ఇసుక నేలలు, చిన్న ఊట నీటి గుంట. అది కూడా ఆరు లేదా ఏడు అడుగల లోతు ఉన్న ఊటబావి. ఆకు, కాయగూరల సాగు. ప్రతిరోజూ పని చేయాలి. అలాగే ఆదాయమూ వస్తుంది. తక్కువ భూమి ఉన్నా కుటుంబాలు చక్కగా జీవిస్తుంటాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని పాలకోడేరు మండలం విసాకోడేరు పంచాయతీలోని వంకాయలపాలెంలో ప్రతినిత్యం ఇలాంటి విశేషాలను మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఆ గ్రామంలోని అనేక మంది రైతులు ఆకుకూరలు, కూరగాయలు పండించి, భీమవరం మార్కెట్‌లో రోజూ అమ్ముకుని ఆదాయం సంపాదిస్తుంటారు. వంకాయలపాలెంలో ఇలా 365 రోజులూ రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని ఆకు కూరలు, కాయగూరలు సాగుచేస్తున్నారు రైతు అనంతరావు.
తోటకూర, పాలకూర, పుల్ల గోంగూర లేదా పుంటికూర, కొత్తిమీర లాంటి ఆకుకూరలను దాదాపు పదిహేను ఏళ్లుగా అనంతరావు పండిస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే.. బీర, కాకర, ఆనప, పెన్నాడ వంకాయ లాంటి పలు రకాల కాయగూరల సాగు చేస్తుంటారు. గోంగూర విత్తనాలను పొలంలో చల్లిన తర్వాత 40 రోజులకు కోతకు వస్తుంది. కోతకు తయారైన గోంగూర మొక్కలను కోసుకొని, లేదా వేళ్లతో సహా భూమి నుంచి పైకి లాగి కట్టలు కట్టి మార్కెట్‌కు తీసుకెళ్లి అనంతరావు సొంతంగానే అమ్ముతుంటారు. రోజుకు 200 నుంచి 300 గోంగూర కట్టలు భీమవరంలో అమ్ముకుంటారు. ఒక్కో గోంగూర కట్ట 8 నుంచి 10 రూపాయల ధర పలుకుతుంది.
అనంతరావు తమ రెండెకరాల పొలంలో తమ కుటుంబంలోని ముగ్గురు పనిచేసుకుంటారు. తెల్లవారు జామున పొలాని వెళ్లి పనులు చేస్తారు. ఆకుకూరల మొక్కలు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం వరకు కోసుకొని, మరుసటి రోజు తెల్లవారు జామునే తాము ముగ్గురం విడివిగా మార్కెట్‌కు తీసుకెళ్తామన్నారు. ఆకుకూరలు ఎంత త్వరగా అమ్ముడైతే అంత వేగంగా తమ ఊరికి తిరిగి వచ్చేస్తారు. ఆ తర్వాత నుంచి పొలానికి నీరు చల్లడం, ఇతర పనులు చేసుకుంటారు.
