వ్యవసాయం అంటేనే ఒక వ్యసనం. రైతులు అమాయకులు. ఎవరేది చెప్పినా సులువుగా నమ్మేస్తారు. నష్టాలు వచ్చినా అప్పుచేసి అయినా రైతులు మళ్లీ మళ్లీ వ్యవసాయం చేస్తూనే ఉంటారు. సాగుబడిలో ఎన్నెన్నో విధానాలు వచ్చాయి. ఒక్కొక్కరూ ఒక్కో విధానం గురించి చెబుతుంటారు. కొందరు జీవామృతం, కషాయాలు ఇలా పలు రకాల విధానాల గురించి చెబుతారు. కానీ, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం సమాధానం దొరికే అవకాశం ఉండదని మెదక్ జిల్లా కూచన్‌పల్లికి చెందిన ఆర్గానిక్‌ కార్బన్‌ ఫార్మింగ్‌ చేస్తున్న రైతు శేరి వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. ఓసీఎఫ్‌ గ్రూర్‌లో చేరి, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఆర్గానిక్ రైతు శాస్త్రవేత్త రూపినేని కాంతి ఫార్ములాలతో వ్యవసాయం చేస్తున్నారు వెంకట్రామ్‌రెడ్డి. బీర సాగులో ఓసీఎఫ్‌ పద్ధతి పాటించి మంచి దిగుబడులు తీస్తున్నారు.

రసాయన ఎరువులతో చేసిన వ్యవసాయంలో వచ్చినంత దిగుబడి ఆర్గానిక్‌ ఫార్మింగ్‌లో రాదని రుజువు అయిందని వెంకట్రామ్‌రెడ్డి చెప్పారు. రకరకాల క్రిమి కీటకాలు పంటను ఆశిస్తాయని, అందుకు దిగుబడి అంతగా రాకపోవచ్చన్నారు. వ్యవసాయంలో తాను రకరకాల ప్రయోగాలు చేసినట్లు తెలిపారు. అయితే.. ఓసీఎఫ్‌ గ్రూప్‌లో చేరి, కాంతి ఫార్ములాను వాడడం ద్వారా అలాంటి ఇబ్బందులు రాలేదని చెప్పారు. ఓసీఎఫ్‌ గ్రూపు సభ్యులకు ఎలాంటి అనుమానం ఉన్నా కాంతి సవివరంగా సమాధానం ఇస్తారన్నారు.ఓసీఎఫ్‌ గ్రూప్‌ నిర్వాహకుడు కాంతి నుంచి గ్రోత్‌ ప్రమోటర్‌, బేకింగ్ సోడా వైట్ వెనిగర్ ఫార్ములాలను బీరపాదులకు ఇచ్చినట్టు వెంకట్రామ్‌రెడ్డి చెప్పారు. తర్వాత బీర మొక్కలు ఎంతో బాగా వచ్చాయని అన్నారు. బీర పాదులకు వచ్చిన పూత రాలిపోతుంటే కెమికల్ మందు కొట్టాలని కొందరు సలహా ఇచ్చారని తెలిపారు. ఈ విషయం కాంతికి చెబితే.. మేల్, ఫిమేల్ ఫ్లవర్స్‌లో ఏవి రాలిపోతున్నాయో గమనించమని చెప్పారన్నారు. దాంతో మేల్‌ ఫ్లవర్స్‌ రాలిపోతుండడాన్ని గమనించానని చెప్పారు. రైతులు చెప్పే సమస్యలను ఓపికగా విని సరైన సమాధానాలు చెబుతారని అన్నారు. ఈ ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ డబ్బు కంటే ముఖ్యం ఆరోగ్యం గురించే ఆలోచిస్తున్నారని తెలిపారు. ఆరోగ్యం అంటే ఆహారం అని భావిస్తున్నారన్నారు. విష రసాయనాలతో పండించిన ఆహారం కంటే సహజసిద్ధంగా పండించిన ఆహారం వైపు అనేక మంది అడుగులు వేస్తున్నారని చెప్పారు.