ఈ ఆధునిక సమాజంలో ఆహారంలో క్యాప్సికం వాడకం బాగా పెరిగింది. పట్టణ, నగర వాతావరణంలో నివసిస్తున్న అనేక మంది క్యాప్సికంను వినియోగిస్తున్నారు. క్యాప్సికం పట్ల ఇప్పుడు ఎంతో మోజు పెరిగింది. ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే పలువురు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం అధికంగా లభించి క్యాప్సికం పట్ట మక్కువ పెంచుకుంటున్నారు. కేలరీలు తక్కువ ఉండడం వల్ల క్యాప్సికం వాడిన వారి శరీర బరువు తగ్గుతుంది. దీనిలోని పీచుపదార్థం కారణంగా జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్ధకం, అజీర్తిని తగ్గిస్తుంది.
క్యాప్సికంలో ఉండే పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రక్తపోటును నియంత్రిస్తాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తాయి. దీనితో గుండె ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తేల్చి చెప్పారు. క్యాప్సికంలో ఉండే విటమిన్ సీ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. హాని కలిగించే ఫ్రీరాడికల్స్ బారి నుండి క్యాప్సికం తీసుకునే వారికి రక్షణ ఉంటుంది. పచ్చరంగు క్యాప్సికంలో ఎక్కువగా ఉండే విటమిన్ కే ఎముకలకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. లైకోపీన్ ఉండే ఎరుపు రంగు క్యాప్సికం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. క్యాన్సర్ ప్రమాదం లేకుండా చేస్తుంది.
పలు ప్రయోజనాలు కలిగించే క్యాప్సికం పంటలో మెరుగైన పద్ధతి షేడ్‌నెట్ కింద సాగులో ఉపయోగాలు, కష్ట నష్టాల గురించి తెలుసుకుందాం. షేడ్‌నెట్ కింద క్యాప్సికం సాగు కాస్త ఎక్కువ ఖర్చుతో కూడినదే. అయినప్పటికీ ఈ విధానంలో రైతుకు మంచి లాభాలు రావడం దీని ప్రత్యేకత. అలాగే.. మిర్చి పంట సాగులో ఎదురయ్యే త్రిప్ట్స్, మైట్స్ లాంటి కీటకాల బెడద దీనికీ ఉంటుంది. ప్రతివారమూ క్రిమి కీటకాల నివారణకు మందులు స్ప్రేయాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా ఒక పద్ధతిలో ఎరువులు అందించాలి. షేడ్‌నెట్ కింద క్యాప్సికం పంటకు రైతు నిరంతర పర్యవేక్షణ చాలా ముఖ్యం.
క్యాప్సికం సాగు అంటే ఒక పుస్తకం లాంటిదని, దీని గురించి పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే సాగులో దిగితే మంచిదంటారు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కుర్వగూడలో ఆరు ఎకరాల్లో షేడ్‌నెట్ కింద క్యాప్సికం పండిస్తున్న అనుభవంతో రైతు రాజు చెప్పారు. బెంగళూరులో షేడ్‌నెట్‌లో క్యాప్సికం పండిస్తున్న పలువురు రైతుల అనుభవాలు, సాగు విధానం తెలుసుకొన్నట్లు తెలిపారు. విత్తనాలను ప్రో ట్రేలలో పెట్టినప్పటి నుంచి పంట తొలి కోత వచ్చే వరకు తమకు ఎకరానికి రూ.4 లక్షల ఖర్చు అయిందన్నారు రాజు.
ముందుగా భూమిని రెండుసార్లు బాగా దున్ని, ఎకరానికి 30 ట్రాక్టర్ల పశువుల ఎరువు వేసి, మరోసారి బాగా కలియదున్ని, రెండుసార్లు కల్టివేటర్, రొటావేటర్ వేసి, 3 అడుగుల వెడల్పుతో, ఒకటిన్నర అడుగుల ఎత్తు బెడ్లు ఉండేలా బోదెలు చేశామని తెలిపారు. ఒక్కొక్క బెడ్ 4 అడుగుల వెడల్పు ఉండేలా వేశామన్నారు.
