ప్రోటీన్, పీచుపదార్థం, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది కందిపప్పు. ఇందులోని ప్రోటీన్లు కండరాల పెరుగుదలకు దోహదం చేస్తుంది. ఫైబర్ పదార్థం జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. దీనిలోని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల బ్లడ్ సుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది. దీంట్లో ఉండే విటమిన్ బీ, విటమిన్ సీ, విటమిన్ సీలు శరీరానికి శక్తిని అందిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కందిపప్పులోని ఖనిజాలు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంలు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. బ్లడ్ ప్రెషర్‌ను నియంత్రిస్తాయి. దీనిలోని ఫైబర్, ఇతర పోషకాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాతుంది. కందిపప్పులో ఎక్కువగా ఉండే ఫైబర్, ప్రోటీన్ కడుపు ఎక్కువ సమయం నిండుగా ఉంచుతుంది. దీంతో బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. ప్రధాన ఆహారంగా భారతీయులు తమ రోజువారీ ఆహారంలో కందిపప్పును తీసుకోవడం అలవాటు.
శ్రమ తక్కువ ఉండాలి. దాంతో పాటు భూసారం పెరగాలంటే వరి, పత్తి లాంటి వాటి కంటే పవాణిజ్య పంటలు కంది, పెసర, మినుము లాంటివి లాభదాయకంగా ఉంటుంది. వీటిలో మళ్లీ కంది పంట సాగులో అన్నదాతకు మరింత శ్రమ, రిస్క్ తక్కువ. పెట్టుబడి కూడా తక్కువే. ఎక్కువ ఆదాయం వస్తుంది. ఎకరం భూమిలో కంది విత్తనాల కోసం సుమారు వెయ్యి రూపాయలు సరిపోతుంది. ఎకరం కందిచేనులో 9 నుండి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించని పరిస్థితుల్లో ఎకరానికి ఆరు లేదా ఏడు క్వింటాళ్ల దిగుబడి వచ్చినా రైతులు నష్టం ఉండదు.
కందిపంట సాగులో భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రతాప్ ఆర్గానిక్, రసాయన ఎరువుల మిశ్రమ వాడకంతో కందిపంటను సాగు చేశారు. గుంటూరులో రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంలో మూడు రోజుల శిక్షణ తీసుకున్నారు. తాత, తండ్రుల కాలం నుంచి ప్రతాప్‌సింగ్‌ది వ్యవసాయ కుటుంబం. దాంతో ప్రతాప్‌కు కూడా వ్యవసాయం పట్ల ఆసక్తి ఎక్కువ. ఎక్కువ దిగుబడి సాధించాలనే ఆశతో ప్రస్తుత కాలంలోని రైతులు పొలాలకు విపరీతంగా రసాయన ఎరువులు వాడి, భూసారాన్ని సర్వనాశనం చేస్తుండడం తనకు ఆందోళన కలిగించిందని చెప్పారు. ఈ క్రమంలో ప్రకృతి వ్యవసాయం చేయాలనే సంకల్పం తనది అన్నారు. తక్కువ శ్రమ, పెట్టుబడితో తక్కువ స్థాయిలో రసాయన ఎరువులు, మరికొంత ఆర్గానిక్ ఎరువులు వాడాలనే ఆలోచనతో తాను ఇలా మిశ్రమ ఎరువుల విధానం ప్రారంభించినట్లు చెప్పారు. మిగతా రైతుల మాదిరి కాకుండా కాస్త భిన్నంగా వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో ఈ విధానంలో రెండు ఎకరాల్లో కంది సాగు చేస్తున్నట్లు చెప్పారు. అంతకు ముందు రసాయన ఎరువులతో సాగు చేసిన భూమిలో ఒక్కసారిగా ప్రకృతి విధానం ఆచరిస్తే.. పంట దిగుబడి పెద్దగా రాదనే అనుమానమే దీనికి కారణం అన్నారు. రసాయన ఎరువులు తగ్గిస్తూ.. సహజ ఎరువుల వాడకం పెంచుతూ క్రమేపీ ఆర్గానిక్ పంటల సాగు చేయాలనేది తన ఉద్దేశం అని తెలిపారు.