బీర పాదులకు వెంకట్రామ్‌రెడ్డి రెండు సార్లు గ్రోత్ ప్రమోటర్‌ను భూమిలో వేసినట్లు తెలిపారు. తర్వాత బేకింగ్ సోడా ఫార్ములా అందించానన్నారు. కిషన్ చంద్ర చెప్పిన అతి తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు ఇచ్చే OWDC ఫార్ములాను వినియోగించామన్నారు. ఈ ఫార్ములాలను అవలంబిస్తే.. ఏ పంటకు పట్టిన ఫంగస్‌, వైరస్‌, క్రిమి కీటకాల బెడద అయినా ఉండదని తెలిపారు. వాటితో పాటు ట్రాప్స్‌ను పొలంలో అక్కడక్కడా పెడితే.. రోజూ ఎన్నెన్నో పురుగులు వాటిలో పడుతున్నాయని చెప్పారు. అలాగే స్టికీ ప్యాడ్స్‌, సోలార్ ప్యాడ్స్‌ కూడా వాడినట్లు తెలిపారు. పంట పెట్టుబడి ఎంత తక్కువ చేస్తే.. అంత లాభం వచ్చినట్లు అన్నారు. భూమి లోపల కర్బనం శాతం పెంచితే చీడపీడలను మొక్కలు తట్టుకుంటాయి. పంట ఆరోగ్యంగా వస్తుంది. ఓసీఎఫ్‌ ఫార్ములాను అవలంబించిన తర్వాత తమ పంటలు ఎంతో బాగా వచ్చాయన్నారు. అతి తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేస్తే.. రైతు అప్పుల కోసం తిప్పలు పడాల్సిన అవసరమే ఉండదు. ఇలాంటి ఓసీఎఫ్‌ ఫార్ములా రూపొందించిన రైతు రూపినేని కాంతి పరిశోధనలు, ఆయన అభిప్రాయాల గురించి తెలుసుకుందాం.ప్రకృతి చక్రం ఎనిమిది రకాల విధానాల ఆధారంగా నడుస్తుందని కాంతి చెప్పారు. ఫంగస్‌లు, బ్యాక్టీరియాలు, వైరస్‌లు, ప్రోటోజోవా, ఆల్గీస్‌, యాక్టికో మైసిడిస్‌లు, టెర్మాయిట్స్‌, నెమటోడ్స్‌ అనే ఎనిమిది రకాల జీవరాసుల మీదే ప్రకృతి ఆధారపడుతుందన్నారు. ఈ ఎనిమిదింటి మీదే 84 లక్షల జీవరాసుల జీవిత చక్రం ఆధారపడి ఉంటుంది. వీటిలో కూడా మంచి ఉంది. చెడు కూడా ఉంది. ఆర్గానిక్‌ వ్యవసాయం అని మనం చాలా సింపుల్‌గా చెబుతుంటాం. ప్రకతిలో మంచీ చెడూ ఉన్నట్లే ఆర్గానిక్‌లో మంచి చేసేవి, చెడు చేసేవి ఉంటాయని అన్నారు. ప్రకృతి వ్యవసాయం ప్రేమికుడు, సేంద్రీయ విప్లవ పితామహుడు సుభాష్ పాలేకర్‌ ప్రకారం ప్రకృతి నుంచి సహజసిద్ధంగా లభించే వాటిని మంచి చేసే ఆర్గానిక్ అంటారని తెలిపారు.భూమిలోని ఏదైనా పదార్థాన్ని త్వరగా డీ కంపోజ్ చేసే వార్మ్‌లు ఆర్గానిక్‌ పదార్థంలో ఉంటాయి. ఏదైనా పదార్థాన్ని తిని డీకంపోజ్‌ చేసి, కాడ్మియం, ఆర్సెనిక్, మెర్క్యురీ, లెడ్ పదార్థాలను వార్మ్‌లు విడుదల చేస్తాయి. వార్మ్‌ వేరు.. ఎర్త్‌వార్మ్‌ వేర్వేరు అని రైతన్నలు తెలుసుకోవాలి. ఈ నాలుగు హెవీ మెటల్స్‌తో భూమి గట్టిపడుతుంది. ప్రపంచంలో భారీ సంఖ్యలో క్యాన్సర్ రోగులు ఉండడానికి ఈ నాలుగు హెవీ మెటల్స్‌ కారణం అని ఆయన అభిప్రాయం. క్యాన్సర్ రావడానికి ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. కానీ ప్రధానంగా చెడు చేసేవి మాత్రం ఈ హెవీ మెటల్స్‌.