తమిళనాడులోని పొల్లాచికి చెందిన 58 ఏళ్ల రైతు వల్లువన్ కృషి అతనికి ‘UN FAO సాయిల్ ఫార్మర్ హీరో’గా గుర్తింపు తెచ్చింది. గడిచిన 19 ఏళ్లుగా వల్లువన్ అవలంబిస్తున్న ప్రత్యేక సాగు విధానం ఆయనకు ఆదాయం పెంచింది. వల్లువన్ వార్షిక ఆదాయం నష్టాలను అధిగమించి ఎకరానికి రూ. 2.5 నుండి 3 లక్షలకు పెరిగింది. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, నీటి వినియోగం తగ్గించేందుకు, పొల్లాచి ప్రాంతం ఎదుర్కొన్న తీవ్ర కరువు పరిస్థితులను తట్టుకోడానికి సహాయపడింది. ప్రణాళికబద్ధంగా రూపొందించిన వ్యవసాయ పద్ధతి దీనికి తోడ్పడింది.
కొబ్బరి సాగుకు ప్రసిద్ధి చెందిన తమిళనాడు పొల్లాచి ప్రాంతంలోని ఇతర రైతుల మాదిరే వల్లువన్ ఒకప్పుడు ముఖ్యంగా కొబ్బరిపైనే ఆధారపడేవారు. అయితే.. ఆయన పెట్టిన పెట్టుబడికి లాభం రాకపోగా.. నష్టాలే వచ్చేవి. ఒక్కో కొబ్బరిచెట్టు నిర్వహణకు ఏటా సుమారు రూ. 500 ఖర్చు చేసేవారు. కానీ.. ఆ చెట్టు ద్వారా వచ్చే ఆదాయం కేవలం రూ. 300 మాత్రమే ఉండేది. దీంతో వల్లువన్ ఒక్కో కొబ్బరి చెట్టుపైనా రూ. 200 నష్టపోయేవారు.
‘మా ప్రతి కొబ్బరి చెట్టు నుంచీ నష్టం వచ్చేది. ఆ నష్టాన్ని అధిగమించేందుకు ఏదో ఒక పరిష్కారం కనుగొనాలని అనిపించింది’ అని వల్లువన్ చెప్పారు. ఈ క్రమంలో ఆయన 2009లో తన వ్యవసాయ విధానాన్ని పునఃసమీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. కొబ్బరిని ఏకైక ఆదాయ వనరుగా నిర్వహించేందుకు బదులు స్థలం, నీరు, పోషకాలు వివిధ పంటలకు అందేలా ఉండే ‘అంచెలంచెల సాగు విధానం’ రూపొందించడం వల్లువన్ మొదలు పెట్టారు. తద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచడమే కాకుండా, నష్టాన్ని తగ్గించడాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. క్రమేపీ ఆయన తమ పొలంలో వివిధ స్థాయిల్లో పెరిగే పంటల సాగు ప్రారంభించారు.
కొబ్బరి చెట్ల నీడలో జాజికాయ, మిరియాలు, ఏడు రకాల అరటి, పసుపు, కంద, కరివేపాకు వంటి పంటలు సాగు చేశారు. నీడను, జీవద్రవ్యాన్ని అంటే బయోమాస్, పర్యావరణ సమతుల్యతను అందించే పలు చెట్ల జాతులను ఆయన నాటారు. అలా ఇప్పుడు వల్లువన్ ఆ పొలంలో 14 రకాలకు పైగా పంటలు పండిస్తున్నారు. కొన్ని పంటలు ఏడాది పొడవునా ఆదాయం అందిస్తే, మరికొన్ని నేల సారాన్ని మెరుగుపరిచేందుకు, తేమను నిలిపి ఉంచేందుకు, లేదా సూర్యరశ్మిని, స్థలాన్ని మరింత సద్వినియోగం చేసుకోడానికి సహాయపడతాయి. ఇవన్నీ కలిసి ఒకే రకం పంట పండించే తోటలా కాకుండా సహజ పర్యావరణ వ్యవస్థలా వ్యవసాయ క్షేత్రాన్ని మారుస్తాయి.
