కందగడ్డకు ఆయుర్వేదంలో విశిష్ట స్థానం ఉంది. కంద రెండు రంగుల్లో ఉంటుంది. ఎర్రగా ఉండే కందను ఆయుర్వేద గ్రంథాల్లో ‘రక్తసూరణ’ అని, తెల్ల రంగులో ఉంటే ‘శ్వేత సూరణ’ అని అంటారు. కందగడ్డలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అది జీర్ణ వ్యవస్థను చక్కదిద్దుతుంది. మల విసర్జన సులువుగా జరిగేలా చేస్తుంది. కందలోని పొటాషియం, ఫైబర్‌ రక్తనాళాల్లో ఉన్న కొవ్వును తగ్గిస్తాయి. తద్వారా గుండె జబ్బులు రాకుండా చేస్తాయి. దీనిలో కేలరీలు తక్కువ. అయితే.. తిన్నవారికి మంచి శక్తి వస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు కందను ఆహారంలో తీసుకుంటే తగ్గుతుంది. మన రక్తంలో చక్కెర స్థాయిలు సడన్‌గా పెరిగిపోకుండా కంద నియంత్రిస్తుంది. మెదడు చురుగ్గా ఉండేలా చేస్తుంది. కందలో ఎక్కువగా లభించే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

కొన్ని రకాల క్యాన్సర్‌ కారక కణాల నుండి శరీరాన్ని కంద రక్షిస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. శరీరంలోని అధిక వేడిని కంద సమతుల్యం చేస్తుందంటారు. మగవారిలో ప్రోస్టేట్‌ క్యాన్సర్ రానివ్వకుండా మంచి మందులా పనిచేస్తుంది. పైల్స్‌ బాధ ఉన్నవారు కందను ఆహారంలో తీసుకుంటే ఉపశమనం కలుగుతుందని వైద్యులు చెబుతారు. లేతగా ఉన్న కందమొక్కల కాడలను పులుసుగా వండుకుని తీసుకుంటే డయేరియా తగ్గుతుంది. కంద తింటే ఆకలి లేనివారికి అది పెరుగుతుంది. తద్వారా కఫం, వాతం, పైత్యంను అదులో ఉంటుంది.  అయితే.. చిన్నారులు, గర్భిణులు, బిడ్డలకు తల్లిపాలు ఇస్తున్న వారు, ప్రోటీస్ ఎస్‌. లోపం ఉన్నవారు కందను తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కంద లోపలి కండను మెత్తగా రుబ్బి, నెయ్యి కలిపి బోదకాలిపై రోజూ 8 సార్లు పూత పూస్తే వాపు తగ్గుతుంది. నెలసరులు సరిగా లేని మహిళలకు కందను ఆహారంలో తీసుకుంటే రుతుక్రమం సక్రమంగా వస్తుంది. ఇలా కందగడ్డతో మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇలాంటి కందగడ్డల సాగు విధానం, ఖర్చులు, లాభనష్టాలు తదితర విషయాలేంటో చూద్దాం.తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పెనకనమెట్ట గ్రామంలో రైతు అందె వీరన్న పది సంవత్సరాలుగా కందసాగు చేస్తున్నారు. ప్రతి ఏటా ఆయన రెండు ఎకరాల వరకు కందసాగు చేస్తారు. సంక్రాంతి పండుగకు ముందు కంద విత్తనాలు పొలంలో నాటుతామని చెప్పారు. కంద విత్తనం కొనేందుకు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎకరానికి 250 కిలోలు ఉండే 25 పుట్ల విత్తనం అవసరం అవుతుంది. అంటే ఎకరం భూమికి సుమారు ఆరు నుంచి ఏడు టన్నుల కంద విత్తనం అవసరం అవుతుంది. పుట్టు కంద విత్తనం ధర సుమారు 11 వేల రూపాయలు ఉంటుంది. అంటే ఎకరంలో కంద విత్తనం కొనేందుకు సుమారు రెండున్నర నుంచి 3 లక్షల వరకు అవుతుంది. తాము కంద విత్తనం పుట్టుకు ఆరు నుంచి ఆరున్నర వేలకు కూడా అమ్మిన రోజులు ఉన్నాయన్నారు. సొంత భూమి నుంచే కంద విత్తనాలు తయారు చేసుకోవాలంటే నవంబర్‌లో భూమి నుంచి తీసుకుని రెండు నెలల పాటు నిల్వ ఉంచాలని వీరన్న చెప్పారు. కందగడ్డలను భూమి నుంచి పైకి తీసిన వెంటనే విత్తనంలా నాటకూడదు. కంద విత్తనం కూలీలతో నాటించేందుకు ఎకరానికి రూ.10 వేలు వరకు ఖర్చు అవుతుంది. విజయనగరం జిల్లా సాలూరులో పండే కందగడ్డల విత్తనం కాస్త గట్టిగా, నాణ్యంగా ఉంటుందని చెప్పారు.ముందుగా భూమిని మెత్తగా దున్ని, రోటావేటర్‌ కొట్టాలి. తర్వాత మళ్లీ సాళ్లు దున్నాలి. తర్వాత మట్టిని బోదెలుగా చేసుకోవాలి. బోదెలలో నీళ్లు పారిస్తూనే కంద విత్తనాలను బెడ్లపై పెట్టి లోపలికి తొక్కాలి. మొక్కకు మొక్కకు మధ్య 22 అంగుళాల దూరం ఉండేలా విత్తనాలు నాటాలి. బోదెకి బోదెకు మధ్య దూరం 28 అంగుళాలు ఉంచాలి. పది మంది మనుషులు ఎకరం భూమిలో ఒకరోజులో విత్తనాలు నాటేందుకు సరిపోతారు. విత్తనం కోసిన తర్వాత లోపలి భాగం పైకి, దాని కింద ఉంటే బెరడు భాగం కిందికి ఉండేలా నాటాలి. కంద విత్తనం దుంప చిన్నదైతే.. దాని మొక్క ఉండే భాగం పక్కకు ఉండేలా నాటాలి. మరీ చిన్నగా ఉంటే రెండు దుంపలు కలిపి ఒకేచోట పెట్టుకోవాలి. కంద విత్తనాలు మరీ చిన్నగా కాకుండా కాస్త ఎక్కువ పరిమాణంలోనే చేసుకోవాలని. చిన్న విత్తనం నాటితే మొక్క నాసిరకంగా వస్తుంది. దిగుబడి తగ్గుతుంది. విత్తనాలు నాటే సమయంలో పొలానికి నీరు ఇచ్చి, తర్వాత నెల రోజుల వరకు నీటి సరఫరా చేయక్కరలేదు. కంద విత్తనం సంక్రాంతి తర్వాత నాటితే మొలకెత్తడానికి రెండు నెలలు పడుతుంది. అదే సంక్రాంతి పండుగ కంటే ముందు వేస్తే మూడు నెలలకు మొక్కలు వస్తాయని వీరన్న వెల్లడించారు. కంద మొక్కలు మొలిచిన తర్వాత పది రోజులకు సాగునీరు పెట్టాలి.