సుభాష్ పాలేకర్ ఆర్గానిక్‌ ఫార్మింగ్ చెప్పే సమయానికి పైన చెప్పిన నెగెటివ్‌ అంశం ఉంది. ఆధునిక యుగంలో అనేక సాంకేతిక అంశాల కారణంగా ఇప్పుడు పాజిటివ్‌ విధానంలోకి కూడా మారింది. బెనిఫిషియరీ ఫార్మింగ్‌ చాలా ముఖ్యం అంటారు దశాబ్ద కాలంగా నేచురల్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్ చేస్తున్నారు రైతు రూపినేని కాంతి. మంచి చేసే ఆర్గానిక్ ఫార్మింగ్‌ అంటే ఆర్గానిక్‌ కార్బన్‌ ఫార్మింగ్‌లో మంచి ప్రావీణ్యం సాధించారు. ఆర్గానిక్‌ కార్బన్‌ ఫార్మింగ్‌ను సైంటిఫిక్‌గా చేస్తున్నారు. ఈ విధానంలో పెట్టుబడి చాలా తక్కువ.. దిగుబడి, ఆదాయం బాగా ఎక్కువ సాధించడం ఎలాగో వివరించారు. అలాగే బేకింగ్ సోడా ఫార్ములా గురించిన ఆయన వివరించారు.భూమిలో సేంద్రియ కర్బనం పెరిగితే భూసారం పెరుగుతుంది. దీంతో పంటలు సారవంతంగా పెరిగి, అధికం వ్యవసాయ దిగుబడులు ఇస్తాయి. సా+ ఇంద్రియ క్రియనే సేంద్రియ అంటారన్నారు. మంచి ఆర్గానిక్‌ విషయానికి వస్తే.. సేంద్రియ క్రియ మట్టిలో జరుగుతుంది. 1960లలో ఒక శాతం కర్బనం స్థాయిలు ఉన్న నేలలు ఇప్పుడు సగటున 0.2, 0.3కి పడిపోయాయని కాంతి చెప్పారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో కూడా భూ కర్బనం పెరగడానికి చాలా సమయం తీసుకుంటోంది. పండ్లు, దీర్ఘకాల దినుసులు పండించే వారికి దీంతో పెద్ద ఇబ్బందేమీ ఉండదు. కానీ తక్కువ కాలపు పంటలైన కూరగాయలు, ఆకుకూరలు పండించే రైతులకు గో ఆధారిత ఫార్మింగ్‌ సరిపడదు అని కాంతి నమ్మకం. మల్టీ లేయర్ ఫార్మింగ్‌కు అయితే.. ఈ విధానం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు అన్నారు.భూమిలో త్వరగా కర్బనాన్ని ఎలా పెంచాలనే దాని గురించి కాంతి వివరించారు. దీనిపై కరోనా తర్వాత కాంతి పరిశోధన చేశారు. కర్బనం పెంచేందుకు ఏది తీసుకోవాలి? దేనితో రైతుకు త్వరగా ఫలితం కనిపిస్తుందని పరిశోధించినట్లు తెలిపారు. అప్పటి వరకు రసాయనాలతో సాగు చేసిన భూమిలో తరువాతి పంట నుంచే మంచి జరుగుతుందా? లేదా? అని శోధించినట్లు చెప్పారు. నేచురల్ ఫార్మింగ్‌లో మంచి ఫలితాలు రావాలంటే భూమిలో కర్బనం పెరగాలి. భూమిలో కర్బనం పెరిగితే పోషక వ్యవస్థ పెరుగుతుంది. పోషక వ్యవస్థ వల్ల మొక్కకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నేలకు పోషక విలువల శక్తిని వేగంగా ఎలా అందించాలనే ప్రశ్న వెంటాడడంతో తాను కార్బన్‌ ఆర్గానిక్‌ కార్బన్‌ విధానాన్ని రూపొందించానని అన్నారు.