లక్షలు పెట్టుబడి పెట్టి, మరుసటి రోజు నుంచే ఆదాయం, లాభం రావాలనే కోరిక గేదెల డెయిరీ ఫార్మ్‌లో పనికిరాదు. మూడేళ్లయినా డెయిరీ పార్మ్ను జాగ్రత్తగా నిర్వహిస్తే.. ఆదాయం, లాభమూ బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పుట్టిన ఒక దూడ ఎదగాలి, అది ఎదగాలి. సంతానోత్పత్తికి సిద్ధం అయిన తర్వాతే కదా మనకు దాని నుంచి ఆదాయం వస్తుంది. అలాగే ఒకటి కానీ లేదా రెండు గేదెలను పెంచుకుంటే పరవాలేదు. ఇంటి మనుషులే వాటిని చూసుకుంటారు కాబట్టి నష్టం వచ్చే అవకాశం ఉండదు. అదే ఒకేసారి లక్షలు పెట్టుబడి పెట్టి భారీ స్థాయిలో డెయిరీ ఫార్మ్ పెట్టాలనుకునే వారు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని దిగితే మంచిది. అది కూడా సొంత డబ్బులతో డెయిరీ ఫార్మ్ పెడితే ఇబ్బంది అంతగా ఉండకపోవచ్చు. డెయిరీ ఫార్మ్ నుంచి వచ్చే ఆదాయం, నిర్వహణ ఖర్చులు కనీసం మూడేళ్ల వరకు అయినా వాటికవే సరిపోయేలా చూసుకోవాలి. మూడేళ్ల తర్వాత మనం ఊహించిన దానికన్నా ఎక్కువ రిటర్న్స్ ఉంటాయి.
అప్పు చేసి డెయిరీ ఫార్మ్్ పెడితే నష్టం తప్పకపోవచ్చు. కానీ.. బ్యాంకు లోన్ ఇస్తే.. డెయిరీ ఫార్మ్ నడిపించవచ్చు. ఎందుకంటే దాంట్లో సగం డబ్బులు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది కాబట్టి. దాని వల్ల కష్టం, నష్టం అంతగా ఉండకపోవచ్చు. మొత్తం అప్పు తెచ్చి గేదెలను పెడితే.. దానికి వడ్డీలు కట్టలేక ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడిని తట్టుకోలేక ఒక గేదెను అమ్మాలంటే అక్ష రూపాయలకు కొన్నదాన్ని 50 వేలే రావచ్చు. అక్కడే పాడి రైతుకు 50 వేల రూపాయలు నష్టం వచ్చినట్లు అవుతుంది. సరిగ్గా ఈ సూత్రాలనే సరిగా అర్థం చేసుకున్న లక్ష్మీరాజ్యం ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వకుండా 100 గేదెలతో డెయిరీ ఫార్మ్‌ను ఒంటరిగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
కడప జిల్లా బద్వేలులో లక్ష్మీరాజ్యం బర్రెలతో ఏఎస్ఆర్ ఫార్మ్స్ పేరుతో డెయిరీ ఫార్మ్ నడుపుతున్నారు. పూర్వకాలం నుండీ పాడిపంటలు అనే నానుడి ఉంది. ఒకవేళ పంట దెబ్బతిన్నా కూడా పాడి ఉన్న ఇల్లు కళకళలాడుతుందంటారు. కవ్వ ఆడిన చోట కరువు ఉండదని కూడా పూర్తకాలపు సామెత. అంటే మజ్జిగ చిలికే కవ్వానికి పని ఉండే ఇంట్లో కరువు రాదనేవారు. తన పుట్టించి నుంచి ఒక బర్రెను తీసుకొచ్చిన లక్ష్మీరాజం దాని నుంచి ఆదాయం పొందుతూనే దానికి పుట్టిన పిల్లలతో పది బర్రెల మందను తయారు చేసినట్లు చెప్పారు.