ఏక పంట నుంచి బహు పంటలకు వల్లువన్ మార్పు చేసినప్పుడు అతనికి ఎకరం భూమి నుంచి ఏడాదికి సుమారు రూ. 30 వేల ఆదాయం వచ్చేది. క్రమేపీ ఆ ఆదాయం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు వల్లువన్ అదే వ్యవసాయ క్షేత్రం నుంచి ప్రతి ఏటా ఎకరానికి రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్నారు. నేల ఆరోగ్యం మెరుగయింది. నేలలోని సేంద్రియ కర్బనం మొదటి సంవత్సరం 0.5 శాతం నుండి ఏడవ ఏటకు 1.56 శాతానికి పెరిగింది.
ఆరోగ్యకరమైన నేల ఎక్కువ తేమను నిలుపుకుంటుందని వల్లువన్ అనుభవంతో చెప్పారు. మొక్కలు బలంగా పెరిగేందుకు తేమ బాగా తోడ్పడుతుంది. అలాంటి భూమిలో బయటి నుంచి పోషకాల అందించడంపై మొక్కలు ఆధారపడటం తగ్గిపోతుంది. మెరుగైన నేల మంచి దిగుబడులు ఇచ్చేందుకు సహాయపడుతుంది అంటారాయన.
వల్లువన్ వ్యవసాయ విధానంలో నీటి సంరక్షణ మరో కీలక అంశం. నేలను వత్తుగా కప్పే మల్చింగ్ పొర బాష్పీకరణను తగ్గించి, పైపొర మట్టిని రక్షిస్తుంది. వర్షం వచ్చినప్పుడు నీటి గుంతలు దానిని తీసుకొని నిల్వ చేస్తాయి. అదే సమయంలో మొక్కల కొమ్మలు, ఆకులు నేలకు నీడను, చల్లదనాన్ని అందిస్తాయి. ఇవన్నీ కలిసి భూమికి బయటి నుంచి నీరు అందించే అవసరాన్ని తగ్గించాయి. వల్లువన్ పొలానికి ఒకప్పుడు అవసరమైన నీటిలో ఇప్పుడు పదో వంతు మాత్రమే తీసుకుంటోంది. తమ క్షేత్రంలోని భూమి ఆరోగ్యం మెరుగయ్యే కొద్దీ సాగునీటి అవసరాలు మరింత తగ్గుతాయని వల్లువన్ భావిస్తున్నారు.
2017 నాటి తీవ్ర కరువు సమయంలో వల్లువన్ వ్యవసాయ నమూనా విలువ ఇతర రైతులకు స్పష్టంగా అర్థమైంది. భూగర్భ జలమట్టాలు ఆ సమయంలో వెయ్యి అడుగులకు పైగా కిందికి పడిపోయాయి. ఆ ప్రాంతంలో సుమారు రెండేళ్ల పాటు అత్యంత తక్కువ వర్షపాతం నమోదైంది. అనేక మంది రైతులు కొబ్బరి తోటలను కాపాడుకోవడానికి తీవ్రంగా కష్టపడ్డారు. అయితే.. వల్లూవన్ పొలం మాత్రం దాని మల్చింగ్ కవర్, చెట్ల నీడ, వర్షపునీటి సేకరణ నిర్మాణాల వల్ల తేమను బాగా నిలుపుకుంది. ఆ పొలం ఒకే పంట కాకుండా బహు పంటలు మనుగడ సాగించింది.
వైవిధ్యం భరితమైన సాగు ద్వారా వ్యవసాయం మరింత ఉత్పాదకంగా మారగలదో వల్లవన్ నిరూపించారు. ఇప్పుడు వల్లువన్ పొలాన్ని దగ్గరగా చూస్తే సాధారణ కొబ్బరి తోటలా అనిపించదు. ఎత్తైన కొబ్బరి చెట్ల నీడలో అరటి మొక్కలు పెరుగుతున్నాయి. మిరియాల తీగలు కొబ్బరిచెట్ల పైకి పాకుతున్నాయి. పసుపు, కంద, కరివేపాకు వంటివి నేలకు తక్కువ ఎత్తులో చక్కగా పెరుగుతున్నాయి. జాజికాయ చెట్లు ఇతర అనేక రకాల మొక్కలతో కలిసి ఒకే భూమిలో బహుపంటలు పండుతున్నాయి. వల్లువన్‌కు లాభాలు తెచ్చిపెడుతున్నాయి.





