భూమిలో సేంద్రియ కర్బనం పెంచేందుకు అనేక రకాల మార్గాలు ఉన్నాయి. ఆర్గానిక్‌ కార్బన్ ఫార్మింగ్‌తో భూమిలో మైక్రో బయాలాజికల్ యాక్టివిటీ పెరుగుతుంది. ఆర్గానిక్‌ కార్బన్ ఫార్మింగ్‌లో రైతు తెలుసుకోవాల్సిన విషయం ‘స్పిన్‌’. S అంటే విత్తనం, P అంటే పెస్ట్స్‌, ఇనెసెక్ట్స్‌ (పురుగులు, దోమలు), I అంటే ఇన్ఫెక్షన్లు (తెగుళ్లు), N అంటే న్యూట్రియంట్లు (పోషకాలు) ఈ నాలుగు గురించి తెలిస్తే.. రైతు పంటల సాగులో సక్సెస్‌ అవుతాడు. ఈ నాలుగు అంశాలతో భూమిలో ఆటోమేటిక్‌గా కర్బనం పెరుగుతుంది. ఈ విధానంలో పది రోజుల్లోనే భూమి గుల్లబారుతుంది. ఆవు మూత్రం భూమికి ఇస్తే.. హానికరమైన జీవులు చచ్చిపోతాయి. బెల్లం అందిస్తే.. వానపాములు భూమిని గుల్లబారుస్తాయి. ఆర్గానిక్ కార్బన్‌తో పాటు జీవామృతం భూమికి ఇస్తే రైతు ఊహించని ఫలితాలు వస్తాయి. లక్షల ఖర్చు పెట్టి రసాయనాలతో వ్యవసాయం చేసే విధానంతో సమానంగా ఆర్గానిక్‌ కార్బన్ ఫార్మింగ్‌లో వస్తాయి.రసాయనాలు వాడిన భూమిలో ఉండే క్రిమి కీటకాలకు వాటిని తట్టుకునే బలం వస్తుంది. తర్వాత తర్వాత రసాయనాల డోస్ పెంచాల్సి వస్తుంది. విష రసాయనాలను తట్టుకునే శక్తి క్రిమి కీటకాలకు వస్తే.. కషాయాలు పనికిరావు అంటారు రూపినేని కాంతి. అందుకే బేకింగ్ సోడా ఫార్ములాను తాను తొలిసారిగా ప్రయోగించినట్లు కాంతి తెలిపారు. కీటకాలను వీలైత్‌ ట్రాప్‌ చేయాలి. లేదా భౌతికంగా చంపాలని అంటారాయన. కాంతి రూపొందించిన వ్యవసాయ విధానంలో పాలేకర్ చెప్పిన జీవామృతం ఉంది. జీవామృతం కాకపోతే డాక్టర్‌ క్రిషన్ చంద్ర అందించిన ఓల్డ్ ఒరిజినల్‌ డీ కంపోజర్‌ (OWDC) ఉంది. తాను రూపొందించిన ఆర్గానిక్‌ కార్బన్‌ ఫార్ములాతో పాటు జీవామృతం కానీ, OWDC కాని భూమికి ఇస్తే.. 48 గంటల్లో ఫలితం వస్తుందన్నారు. ఆర్గానిక్ కార్బన్ ఫార్మింగ్‌లో తెగుళ్ల నివారణ చాలా తేలిక అని చెప్పారు. తెగులు రాక ముందు జీవామృతం వాడితే అవి రాకుండా కాపాడుతుంది. తెగుళ్లు వచ్చిన తర్వాత జీవామృతం పనిచేయదన్నారు. పుల్లని మజ్జిగ అన్నింటికీ పరిష్కారం కాదన్నారు. తెగుళ్ల నివారణకు జీవామృతం కంటే 200 లీటర్ల నీటికి 10 లీటర్ల ఆవు మూత్రం కలిపి కొట్టినా, 200 లీటర్ల నీటిలో రెండు లీటర్ల ఆవుమూత్రం, ఆవుపేడ బాగా పిసికి కొట్టిన తెగుళ్లు నివారణ అవుతాయి.