షేడ్‌నెట్ వేసేందుకు 10 అడుగుల వెదురు గెడలను ఒక్కొక్క దాన్ని 9 అడుగుల దూరంలో అడుగు లోతులో భూమిలో పాతినట్లు రాజు చెప్పారు. వాటికి జీఈ వైర్ వేసి, దానిపై షేడ్ నెట్ బిగించినట్లు తెలిపారు. ఎకరం క్యాప్సికం పంటకు షేడ్‌నెట్ వేసేందుకు సుమారు రూ.90 వేలు ఖర్చయిందన్నారాయన. నాలుగు సంవత్సరాల పాటు ఈ షేడ్‌నెట్ పాడవకుండా ఉంటుంది. షేడ్‌నెట్ లోపలికి పురుగులు రాకుండా నివారణకు సైడ్ వాల్ నెట్ వేసేందుకు మరో రూ.30 వేలు అయింది. వెదురు కర్రలకు రూ.60 వేలు, జీఈ వైర్ కోసం మరో రూ. 30 వేలు, కూలీలకు అయ్యే ఖర్చు ఉంటుందన్నారు. మల్చింగ్ షీట్‌కు ఎకరానికి రూ.15 వేలు ఖర్చయింది. డ్రిప్‌కు మరో ఆరు ఏడు వేలు అవుతుంది. బెంగళూరులో ఉన్న ప్రముఖ కంపెనీల నుంచి నాణ్యమైన విత్తనాలు తెచ్చుకున్నట్లు చెప్పారు. విత్తనాలను ప్రోట్రేలలో వేసి, 40 రోజుల పాటు పెంచిన మొక్కలను ప్రధాన భూమిలో ఫిబ్రవరి తొలి వారంలో నాటినట్లు రాజు చెప్పారు. విత్తనం ప్రోట్రేలలో పెట్టిన 10 రోజులకు మొక్కలు వస్తాయి.
మొక్క నాటినప్పటి నుంచి ఆరు నెలలకు షేడ్‌నెట్ కింద క్యాప్సికం పంట వస్తుంది. ఎకరం నేలలోని బెడ్లపై ఒక లైన్ వేసుకుంటే 10 నుంచి 12 వేల క్యాప్సికం మొక్కలు పడతాయి. రెండు లైన్లు వేస్తే మరో రెండు, మూడు వేల మొక్కలు ఎక్కువ పడతాయి. మొక్కకు మొక్కకు మధ్య అడుగున్నర దూరం ఉండేలా నాటినట్లు తెలిపారు. ఒక్కో మొక్క తయారీకి విత్తనంతో పాటు రూ.3 ఖర్చు అయిందన్నారు. రూ.6 రూపాయలకు కొన్న మొక్కల కన్నా రూ.3 రూపాయలైన మొక్కల నుంచి దిగుబడి ఎక్కువ వస్తోందని చెప్పారు.
షేడ్‌నెట్ కింద పెంచే క్యాప్సికం మొక్కలు దిగుబడి ఇస్తూనే ఉంటాయి. ప్రధాన భూమిలో మొక్కలు నాటిన తర్వాత 55 రోజులకు తొలి కోత వస్తుంది. ఆ తర్వాత వారానికి ఒకసారి చొప్పున కాయలు కోయవచ్చు. మెయింటెనెన్స్‌ను బట్టి తొలి కోత నుంచి ఐదారు నెలల పాటు వారానికి ఒకసారి కాయలు కోసుకోవచ్చు. పూత వచ్చినప్పటి నుంచి 25 రోజులకు కాయ తయారవుతుంది. మొక్కలు నాటిన తొలి 100 రోజులు తమకు దిగుబడి చాలా ఎక్కువ వచ్చిందన్నారు. తమ 6 ఎకరాల నుంచి ప్రతిరోజూ రెండున్నర టన్నుల దిగుబడి వచ్చినట్లు రాజు చెప్పారు. తర్వాత కొద్దిగా తగ్గినా మళ్లీ మొక్కలకు పూత, కాయలు కాసినట్లు తెలిపారు. ఒక్కొక్క మొక్క నుంచి సుమారు 4 కిలోల కాయలు దిగుబడి వచ్చిందన్నారు.
క్యాప్సికం పంటను ప్రధానంగా త్రిఫ్ట్స్, మైట్స్ లాంటి కీటకాలు ఇబ్బంది పెడతాయి. మొక్కలకు తొలి రెండు నెలల్లో విల్ట్ అంటే వేరు కుళ్లు తెగులు సోకే అవకాశం ఉంది. దాని నివారణకు ఫంగిసైడ్స్, వేరుకుళ్లు నివారణ మందులు వేశామన్నారు. ఆ రెండు నెలలు కాపాడితే క్యాప్సికం పంటను కాపాడినట్లే అన్నారు రాజు. మొక్కలకు మొగ్గలు, పూలు వచ్చే సమయంలో త్రిఫ్ట్స్, మైట్స్ కీటకాలు ఆశిస్తాయన్నారు. త్రిఫ్ట్స్ ఉన్నా లేకపోయినా ప్రతి నాలుగు రోజులకు ఒకసారి రెండు మూడు రసాయన మందులు కలిపి మొక్కలకు స్ప్రే చేయాలన్నారు. వేరుకుళ్లు, త్రిఫ్ట్స్, మైట్స్ తప్ప మరే ఇతర రోగాలు క్యాప్సికంకు ఉండవని రాజు చెప్పారు.