మొలిచిన తర్వాత కంద పంట నాలుగైదు నెలలకు కోతకు వస్తుంది. విత్తనం పెట్టినప్పటి నుంచి 7 నెలల తర్వాతే కందగడ్డలను భూమి నుంచి తవ్వాలి. మార్కెట్‌లో ధర సరిగా లేదంటే  మరో రెండు నెలల సమయం కందపంటను భూమి నుంచి తీయకుండా ఆపుకోవచ్చు. అంతకు మించి ఎక్కువ రోజులు ఆపితే పురుగు పట్టి పాడైపోయే ప్రమాదం ఉంటుందని రైతు తెలిపారు. కందసాగు కోసం ఎకరానికి 10 బస్తాల వరకు కాంప్లెక్స్‌ ఎరువులు అవసరం అవుతాయని వీరన్న చెప్పారు. అవసరం అయితేనే పురుగు మందులు స్ప్రే చేస్తామన్నారు. పొలం సారవంతంగా ఉంటే.. కందగడ్డ బాగా లావుగా తయారై, ఎక్కువ బరువుతో దిగుబడి అధికంగా వస్తుంది. స్థానికంగా చేసుకున్న కంద విత్తనం నాటితే మనిషి కన్నా ఎత్తులో గుబురుగా మొక్క పెరుగుతుంది. సాలూరు విత్తనం అయితే.. మనిషి గుండెల ఎత్తు వరకు మాత్రమే ఎదుగుతుంది. భూమి లోపల కందగడ్డ దృఢంగా తయారవుతుంది. ఒకసారి సాలూరు కందగడ్డ విత్తనం నాటి పంట తీసుకున్న తర్వాత వాటి నుంచి మళ్లీ విత్తనం తయారు చేసుకోవచ్చు.కంద పంట పూర్తయిన తర్వాత గడ్డపారతో దుంపలను తవ్వుతారు. కందగడ్డలు తవ్వే కూలీలకు పుట్టుకు ఇంత అని చెప్పి డబ్బులు చెల్లించాలి. ఎకరం భూమిలో విత్తనాలు నాటేందుకు రూ.7 నుంచి ఏడున్నర వేల రూపాయలు కూలి ఇవ్వాలి. కంద విత్తనం వారే కోస్తారు. పొలంలో నాటేందుకు గుర్తులు కూలీలే పెడతారు. బోదెల్లో నీరుతడిని మాత్రం రైతే చూసుకోవాలి. బీహార్‌, సాలూరు, విజయవాడ, స్థానికంగా తయారు చేసుకున్న వెరైటీల్లో కంద విత్తనాలు లభిస్తాయని వీరన్న చెప్పారు. కంద పంట కోసిన తర్వాత వ్యాపారులు కొని, ఇతర ప్రాంతాలకు తీసుకెళతారన్నారు.ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం పెనుమాకలో రైతు మేకా వెంకటరెడ్డి ఏటా 50 ఎకరాల్లో కంద సాగు చేస్తున్నారు. కందకు నాలుగైదు ఏళ్ల నుంచి భారీగా డిమాండ్‌ ఉంటోందన్నారు. కృష్ణానది ఏటిగట్టు సమీపంలో రెండు వైపులా కందసాగును రైతులు విరివిగా చేస్తున్నారు. ఎకరానికి 50కి పైగా 80 పుట్ల లోపు పండించే రైతులు కూడా ఉన్నారని చెప్పారు. 250 కిలోల పుట్టు బరువున్న కందగడ్డకు రూ.14 నుంచి 16 వేల రూపాయల ధర పలుకుతుంది. ఎకరం భూమిలో కంద విత్తనాల కోసం రూ.3 లక్షల .20 వేలు, దుక్కికి పదివేలు, నాటే కూలీలకు రూ.10 వేలు, భూమిని కౌలుకు తీసుకుంటే రూ.50 వేలు ఉంటుంది. ఇతర పెట్టుడులు మరో లక్ష రూపాయలు వస్తుంది. మొత్తం మీద ఎకరం భూమిలో కంద సాగు చేసేందుకు సుమారు రూ.5 లక్షల పెట్టుబడి అవుతుంది. ఎకరంలో 50 పుట్ల కంద పండినా పుట్టుకు 12 నుంచి 13 వేల రూపాయలకు తక్కువ ఉండదు. కందగడ్డలు పుట్టుకు 12 వేలకే అమ్మినా 50X12,000= రూ.6 లక్షల ఆదాయం వస్తుంది. సొంత భూమిల పండిస్తే కౌలు కట్టే డబ్బులు కూడా రైతుకే ఉంటాయి.