్తం 2 వేల గోల్డెన్‌ యాపిల్‌ రేగు మొక్కలను అప్పట్లో తాను తెప్పించినట్లు చెప్పారు. నాటిన తర్వాత వాటిలో కొన్ని మొక్కలు చనిపోయినా.. మిగతా మొక్కల నుంచి మంచి ఆదాయం వస్తోందన్నారు. అంతకు ముందు ఆయన బంగ్లాదేశ్‌ వెళ్లి, అక్కడి రైతులు యాపిల్ రేగు సాగుచేస్తున్న పద్ధతులపై క్షుణ్ణంగా అధ్యయం చేశారు. తమ క్షేత్రంలో పండిన యాపిల్ రేగు పండ్లకు వినియోగదారుల నుంచి క్రేజీ స్పందన వచ్చిందన్నారు. యాపిల్ రేగు పండ్ల వినియోగదారుల్లో ఎక్కువ శాతం మంది ఓల్డ్‌ ఏజ్‌ వారే ఉంటారని చెప్పారు. యాపిల్ రేగు తిన్న వారిలో జీర్ణ సంబంధ ఇబ్బందులు, మలబద్ధకం తగ్గిపోవడంతో వారే మళ్లీ మళ్లీ వచ్చి ఈ పండ్లను కొనుగోలు చేస్తున్నారన్నారు.ప్రపంచంలోని అన్ని యాపిల్‌, అన్ని రేగు పండ్ల కన్నా యాపిల్ రేగు మేలైనదని, మేలైన రుచి, పోషకాల్లో మేలైనది, దిగుబడి అత్యధికం అని క్రీస్తురాజు చెప్పారు. తమ క్షేత్రంలో కాశ్మీరీ యాపిల్‌ రేగులో జంబో వెరైటీ సాగుచేశారు. వాటిలో ది బెస్ట్‌ అనుకునే మొక్కల నుంచి కొత్త మొక్కలను అంటు కట్టడం ద్వారా రీ ప్రొడక్షన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా క్రేజీగా ఉండే రెడ్‌ గోల్డ్‌ వెరైటీ, కాస్ల గట్టిగా ఉండి, ఎక్కువ రోజులు నిల్వ ఉండే సుందరి అనే వెరైటీ పండ్లను కూడా ఆయన పండిస్తున్నారు.ఈ నాలుగు రకాల మొక్కలు తొలిసారి నాటిన తర్వాత అన్నీ ఒకేసారి పంట దిగుబడి వచ్చేస్తుంది. అందుకే తాను ఒక్కో రకానికి కాస్త సమయం ఇచ్చి ప్రూనింగ్ చేస్తానన్నారు క్రీస్తురాజు. ముందు ప్రూనింగ్ చేసిన వెరైటీ మొక్కల నుంచి పండ్లు కోసుకుంటూ ఉంటే, తర్వాత ప్రూనింగ్ చేసిన మొక్కల నుంచి పండ్లు కోతకు వస్తుంటాయన్నారు. అలా రెండు నుంచి మూడు నెలల వరకు ఈ నాలుగు రకాల యాపిల్‌ రేగు మొక్కల నుంచి హార్వెస్ట్‌ చేస్తూనే ఉంటామన్నారు. యాపిల్ రేగు మొక్కలను నాటేందుకు సీజన్‌తో, నేల రకంతో నిమిత్తం లేదు. ఏడాదిలో ఏ నెలలోనైనా, ఎలాంటి నేలలోనైనా నాటుకోవచ్చు. అయితే.. నేలలో నీరు నిల్వ ఉండకూడదని క్రీస్తురాజు వివరించారు.యాపిల్ రేగు మొక్కలు ఆంధ్రాలో, రాయలసీమలో మే నెలాఖరు, జూన్‌లోనే పూత వస్తుంది. అక్టోబర్‌ మొదటి వారంలోనే అక్కడ హార్వెస్ట్‌ మొదలవుతుంది. తెలంగాణలో జులై ఆఖరులో కానీ ఫ్లవరింగ్ రాదు. డిసెంబర్ చివరికి హార్వెస్ట్‌ చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుకుంటే అక్టోబర్‌లో హార్వెస్ట్‌ మొదలైతే.. మార్చి నెలాఖరు వరకు యాపిల్ రేగు పండ్లు అందుబాటులో ఉంటాయి. యాపిల్‌ రేగు మొక్క నుంచి పండు తయారయ్యేందుకు 60 నుంచి 90 రోజులు పడుతుంది.