పూర్వకాలంలో అధిక రక్తపోటు 40, 50 ఏళ్లు పైబడిన వయస్సు వారిలో మాత్రమే కనిపించేది. ఇప్పుడు చిన్నపిల్లలు, యువకులు, పెద్దవారు ఇలా అన్ని వయస్సుల వారిలోనూ రక్తపోటు సాధారణం అయిపోయింది. బీపీ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ప్రమాదమని చెబుతున్నారు వైద్య నిపుణులు. రక్తపోటును అదుపులో ఉంచుకోకపోతే ప్రాణాంతకంగా మారుతుందని అంటారు. గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధులకు అధిక రక్తపోటు ప్రధాన కారణం. అధిక బీపీ గుండెను సైలెంట్‌గా దెబ్బతీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మానసికంగా ఒత్తిడికి గురవడం, మారిపోయిన జీవనశైలి, అధికంగా ఉప్పు వాడడం, పొగ తాగడం, ఊబకాయం, మద్యపానం లాంటి అలవాట్లు రక్తపోటు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి.
అధిక రక్తపోటు బీపీని నియంత్రణలో ఉంచాలంటే పొటాషియం, మెగ్నీషియం, నైట్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. ఉప్పు వాడకం బాగా తగ్గించాలి. ఆహార పంటల్లో పాలకూర, బచ్చలికూర, మెంతికూర లాంటి ఆకు కూరల్లో మెగ్నీషియం కావాల్సినంత ఉంటుంది. వీటిని తిన్న వారికి రక్తనాళాలను సరిగా చేసి, రక్తపోటును తగ్గిస్తాయి. కూరగాయల విషాయానికి వస్తే.. బీట్రూట్లో నైట్రేట్లు ఎక్కువ. బీట్రూట్ తిన్నవారి రక్తనాళాల్లో రక్తం సరఫరా మెరుగవుతుంది. బీపీని నైట్రేట్లు నియంత్రిస్తాయి. మునగకాయలు, టమోటాలు తిన్నవారికిఇరక్తపోటు అదుపులో ఉంటుంది. పండ్లలో అరటిపండ్లు, దానిమ్మ, జామకాయ, పుచ్చకాయ, నారింజ పండ్లు బీపీని అద్భుతంగా తగ్గిస్తాయి. వీటిలో ఉండే పొటాషియం సోడియం ప్రభావాన్ని తగ్గిస్తుంది.
అధిక రక్తపోటును తగ్గించడంలో తృణధాన్యాలు బాగా పనిచేస్తాయి ఓట్స్, క్వినోవా, జొన్నలు, రాగులు లాంటి ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలు గుండె ఆరోగ్యానికి, బీపీని అదుపులో ఉంచడానికి మంచివి. కందులు, పెసర్లు లాంటి పప్పు ధాన్యాల్లో మెగ్నీషియం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని ఆహారంలో తీసుకుంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది. గింజల విషయానికి వస్తే.. గుమ్మడి గింజలు, అవిసె గింజలు, చియాసీడ్స్‌లో ఉండే మెగ్నీషియం, పొటాష్‌లు బీపీని నియంత్రిస్తాయి. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ సమ్మేళకం రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గిస్తాయి. బ్లడ్‌ప్రెషర్‌ను కంట్రోల్ చేస్తాయి. అంతే కాదు.. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కాలే, మెంతులు, ఆవాలలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని సోడియం ప్రభావాన్ని పొటాషియం తగ్గిస్తుంది. రక్తనాళాలను సరిగా ఉంచడంలో పనిచేస్తుంది. వీటిలో మెగ్నీషియం, నైట్రేట్లు ఎక్కువే. ఇవన్నీ బీపీని తగ్గించడంలో ఉపయోగపడతాయి.
