ప్రకృతి సిద్ధంగా పసుపు పంట పండించడంలో ఆదర్శంగా నిలిచింది గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని నూతక్కి గ్రామం. నూతక్కి గ్రామంలో ఆరు దశాబ్దాలుగా పసుపు సాగులో ఎంతో ప్రసిద్ధి చెందింది. గతం నుంచీ ఈ గ్రామ రైతులు రసాయన ఎరువులతో పసుపు సాగు చేసేవారు. అయితే.. పసుపు సాగులో సమస్యలు పెరిగిపోవడమే కాకుండా ఇబ్బడి ముబ్బడిగా ఖర్చులు పెరిగిపోవడంతో వారంతా ప్రకృతి విధానంలో పంట పండిస్తున్నారు. ఎకరాకు సుమారు 30 క్వింటాళ్ల నాణ్యమైన ఎండు పసుపు పంటను వారు సాధిస్తున్నారు. కొందరు రైతులైతే అత్యధికంగా ఎకరం భూమిలో 40 క్వింటాళ్ల ఎండు పసుపును కూడా దిగుబడి తీసిన దాఖాలాలు ఉన్నాయి.
పసుపు పంటకు పెట్టింది పేరు నూతక్కి. ఈ గ్రామంలో 90 శాతం భూమిలో మెట్ట పంటల సాగుకే అనుకూలంగా ఉంటుంది. గ్రామంలో రైతులు అధికంగా అంటే సుమారు 500 ఎకరాల్లో పసుపు, అరటి సాగుచేస్తుంటారు. మిగతా భూమిలో వరి, ఇతర పంటలు వేస్తారు. తక్కువ భూమిలో వీలైంతన ఎక్కువ రాబడి సాధించేందుకు వారంతా అంతర పంటలు వేసి, ఆర్థికంగా దూసుకుపోతున్నారు. డ్రిప్ ఇరిగేషన్ అవలంబించి, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధిస్తూ ఇతర గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
నూతక్కిలో పసుపు పంటను తల్లి పంట అని పిలుచుకుంటామని రైతు సుబ్బారెడ్డి తెలిపారు. గడచిన మూడేళ్లుగా పసుపు పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. క్వింటాలు ఎండు పసుపుకు రూ.8 వేలు ఉంటేనే గిట్టుబాటు అవుతుందన్నారు. ప్రభుత్వం కొన్న రేటు అయితే.. కాస్త ఊరట కలిగించినా ప్రైవేటు వ్యాపారులు కేవలం రూ.4,800 నుంచి రూ.5,200 మధ్యే కొంటున్నారని విచారం వ్యక్తం చేశారు. గడిచిన నాలుగేళ్లుగా తమ గ్రామ రైతులు సేలం ఎస్ 10, ప్రగతి రకం పసుపు పండిస్తున్నట్లు చెప్పారు. బండ సేలం రకం పసుపు కొమ్ము ఎక్కువ ఉంటుందని, దిగుబడి కూడా అధికంగా వస్తుందని తెలిపారు. రాజేంద్ర సొనాలి అనే రకం వేసిన రైతులకు అంతగా కలిసి రాలేదన్నారు. అంతకు ముందు తాము ఎక్కువగా కడప వెరైటీ సాగుచేసినట్లు చెప్పారు. స్వల్ప కాలిక రకం ప్రగతి రకం పసుపు దిగుబడి బాగానే ఉంటుందని సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ రకం పసుసులో కొమ్ములు బాగుంటాయి కానీ దుంప తక్కువ ఉంటుందని అన్నారు. దీని దుంపలో కుర్కెమిన్ శాతం ఎక్కువ ఉన్నా సరైన ధర రావడం లేదు. కాబట్టి కొంతమంది రైతులు మాత్రమే సాగుచేస్తున్నారన్నారు.
పూర్వకాలం నుంచి తాము దుగ్గిరాల నాటు రకం పసుపు సాగు చేసేవారమని కళ్లం సాంబిరెడ్డి చెప్పారు. దీంట్లో కుర్కెమిన్ శాతం కూడా ఎక్కువు అన్నారు. ఏడాదికి రెండు పంటలు పండించే అవకాశం ఉండి, కుర్కెమిన్ శాతం ఎక్కువ ఉండి, విదేశీ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండే ప్రగతి, రాజేంద్ర సొనాలీ పసుపు పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని చెప్పారు. పైగా డిసెంబర్, జనవరి నెలల్లో దిగుబడి వచ్చే రెండో పంట పసుపు సరిగా ఎండడం లేదని, దీనితో నష్టం వస్తున్నట్లు తెలిపారు.