పూత సమయంలో కొద్దిగా ఎరువు, కాయలు వచ్చినప్పుడు దానికి కావాల్సిన మైక్రో న్యూట్రియంట్లు, మొక్క మొదట్లో వేసే ఎరువులు అందిస్తే కాయలు త్వరగా తయారవుతాయి. మొక్కలు నాటిన 25 రోజులకు 5:61 ఎరువును ఐదు నుంచి పది రోజులు, తర్వాత 13:0:45, ఆ తర్వాత 0:0:50, అప్పుడప్పుడూ 12:61, కాల్షియం, నైట్రోజన్ లాంటివి ప్రతిరోజూ ఏదో ఒకటి డ్రిప్ ద్వారా వదిలినట్లు రాజు వెల్లడించారు. పూత రాలిపోకుండా బోరాన్ వాడినట్లు చెప్పారు.
మొక్కలు ఆరు నెలల్లో ఆరు అడుగుల ఎత్తుకు పెరుగుతాయి. పూత, కాయలు వస్తున్న తీరును బట్టి షేడ్‌నెట్‌ను పైకి జరుపుకోవచ్చు. లేదంటే మొక్కలను తీసేసి, కొత్తమొక్కలు నాటుకోవాలి. అంతే కాని మొక్కల చివర్లు కత్తిరించకూడదు.
కిలోకు 10 కాయలు తూగే క్యాప్సికం కాయలను ఒక మనిషి రోజుకు 5 క్వింటాళ్ల కాయలను సులువుగా తెంపుతారు. మొక్కలు నాటిన నెల రోజుల నుంచి పురికొస లాంటి తాడుతో స్టేకింగ్ చేయాలి. తర్వాత ప్రతి నెలా జాగ్రత్తగా గమనిస్తుండాలి. లేదంటే కాయల బరువుకు మొక్క వంగి, విరిగిపోయే ప్రమాదం ఉంది. ఆరు ఎకరాలకు స్టేకింగ్ చేసేందుకు క్వింటాల్ పురికొస అవసరం అవుతుంది. అందుకు రూ.13 వేల వరకు ఖర్చు అవుతుంది. మొక్కల మొదళ్లకు ఆచ్ఛాదనగా మల్చింగ్ వేసుకోవాలి. పైన షేడ్‌నెట్, కింద మల్చింగ్ షీట్ ఉంటుంది కాబట్టి ఎంత ఎండాకాలమైనా ఒక ఎకరానికి రోజుకు 30 నిమిషాల పాటు నీటిని అందిస్తే సరిపోతుంది.
తొలిసారి తాము క్యాప్సికం పంటను మార్కెట్‌కు పంపినప్పుడు కిలో రూ.25 చొప్పున ఆదాయం వచ్చిందన్నారు. డిమాండ్ బాగా ఉన్నప్పుడు కిలోకు రూ.50 నుంచి 60 వరకు ధర పలికింది. క్యాప్సికం కాయలను 10 కిలోల పాలిథిన్ కవర్లలో ప్యాక్ చేసి హైదరాబాద్, షాద్‌నగర్ మార్కెట్లకు పంపుతామన్నారు రాజు. గ్రీన్ క్యాప్సికం కాయలు ముదిరి ఎర్రరంగులోకి మారితే మార్కెట్లో ధర అంతగా పలకదని రైతులు గమనించాలంటారు రాజు. ఎర్రనేలల్లో క్యాప్సికం దిగుబడి అధికంగా వస్తుంది. దీనికి చవుడు భూములు పనికిరావని చెప్పారు.
పాలిహౌస్ పద్ధతిలో క్యాప్సికం పంట సాగుకు ఎకరానికి 30 నుంచి 40 లక్షలు ఖర్చువుతుంది. కానీ.. షేడ్‌నెట్ కింద క్యాప్సికం పండిస్తే మొత్తం రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే.. దానితో పాటు మరో రూ.4 లక్షలు లాభం రావచ్చని రాజు తెలిపారు. మొత్తం మీద క్యాప్సికం సాగు చేయడం కాస్త ఖర్చు, కష్టమే అయినా లాభదాయకంగా ఉంటుంది.





