కడప జిల్లాలో ఎండ వేడి ఎక్కువే ఉంటుంది. దాంతో పాటు లక్ష్యీరాజ్యం డెయిరీ ఫార్మ్‌ను కొండల సమీపంలో ఏర్పాటు చేశారు. దీంతో గేదెలకు వేడి ఎక్కువై ఇబ్బంది పడతాయని పశువైద్యుడి సూచనతో తాను ఈత కొలను ఏర్పాటు చేశారు. ఈత కొలనులో గేదెలు రోజుకు కనీసం గంట సమయమైనా పడుకుంటే చాలా రిలాక్సవుతుంది. వాటికి ఎలాంటి ఒత్తిడీ ఉండదు. పాలు తగ్గకుండా ఇస్తాయి. మేత తగ్గినా పర్వాలేదు.. బర్రెకు ఎండ సమయంలో చల్లదనం ఉండాలని ఆ డాక్టర్ చెప్పారన్నారు. అందుకే బర్రెల కోసం ఎత్తుగా రేకుల షెడ్లు వేశామని, పగటిపూట తమ మనుషులు బర్రెలపై అప్పుడప్పుడూ పైపుతో నీళ్లు చిమ్ముతూ ఉంటారన్నారు. వారు రాత్రి పడుకునే ముందు మాత్రం పైనుంచి నీటి తుంపరలు పడేలా ఏర్పాటు చేసిన ఫాగర్లను ఆన్ చేస్తారన్నారు. దాంతో తమ ఫార్మ్‌లోని గేదెలకు ఎంత ఎండ ఉన్నా ఇబ్బంది పడకుండా ఉంటాయని చెప్పారు.
గేదెలకు పుట్టిన దూడలు పెరిగి పెద్దవైతే.. వాటిని అమ్మినా.. పునరుత్పత్తి కోసం వినియోగించినా ఆదాయం బాగా వస్తుంది. ఉదాహరణకు పది గేదెలు పెంచితే పది దూడలు పుడితే అవి పెరిగి పెద్దయ్యే మూడేళ్లకు వాటిని అమ్మితే ఆదాయం వస్తుంది. అదే వంద గేదెల నుంచి వంద దూడలు పెరిగితే ఆదాయం అదే దామాషాలు ఉంటుంది. అన్నింటినీ ఒకే సారి కాకపోయినా ఏడాదికి పది దూడలను అమ్మితే కనీసం రూ.10 లక్షల ఆదాయం వస్తుంది.
ఎదకు వచ్చిన గేదెను మురికినీళ్లలోకి వెళ్లనివ్వకూడదు. గేదెను దున్నపోతుతో సంగమం చేయించిన తర్వాత కొన్ని రోజులు మురికినీటిలో దిగనిస్తే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయని పశువైద్య నిపుణులు చెప్పారని లక్ష్మీరాజ్యం తెలిపారు. గేదె కూడా ప్రాణి కాబట్టి.. దాన్ని ఉంచే పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. మంచి ఆహారం అందించాలి. ఆ ఆహారం కాస్త తక్కువ డబ్బులతో వచ్చేలా చూసుకోవాలని లక్ష్మీరాజ్యం చెప్పారు. గేదెకు మనం ఏమి పెడుతున్నాం.. దాన్నుంచి మనకు ఏమి ఆదాయం వస్తుందనే లెక్క తప్పకుండా చూసుకోవాలి. గేదెలు ఆరోగ్యం ఉండి, పునరుత్పత్తి చేసినంత కాలం వాటి విలువ, ధర తగ్గిపోవు. పశువులు వేసిన పేడ వేసి గడ్డిని పెంచితే.. దాని ఆహారం కోసం డబ్బుల ఖర్చు ఉండదు.