మరో రైతు శ్రీనివాసరెడ్డి మూడేళ్లుగా నూతక్కిలో ఆర్గానిక్ పసుపు పంటనే పండిస్తున్నారు. సేలం వెరైటీలో కుర్కెమిన్ శాతం ఎక్కువ వస్తోందన్నారు. తాము బెడ్స్ విధానంలో మొక్కలు నాటి, డ్రిప్ ఇరిగేషన్ అవలంబిస్తున్నాట్లు తెలిపారు. ఈ రకం సాగు విధానంలో విత్తనం ఎకరాకు 7 క్వింటాళ్లకు మించి పట్టదన్నారు. దుక్కి బాగా మెత్తగా దున్నుకుని విత్తనాలు నాటుకోవాలన్నారు. బెడ్ విధానంలో పసుపు సాగు చేస్తే.. కలుపు తగ్గుతుందని, పంట ఆరోగ్యంగా ఉంటుందని చెప్పారు. పంట డ్యామేజ్ కాదు, పుచ్చు పట్టడం, కుళ్లు లాంటి ఇబ్బందులు రావు అన్నారు. బెడ్లను దుక్కిని బట్టి కనీసం అడుగు ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పుగా తయారు చేసుకోవాలని శ్రీనివాసరెడ్డి సూచించారు. ఇలాంటి ఒక్కో బెడ్‌లో రెండు సాళ్ల చొప్పున విత్తనాలు నాటుకొని, పంట సాగు చేస్తే.. మేలైన దిగుబడి వస్తుందని చెప్పారు. మొక్కకు మొక్కు మధ్య 7 అంగుళాల దూరం ఉండాలన్నారు. మిషన్‌తో అయితే.. 7 అంగుళాల దూరమే నాటుతుందన్నారు. డ్రిప్ ద్వారా పసుపు మొక్కలకు రోజుకు గంట, గంటన్నర నీరు వదిలితే సరిపోతుందన్నారు. తక్కువ నీటి సరఫరా వల్ల మొక్కల మధ్య కలుపు చాలా తక్కువ వస్తుందని, వాటిని చాలా తేలికగా తీసేయవచ్చని చెప్పారు. ఎంత అధికంగా వర్షాలు కురిసినా బెడ్ల మీద పొడిగానే ఉంటుందని తెలిపారు.
ఆర్గానిక్ విధానంలో పసుపు పంట సాగు చేయాలని నిర్ణయించుకున్న సుబ్బారెడ్డి అంతకు మందు ఏడాది మొక్కజొన్న పంట వేసి, ఎలాంటి ఎరువులూ వాడలేదన్నారు. అయితే.. రెండో ఏడాది ఎకరం భూమిలో కేవలం రెండున్నర క్వింటాళ్ల ఘన జీవామృతం వేసినట్లు చెప్పారు. రసాయన ఎరువులు వాడిన పైర్ల కంటే ఘన జీవామృతం వేసిన తమ పొలం చాలా ఏపుగా, పచ్చగా వచ్చిందన్నారు. మూడో ఏడాది రసాయన ఎరువుల సేద్యం చేసిన వారి కంటే నాలుగైదు క్వింటాళ్లు ఎక్కువ దిగుబడి సాధించినట్లు వెల్లడించారు. జూన్ 20వ తేదీ లోపు పసుపు విత్తనాలు నాటుకుంటే మంచి దిగుబడి వస్తుందన్నారు. నాగలి, నలుగురు ఆడ, ఒక మగ కూలితో రోజుకు ఎకరంలో మాత్రమే విత్తనాలు నాటడం వీలవుతుందని, అదే యంత్రంతో ఇద్దరు ఆడ కూలీలు, ఒక మగ కూలీతో రెండున్నర నుంచి మూడు ఎకరాల్లో విత్తనం నాటడం పూర్తవుతుందని చెప్పారు. సాంప్రదాయ పద్ధతిలో అయితే.. ఎకరాకు రూ.4 వేలు ఖర్చయితే.. యంత్రంతో వేసేందుకు రెండున్న వేలే సరిపోతుందన్నారు.