ఒక మీడియం అరటిపండులో 422 మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది. దీనిలోని పొటాషియం శరీరంలోని సోడియం స్థాయిలను సమతుల్యం చేస్తుంది. అన్ని వర్గాల వారూ తినేందుకు అరటిపండు అందుబాటు ధరలో లభిస్తుంది. అరటిపండ్లను క్రమం తప్పకుండా తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఓట్స్ గురించి చూద్దాం. వీటిలో ఫైబర్ ఎక్కువ. సోడియం తక్కువ. ఓట్స్‌ను అల్పాహారంగా తీసుకునే వారిలో రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యమూ మెరుగవుతుంది. వెల్లుల్లి తింటే నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరిగి, రక్తనాళాలు వెడల్పు అవుతాయి. దీంతో గుండెకు, గుండె నుంచి ఇతర అవయవాలకు రక్తం సరఫరా చాలా సులువుగా అవుతుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పెరుగులో కాల్షియం, ప్రోబయోటిక్స్ అధికం. పెరుగులోని కాల్షియం రక్తనాళాలను మెత్తగా మార్చి రక్తపోటు నియంత్రణలో ఉండేందకు పనికొస్తుంది. పెరుగులోని ప్రోబయోటిక్స్ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అయితే.. వెన్న శాతం తక్కువ ఉన్న పెరుగు తింటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
పోషకాల గని బచ్చలికూర అంటారు ఆహార నిపుణులు. బచ్చలి తింటే శరీరం నుంచి ఐరన్ లోపం పరారవుతుంది. కాల్షియం సమృద్ధిగా అందుతుంది. ఇలా ఒకటి రెండు కాదు మన శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు బచ్చలికూరలో ఉన్నాయి. దీనిలో పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్ అధికం. అధిక రక్తపోటును తగ్గించేందుకు ఇవి ఉపయోగపడతాయి. అధిక రక్తపోటు ఉన్నవారు ప్రతిరోజూ బచ్చలిని ఆహారంలో తీసుకుంటే మంచిదంటారు వైద్యులు. బీట్రూట్ కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వనరు. బీట్రూట్లో నైట్రేట్స్ ఉంటాయి. రక్తనాళాలను వదులుగా చేసి, రక్తప్రసరణను సులభతరం చేస్తాయి. కీరదోస, క్యాబేజీ, కాలిఫ్లవర్, కొత్తిమీర, పుదీనా కూడా హైబీపీని కంట్రోల్లో ఉంచుతాయి.
క్యారెట్ అంటే కేవలం కంటి ఆరోగ్యం కోసమే అనుకుంటే పొరపాటు. మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యంగా అధిక రక్తపోటును నియంత్రించడంలో క్యారట్ ఉపయోగపడుతుంది. వీటిలో పొటాషియం బాగా ఉంటుంది. బీటా కెరోటిన్, ఫైబర్ కూడా ఎక్కువే. ఇవి హై బీపీని తగ్గించడంలో సహాయపడతాయి. రోజువారీ ఆహారంలో క్యారట్ జ్యూస్‌ను చేర్చుకుంటే.. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె ఆరోగ్యమూ భద్రంగా ఉంటుంది. టమోటాలు మనకు చేసే మేలు అంతా ఇంతా కాదంటారు ఆరోగ్య నిపుణులు. 100 గ్రాముల టమోటాల నుంచి 237 మిల్లీ గ్రాముల పొటాషియం అందుతుంది. వీటిలో ఉండే లైకోపీన్ అధిక రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. బ్రోకలిలోనూ మనకు కావాల్సిన పోషకాలు ఎక్కువే. దీనిలో అధికంగా ఉండే పొటాషియం హై బీపీని నియంత్రిస్తుంది. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, మల్బెర్రీలు, రాస్బెర్రీలలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. తద్వారా బీపీ తగ్గుతుంది. వీటిని రోజువారీ ఆహారంలో తీసుకుంటే మంచిది.
మాంసాహారం విషయానికివస్తే.. వారంలో రెండుసార్లు చేపలు తింటే బీపీ అదుపులో ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సముద్రపు చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తం సరఫరాను మెరుగు పరుస్తాయి.
ఇప్పుడు చెప్పుకున్న ఆహారాల్లో దేనినైనా సహజసిద్ధ పంటల విధానంలో పండిస్తే.. ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని ఆహార, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రసాయనాలతో పండించిన ఆహారాలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. పైన వివరించిన ఆహారాలతో ఖర్చు తక్కువ అవుతుంది. భూమి కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. సాగు చేయడం సులువు అవుతుంది. మంచి ధర వస్తుంది. తద్వారా రైతుకు లాభదాయకంగానూ ఉంటుంది.





