దూడలు త్వరగా ఎదకు రావాలంటే మినరల్ మిక్సర్ ఇవ్వడంతో పాటు వాటిని స్వేచ్ఛగా పొలంలో వదిలిపెట్టాలని లక్ష్మీరాజ్యం వివరించారు. అవకాశం ఉన్నవారు జొన్నచేను పాలకంకిగా ఉన్నప్పుడు కోసి మేతగా వేసినా త్వరగా ఎదకు వస్తాయి. సజ్జలు, జొన్నలు, ఉలవలు, పెసలు, సెనగలు ఏవి తక్కువ ధరకు వస్తే వాటిని మొలకలు కట్టి దూడలకు ఇచ్చినా సరిపోతుంది. మొలకెత్తిన గింజలకు ఫంగస్ రాక ముందే కొంచెం మొలక రాగానే దూడలకు ఆహారంగా ఇవ్వాలి. ఇలా మొలకలను ఒక రోజే పెద్దమొత్తంలో ఇచ్చి సరిపోతుందనుకోకూడదు. కొంచెం కొంచెం కనీసం పది నుంచి 15 రోజులైన దూడలకు మొలకలు పెడితే ఫలితాలు బాగుంటాయన్నారు. ఇవన్నీ చేసినా దాని గర్భాశయంలో ఏవైనా తేడాలు ఉండి దూడలు చూలు కట్టకపోతే బొటవేలు, చూపుడు వేలితో పట్టగలిగినంత మైలతుత్తంను ప్యాకెట్లో కట్టి ఆహారంలో పది రోజులు అందిస్తే తప్పకుండా చూలు కడుతుందన్నారు.
పిల్లలు పెద్దవారై, వేరే చోట్లకు వారు వెళ్లినప్పుడు తాను తన భర్త చాల వరకు గేదెలను అమ్మేశామన్నారు. అయితే.. తర్వాత కటింగ్‌కు వెళ్లే దూడలను తక్కువ ధరకే కొన్నట్లు లక్ష్మీరాజ్యం చెప్పారు. తాను తీసుకొచ్చినప్పుడు బలహీనంగా ఉన్న దూడలకు సరైన పోషణ అందించి, తోటలో వదిలిపెట్టినట్లు చెప్పారు. క్రమేపీ అవి బలంగా తయారైన తర్వాత డైయిరీ ఫార్మ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గేదెలు ఉన్న చోట పరిశుభ్రత పాటిస్తే.. మంచి ఆహారం అందిస్తే.. చాలా వరకు వాటికి రోగాలు రావని అన్నారు. అయితే.. వాటికి డీవార్మింగ్ కరెక్ట్‌గా ఇవ్వాలి. మినరల్ మిక్సర్ దాణాగా ఇవ్వడం వల్ల అవి సక్రమంగా చూలు కడుతున్నాయన్నారు. గ్యాస్ ట్రబుల్ లాంటివి వచ్చినప్పుడు వామ్ము- బెల్లం కలిపి పెడతానన్నారు. లేదా అల్లం- బెల్లం, లేదా శొంఠి- కలిపి ఇస్తానన్నారు.
తమ డైయిరీ ఫార్మ్‌లో వచ్చే పాలను సొంతంగానే లీటర్ రూ.70కి అమ్ముతామని లక్ష్మీరాజ్యం చెప్పారు. ఒకవేళ మిగిలిన పాలు ఉంటే సెంటర్‌కు రూ.60కి పోస్తామన్నారు. అంత కంటే తక్కువ ధరకు అమ్మితే తమకు గిట్టుబాటు కాదని చెప్పారు. డైయిరీ ఫార్మ్‌తో జీవితం బాగుంటుందనే నమ్మకం ఉంది కాబట్టే తాను చదువుకున్నతన కొడుకుని ఇదే రంగంలో ఉంచినట్లు చెప్పారు. ఉద్యోగం చూసుకొని వెళ్లాలనుకుంటే అభ్యంతరం లేదని కూడా తన కొడుకుకు చెప్పానన్నారు. మొదట్లో తాను ఉద్యోగానికి వెళ్తానని చెప్పిన తన కొడుకు ఆరు నెలలు గడిచేసరికి ఫార్మ్‌లో బాగా అలవాటు పడినట్లు తెలిపారు. మనసు పెట్టి చేస్తే.. డెయిరీ ఫార్మ్‌లో నష్టం వచ్చే అవకాశం ఉండదన్నారు. ప్రకృతి విపత్తులు పశుపోషణలో చాలా తక్కువ అన్నారు. తాతలు ముత్తాతలు, తండ్రుల నుంచి వస్తున్న డైయిరీ ఫార్మ్‌తో కాస్త ఆలస్యమైనా ఆదాయం, లాభం బాగుంటాయన్నారు లక్ష్మీరాజ్యం.





