పొలంలోని పావు ఎకరంలో తోటకూర మొక్కలను విత్తనాల తయారీ కోసం విడిచిపెట్టారు. ఈ మొక్కల నుంచి 30 కిలోల వరకు విత్తనాలు రావచ్చు. తమ సాగు కోసం విత్తనాలు ఉంచుకుని, మిగతావి మిగతా రైతులు అమ్ముతుంటారు. తోటకూర విత్తనాలు కిలో వెయ్యి రూపాయల ధర ఉంటుంది. తోటకూర మొక్కలు స్తాంభాలుగా ఎదిగి, విత్తనాలు తయారైన తర్వాత వాటిని తీసుకుని, మళ్లీ భూమిలో చల్లుతారు. గోంగూర విత్తనాలను తాము తాడేపల్లిగూడెం నుంచి తెచ్చుకుంటామని అనంతరావు చెప్పారు. ఎకరానికి 70 నుంచి 80 కిలోల గోంగూర విత్తనాలు అవసరం అవుతాయి. కిలో గోంగూర విత్తనాలను కాస్త అటూ ఇటూగా రూ.110 నుంచి రూ.150 పెట్టి కొనుగోలు చేస్తారు. అర ఎకరం భూమిని ట్రాక్టర్‌తో దున్నించేందుకు, విత్తనాల కోసం ఐదారు వేల రూపాయల ఖర్చు అవుతుంది. గోంగూరను 40 రోజుల్లోనే పంట పూర్తి అవుతుంది. తెల్ల గోంగూర రకం కూడా ఉంటుంది. అది కృష్ణాజిల్లాలో బాగా వినియోగిస్తారు. గోదావరి జిల్లాలో పుల్ల గోంగూరకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. పావు ఎకరంలో మూడు కిలోల తోటకూర విత్తనాలు చల్లాల్సి ఉంటుంది. తోటకు ఎండాకాలంలో ప్రతిరోజూ, శీతాకాలంలో రోజు విడిచి రోజు నీళ్లు పైప్‌తో చల్లితే ఆకులు నీట్‌గా, ఫ్రెష్‌గా ఉంటాయి. ఇసుక నేత కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ విధానం సూటవదు. ఇసుక నేలలో ఎక్కడ పడిన నీరు అక్కడే ఇంకిపోతుంది.
గోంగూర ఒకసారి కోసుకున్న తర్వాత మరోసారి పంటరాదు. దాంతో తోటకూర, పాలకూర, చుక్కకూర లాంటివి అనంతరావు, ఇతర రైతులు సాగు చేస్తారు. పాలకూర అయితే.. రెండు మూడు సార్లు దిగుబడి వస్తుంది. వంకాయలపాలెంలో ఎకరా భూమికి ఏడాదికి రూ.25 నుంచి రూ.30 వేలు కౌలు చెల్లించాలని అనంతరావు వెల్లడించారు.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ రైతులు ఏడాది పొడవునా ఆకు కూరలు సాగుస్తున్నారు. ప్రతిరోజూ పొలం పని. ప్రతిరోజూ ఆదాయం. ఏడాది పొడవునా మెరుగైన జీవనానికి ఆకుకూరల సాగు అనుకూలంగా ఉంది. కష్టపడే రైతన్నలకు ఆర్థికంగా బలమైన భరోసా ఇస్తోంది ఆకు కూరల సాగు. కేతనకొండ రైతు నర్సింహారావు 20 ఏళ్లుగా ఏడాది పొడవునా ఎకరం భూమిలో సుమారు 10 రకాల ఆకుకూరల సాగు చేస్తారు. దుక్కి దున్ని, నేలను సమానం చేసుకొని, విత్తనాలు చల్లి, నీటిని వదులుతారు. ఒక్కో సెంటుభూమిని ఒక మడిగా చొప్పున 100 మడులు చేసి, ఆకుకూరలు పండిస్తున్నారు. నీటి సౌకర్యం లేని మొట్టపొలంలో ఈ గ్రామ రైతులంతా బోర్ల కిందే ఆకుకూరలు పండిస్తారు. ఒక సెంటు మడిలో వెయ్యి కట్టల వరకు ఆకుకూరలు వస్తాయి. ఒక్కో కట్టను మూడు రూపాయలకు అమ్ముతారు. అంటే సెంటు భూమిలో 100 గ్రాముల తోటకూర విత్తనాలు చల్లితే, నెల రోజులకు మూడు వేల రూపాయల ఆదాయం వస్తుంది.
ఎలాంటి అజాగ్రత్త చేయకుండా, ప్రతిరోజూ ఆకుతోటల్లో పనిచేసుకుంటే, పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తున్నాయని అనంతరావు, నర్సింహారావు తెలిపారు. ఆకుకూరల సాగులో కష్టం చేస్తే.. ఫలితం ఉంటుంది.






