బెడ్‌పైన డ్రిప్ పరుచుకుని, వర్షం పడకపోతే ఎకరానికి నాలుగైదు కిలోల పెసర విత్తనాలు అంతర పంటగా చల్లుతామని సుబ్బారెడ్డి చెప్పారు. పసుపు విత్తనం నుంచి 20 రోజులకు గానీ మొలక రాదు కాబట్టి ఈ లోపు పెసర మొక్కలు తయారై కలుపు సమస్య లేకుండా చేస్తాయన్నారు. పైగా స్పీడుగా ఎదుతుంది, ఆకులు పెద్దగా, ఎత్తుగా ఉండడంతో భూమికి సహజ ఆచ్ఛాదనగా ఉంటాయన్నారు. దీంతో భూమిలో సేంద్రీ కర్బనం బాగా పెరుగుతుందని, వానపాములు బాగా పెరుగుతాయి. నత్రజనిని స్థిరీకరిస్తుందని సుబ్బబారెడ్డి చెప్పారు. లారీ పది టన్నుల ఘనజీవామృతం ఎరువును తాము రూ.15 వేలకు కొని తెచ్చుకుంటున్నట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు. దీంట్లో తాము కొన్ని జీవ శిలీంద్ నాశనులు, జీవన ఎరువులు, సుడోమొనాసో, పొటాషియం బ్యాక్టీరియా కలిపి, వారం నుంచి పది రోజులు మగ్గబెట్టిన తర్వాత ఎకరం భూమిలోని మొక్కలకు 10 బస్తాలు వేస్తామన్నారు. ఇలా ఒక పంట కాలంలో 60 రోజులకు ఒకసారి, 100 రోజులకు మరోసారి ఇలా రెండు దఫాలుగా ఘన జీవామృతం వేయడం వల్ల తమకు మంచి దిగుబడులు వచ్చాయని చెప్పారు. ఒక పంటకు ఒకసారి బాటిల్ ఖరీదు రూ.20 ఉండే వేస్ట్ డీ కంపోజర్ వాడుతున్నామని తెలిపారు. ఒక బాటిల్ వేస్ట్ డీకంపోజర్ ఒక డ్రమ్ములు 200 లీటర్ల నీటిలో వేసి, 2 కిలోల బెల్లం, లేదా తియ్యగా ఉండే 4 తాటిపండ్ల గుజ్జును కలిపి ఈ మిశ్రమాన్ని డ్రిప్ ద్వారా 10 రోజులకు ఒకసారి చొప్పున ఒక పంటకు 10 నుంచి 15 సార్లు వాడుతున్నామన్నారు. దీన్నే మూడు సార్లు పంటపైన కూడా స్ప్రే చేసుకుంటే మొక్కలు పచ్చగా తయారవడమే కాకుండా శిలీంద్ర తెగుళ్లను నివారిస్తుందని, పంట ఆరోగ్యంగా ఉంటుందని చెప్పారు. దీనితో తద్వారా భూమిలో కోటాను కోట్ల మంచి బ్యాక్టీరియా తయారవుతుందన్నారు.
పసుపు పంటకు జీవామృతం మరీ ముఖ్యంగా పంచగవ్యను పంట కాలంలో రెండుసార్లు స్ప్రే చేస్తున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. పంచగవ్య వల్ల పైరు ఎదుగుదల ఎక్కువగా ఉంటుందని, నాణ్యంగా ఉంటుందన్నారు. ఆకు దళసరిగా తయారవడంతో శిలీంద్ర తెగుళ్లు ఆకుమచ్చ లాంటివి చాలా తక్కువ ఉంటాయని చెప్పారు. పుల్లటి మజ్జిగ కూడా ఒకటి రెండు సార్లు స్ప్రే చేస్తామని తెలిపారు. అలాగే.. చేప వ్యర్థాలతో తయారుచేసే ఫిష్ అమినో యాసిడ్స్‌ను వాడతామన్నారు. ఎన్ని కిలోల చేప వ్యర్థాలు ఉంటే అన్ని కిలోల బెల్లం వాడాలి. చేప వ్యర్థాలు, బెల్లం కలిపి 10 రోజుల పాటు రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం మరోసారి సవ్యదిశలో కలుకుని, ఫిష్ అమినో యాసిడ్ 20 నుంచి నెల రోజుల్లో తయారవుతుంది చెప్పారు. దీన్ని జాగ్రత్తగా వస్త్రంలో వడకట్టి ఎకరానికి అర లీటర్ మాత్రమే స్ప్పే చేయాలని సుబ్బారెడ్డి తెలిపారు. ఇలా తయారైన ఫిష్ అమినో యాసిడ్‌ను ఆరు నెలల వరకు వాడుకోవచ్చని అన్నారు.
పసుపు పంటకు పాక్షికంగా నీడ అవసరం అవుతుంది. పూర్తిగా ఎండ తగలకుండా ఉండేందుకు పెసర, నువ్వుల సాగు, అంతర పంటగా మొక్కజొన్నను పసుపు క్షేత్రంలో వేస్తారు. దీనితో భూమిలో వానపాములు వేగంగా వృద్ధి చెందుతాయి. పెసర, నువ్వులు, మొక్కజొన్న మొక్కలను భూమిలోనే కలిపివేయడం వల్ల భూమి బాగా గుల్లబారుతుంది. వానపాములకు ఎల్లప్పుడూ తేమ అందుబాటులో ఉంటుంది. పసుపు మొక్కలను చీడపీడలు అంతగా ఆశించవు. పసుపు దిగుబడి కూడా అధికంగా వస్తుంది.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా మారాలంటే వ్యవసాయం లాభసాటిగా ఉండాలి. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్‌గా మారిందని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. ఎక్కువ ఆదాయం కావాలంటే ప్రకృతి వ్యవసాయంతో సాధ్యం అన్నారు. నిజానికి దేశ వ్యవసాయ రంగంలో ఏపీ వాటా 10 శాతంగా ఉందని అసెంబ్లీలో ఏపీ వార్షిక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గ్రోత్ ఇంజన్లుగా 11 పంటలను గుర్తించినట్లు వెల్లడించారు. పీఎం కిసాన్ పథకం కింద ఈ ఏడాదికి రూ.6,600 కోట్లు బడ్జెట్‌లో కేటాయించినట్లు ప్రకటించారు.





