భూమిలో పోషకాలు లేకుండా జీవామృతం ఇస్తే సరిపోదన్నారు క్రాంతి. భూమిలో పోషకాలు ఉంటే.. మొక్కలు వాటిని గ్రహించే స్థితి లేకపోతే బ్యాక్టీరియాలు వెళ్లి ఆ పోషకాలను మొక్కలు గ్రహించేలా చేస్తాయనేది సాధారణ విషయం అన్నారు. భూమి పై పొరల్లో కర్బనం ఉంటే వేరు వ్యవస్థ చక్కగా తయారవుతుంది. తద్వారా భూమి లోపలి వరకు చొచ్చుకు వెళ్లి, పోషకాలను గ్రహిస్తాయి.ఆర్గానిక్ కర్బనం ఫార్మింగ్‌ అంటే OCF విధానంలో మొక్కలు 24 గంటల్లో కర్బనాన్ని గ్రహించే స్థితికి తీసుకెళ్లడం SPIN కార్యక్రమం ప్రధాన అంశం అన్నారు క్రాంతి. ఆ వెంటనే జీవామృతమైనా, OWDC అయినా ఇస్తే మొక్కలు మరింత ఆరోగ్యంగా తయారవుతాయి. అతి తక్కువ ఖర్చుతో భూమిలో సారం పెంచడం OCFలో ముఖ్యమని చెప్పారు. ఈ పద్ధతిలో ఒక ఎకరానికి నెలకు రూ.350 ఖర్చు చేస్తే సరిపోతుంది. మొక్కలపై స్ప్రే చేసేందుకు మరో రూ.350 ఖర్చు కావచ్చు. దీనితో పాటు బయోలాజికల్‌ కంట్రోల్ ఏజెంట్స్‌ జీవామృతం, OWDC, వాము కానీ డాక్టర్ క్రిషన్ చంద్ర చెప్పిన NPK కానీ ఇస్తే అద్భుతంగా పనిచేస్తాయి. భూమిలో ఫంగస్‌ కుటుంబంలోని భవేరియా బాసియానా లాంటి సజీవ ఎంజైమ్స్‌ ఎన్నో ఉంటాయి. ఇవి పెస్ట్ కంట్రోల్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. ఏ భూమికి ఎలాంటి కర్బనం పౌడర్ ఇవ్వాలో, ఏ ప్రాంతం భూమికి కర్బనం పౌడర్‌ ఎలా ఉండాలో తాను ఆయా పరిస్థితులను బట్టి కర్బనం పౌడర్ తాను రూపొందించి ఇస్తానన్నారు.సంకరం కాని నాటు విత్తనాన్ని దేశవాళీ విత్తనం అని చెప్పొచ్చు. అంటే స్థానికంగా రైతు పండించే విత్తనం అన్నమాట. ప్రకృతి వ్యవసాయం అంటే.. దేశవాళీ విత్తనం అంటే దిగుబడి తక్కువ వస్తుందనే అపోహను రైతుల్లో కల్పించారని కాంతి చెప్పారు. సహజసిద్ధ వ్యవసాయంలో ఆర్గానిక్‌ కార్బన్ ఫార్మింగ్‌, స్పిన్‌ అనేది ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా సాగు చేస్తే.. భూమిలో కర్బనం శాతం పెరుగుతుంది. స్పిన్ కార్యక్రమం అనుసరించే రైతులు రైతు శాస్త్రవేత్తలు అవుతారని కాంతి చెప్పారు.

రసాయనాల వాడకం మానేస్తే.. భూమి ఊపిరి తీసుకుంటుంది. రసాయనాలు వాడకపోతే.. భూమి జీవిస్తుంది. జీవనాన్ని ఇస్తుంది. నేచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్‌తో భూమి సారవంతం అవుతుంది. పంట దిగుబడులను సమృద్ధిగా ఇస్తుంది.