యాపిల్‌ రేగు మొక్క కొమ్మలకు తొలిసారి పిందె కనిపించగానే అది ఉన్నంత వరకు కొమ్మను వదిలి చివరి వరకు పూత ఉన్నాసరే కత్తిరించాలి. దానితో అంతవరకు ఉండే కాయలు చక్కని పండ్లుగా తయారవుతాయి. పిందెలు పూర్తయ్యే లోగా కొమ్మను కత్తిరించిన చోట నుంచి ఫ్రెష్‌గా కొమ్మ పూర్తిస్థాయిలో మొగ్గతో తయారైపోతుంది. కొత్తగా వచ్చిన కొమ్మకు తొలి పిందె వచ్చే వరకు ఆగి, జానెడు పొడవైన కొమ్మ చివర కత్తిరించాలి. ఇలా మూడు నాలుగుసార్లు కొమ్మలను కత్తిరిస్తూ ఉంటే.. ముందుగా వచ్చిన పిందెలు పండ్లు అవుతాయి. అక్కడి నుంచి అంచెలుగా పండ్ల దిగుబడి వస్తూనే ఉంటుంది. ఇలా చేసినప్పుడు 90 రోజుల్లో క్రమపద్ధతిలో యాపిల్ రేగు పంట పూర్తిగా చేతికి వస్తుంది.యాపిల్‌ రేగు మొక్కలకు తెగుళ్లు రాకుండా నివారించేందుకు తాము రసాయనాలు లేని వేపనూనె, ఆముదం, కానుకనూనెలు వాడతామన్నారు. వాటితో పాటు చింతల వెంకటరెడ్డి ఫార్ములా ప్రకారం ఎర్రమట్టి ద్రావణాన్ని వినియోగిస్తామన్నారు. ఆర్గానిక్‌ పద్ధతిలో పండించే యాపిల్ రేగు పండ్ల మీద చాలా చిన్న మచ్చలు, గీతలు కనిపిస్తాయన్నారు. అదే రసాయనాలు వాడితే పండు నిగనిగలాడుతూ ఉంటుందని వివరించారు. ఆర్గానిక్‌ విధానంలో పండించిన పండుకు ఉన్న రుచి, రసాయనాలు వాడిన ఫ్రూట్‌లో రాదని క్రీస్తురాజు తెలిపారు.ఎకరం భూమిలో 600 యాపిల్ రేగు మొక్కలు నాటుకోవచ్చు. మొక్కకు మొక్కకు మధ్య ఆరు అడుగులు, వరుసల మధ్య 12 అడుగుల దూరంతో నాటుకోవాలని చెప్పారు. తొలిసారి పంట కోసిన తర్వాత ప్రూనింగ్‌ చేసేటప్పుడు ఒక్క కొమ్మను మాత్రమే మొక్కకు ఉంచాలి. మిగతావన్నీ కత్తిరించాలని క్రీస్తురాజు వివరించారు. ఎక్కువ కొమ్మలను మొక్కకు ఉంచితే భూమి మొత్తం కొమ్మలతో నిండిపోతుంది. భూమికి వెలుతురు తగలదు, భూమిలోపల వేడి పుడుతుంది. దీంతో కొమ్మలకు వచ్చి పూత మొత్తం రాలిపోతుందని చెప్పారు. యాపిల్ రేగు తోటలో గాలి, వెలుతురు ఎంత బాగుంటే అంతగా మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. దిగుబడి కూడా అదే విధంగా వస్తుంది.యాపిల్‌ రేగు మొక్కలను నాలుగు నుంచి ఆరు నెలల వరకు రెండు అడుగుల ఎత్తు పెరిగే వరకు ఎదిగిన తర్వాత నాటుతామని క్రీస్తురాజు చెప్పారు. అంతకు ముందు తమ తోటలో ఏ మొక్క నుంచి ఎక్కువ పండ్లు వచ్చాయో గుర్తించి వాటి కొమ్మలతో అంటుకడతామని అన్నారు. అంటు కట్టిన తర్వాత మూడు నెలలకు మొక్కలను నాటుకోవాలన్నారు. జనవరిలో యాపిల్ రేగు మొక్కలు నాటితే వేసవిలో పూత వస్తుంది. అయితే.. ఆ పూతను నిర్మొహమాటంగా తీసేయాలని క్రీస్తురాజు చెప్పారు. జులై నుంచి వచ్చే పువ్వులు మాత్రమే మంచి ఫలితాలు ఇస్తాయి. నవంబర్‌ ఆఖరు, డిసెంబర్‌లో యాపిల్ రేగు పంట కోసుకోవచ్చన్నారు. మొక్కకు 12 నెలల వయస్సు వచ్చేసరికి దీని తొలి పంట పూర్తయిపోతుంది.భూమిని మూడు అంగుళాల లోతుగా మట్టిని తీసి, గుంత చేసి, మొదలుకు ఉన్న కవర్‌ తీసేసి యాపిల్ రేగు అంటు మొక్కలు నాటితే సరిపోతుంది. చక్కని ఫలితాలు ఇస్తుంది. యాపిల్‌ రేగుకు ముఖ్యంగా నీటి సరఫరా అవసరం. దీన్ని బాగా మెయింటెన్ చేస్తే.. మంచి రిజల్ట్‌ వస్తుంది. మొక్కను నాటిన తొలిరోజుల్లో మూడు నాలుగు రోజులకు ఒకసారి రెండు మూడు లీటర్ల నీరు ఇస్తే సరిపోతుంది. పండు తయారవడానికి ఎక్కువ నీరు అవసరం అవుతుంది. అందుకు భూమిపై బురద లేకుండా.. నేల ఎండిపోకుండా సమంగా నీరు అందిచాలి. డ్రిప్ ద్వారా నీటిని సరఫరా చేసుకుంటే సౌకర్యంగా ఉంటుంది.మొక్కలను జనవరిలో నాటుకుంటే.. భూమి తత్వం, రైతు శ్రమ, వాతావరణ పరిస్థితిని బట్టి ఒక్కో మొక్క నుంచి తొలి ఏడాదే 25 నుంచి 50 కిలోల పండ్లు వస్తాయి. మొక్కకు కనీసంలో కనీసం 10 కిలోలు వచ్చినా ఎకరంలోని 600 మొక్క నుంచి ఆరు టన్నుల పండ్లు వస్తాయని క్రీస్తురాజు తెలిపారు. యాపిల్ రేగు పండ్లకు మార్కెట్‌ అత్యంత కీలకమైన విషయం. వీటికి హోల్‌సేల్‌, ఫార్మ్‌సేల్‌ విధానంలో అమ్ముకోవచ్చు. హోల్‌సేల్‌కు వెళితే.. కొనేవారు వీటి ధర నిర్ణయిస్తారన్నారు. హోల్‌సేల్‌ మార్కెట్‌లో కొనేవారు చెప్పిన ధరకే అమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది. ఫార్మ్‌సేల్‌ విధానంలో రైతే ఒక ధర నిర్ణయించి అమ్ముకోవచ్చన్నారు. హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలోకు 80 రూపాయలకు కొంటామని అడుగుతున్నారని క్రీస్తురాజు చెప్పారు. తమ ఫార్మ్‌లో పండించే కాశ్మీరీ రకం, సుందరి, రెడ్‌ గోల్డెన్‌ యాపిల్‌ రేగు పండ్లను కిలో రూ.150 చొప్పున ఫార్మ్‌సేల్‌లో అమ్ముతున్నట్లు తెలిపారు. వీఐపీ ఫ్రూట్‌గా చెప్పే గోల్ద్ వెరైటీలో అత్యధిక పోషకాలు ఉంటాయి, రుచి కూడా బాగా ఉంటుందని, ఆ పండ్లను కిలో రూ.250కి అమ్ముతున్నట్లు చెప్పారు. దూరప్రాంతాల్లోని వినియోగదారులకు ఆర్డర్‌ను బట్టి ప్యాకింగ్‌ చేసి పంపిస్తున్నట్లు తెలిపారు. ప్యాకింగ్‌, ట్రాన్స్‌పోర్ట్‌ కోసం కిలోకు అదనంగా రూ.50 ఛార్జి చేస్తున్నామన్నారు.మార్కెటింగ్‌ మీద అవగాహన లేకుండా యాపిల్ రేగు వ్యవసాయం చేసిన రైతులు తక్కువ ధరకే పండ్లు అమ్మేసే అవకాశాలు ఉన్నాయి. ఇతర పంటలతో పోల్చుకుంటే తక్కువ ధరైనా తమకు లాభంగా ఉందని వారు చెప్పొచ్చు. అయితే.. అప్పటికే యాపిల్‌ రేగు పండ్లు పండించి, లాభాలు ఆర్జిస్తున్న రైతుకు కూడా అతని ప్రభావం పడి నష్టపోతారు. ఎక్కువ ఎకరాల్లో యాపిల్‌ రేగు సాగు చేసి, పండ్లను కిలో రూ.30, రూ. 40కి అమ్మే బదులు ఒక ఎకరంలోనే సాగు చేసి, పండ్లను కిలో రూ.150కి అమ్మితే అంతే లాభం వస్తుందని క్రీస్తురాజు సలహా ఇచ్చారు. దీనితో రైతుకు రిస్క్‌ కూడా బాగా తగ్గుతుందన్నారు. పదిమంది తిరిగే దారి పక్కనే పంట సాగు చేస్తే.. పండ్ల అమ్మకానికి డిమాండ్‌ ఉంటుందని చెప్పారు.