కంది చేనులో అంతర పంటగా తాను పెసరపంట పండిస్తున్నట్లు చెప్పారు ప్రతాప్ జూన్ తొలి వారంలో భూమిని దుక్కి దున్ని, చదును చేశారు. ఇలా నెల రోజుల ముందే దున్నితే.. భూమిలో ఉండే పంటలకు హాని చేసే క్రిములు, కీటకాల గుడ్లు ఎండ వేడిమికి నాశనం అవుతాయన్నారు. అలాగే పక్షులు కూడా పురుగులు, వాటి గుడ్లను పక్షులు కూడా తినేస్తాయన్నారు. హనుమకొండ వ్యవసాయ పరిశోధనా కేంద్రం నుంచి శాస్త్రవేత్తల సలహా ప్రకారం డబుల్ RG 255 కంది విత్తనాలు తీసుకున్నట్లు వెల్లడించారు. సీడ్ డ్రిల్ ద్వారా విత్తనాలు నాటుకోవచ్చు కానీ తాను మాత్రం కూలీలతో విత్తనాలు వేయించినట్లు తెలిపారు.
కంది విత్తనాలను తేలికైన చవుక నేలల్లో కనీసం 3 అడుగుల దూరంలో నాటుకోవాలని శాస్త్రవేత్తలు తెలిపారని ప్రతాప్ చెప్పారు. బరువైన నల్లరేగడి నేలల్లో 4 అడుగులు అంతకంటే ఎక్కువ దూరం కూడా నాటుకుంటే దిగుబడి ఎక్కువ వస్తుందన్నారు. తాను మాత్రం 30 అంగుళాల దూరంలోనే విత్తనాలు నాటినా కాపు చాలా బాగా వచ్చినట్లు తెలిపారు. కందిమొక్కలు 45 రోజుల వయస్సు వచ్చేసరికి కొసలను కత్తిరించుకోవాలన్నారు. ఆ తర్వాత మొక్కలకు పక్క నుంచి వచ్చిన కొత్త కొసలను 25 నుంచి 30 రోజుల తర్వాత మరోసారి కత్తిరించాలని చెప్పారు. ఆ తర్వాత మరో నెల రోజులకు మళ్లీ పక్కన వచ్చిన కొత్త కొమ్మలను కూడా కత్తిరించాలని తెలిపారు. ఇలా చేయడం వల్ల కంది మొక్కలు ఎక్కువ కొమ్మలతో గుబురుగా తయారై పువ్వులు, కాయలు అధిక వచ్చి దిగుబడి పెరుగుతుందన్నారు.
కందిపంట 170 రోజుల మధ్యస్థ కాలపరిమితి గల పంట. ఇలాంటి కంది చేనులో 70 నుంచి 75 రోజుల వ్యవధి పంట కాలం ఉండే పెసర, మినుము, ఉలవలను అంతర పంటగా వేసుకోవచ్చు. తాను ఎకరం పావు కందిచేలో పెసలు వేస్తే.. తొలి కటింగ్‌కే 150 కిలోల దిగుబడి వచ్చిందన్నారు ప్రతాప్. తర్వాత రెండు, మూడు కోతలు కోసుకుంటే సుమారు 4 క్వింటాళ్ల వరకు పంట వస్తుందన్నారు.
కందిపంట వేయాలనుకున్న భూమిని దుక్కి దున్ని, చదును చేసిన తర్వాత జీవన ఎరువులు ఫాస్పో బ్యాక్టీరియా, అజితో బ్యాక్టీరియా, రైజో బీఎం కల్చర్‌ల ఎరువులతో కలిపి వేసినట్లు ప్రతాప్ చెప్పారు. ఎకరానికి 125 కిలోల సూపర్ ఫాస్పేట్, 20 కిలోల నత్రజనిని అందించే యూరియాను కలిపి చివరి దుక్కిలో చేను అంతా చల్లినట్లు తెలిపారు. తర్వాత విత్తనాలు నాటినట్లు పేర్కొన్నారు. మొక్కకు మొక్కకు మధ్య 8 అంగుళాలు, సాలుకు సాలుకు మధ్య 3 అడుగుల దూరంలో నాటాలన్నారు. కందిచేనుకు ప్రధానంగా వచ్చే సమస్య కలుపు నివారణ కోసం తక్కువ మోతాదులో ఆరు నెలల సమయంలో రెండు సార్లు గడ్డిమందు స్ప్రే చేశారు. కంది విత్తనం నాటిన 48 గంటల్లో ఎకరానికి లీటర్ చొప్పున పిండిమిథాల్ మందును స్ప్రే చేయాలని శాస్త్రవేత్తలు సూచించారన్నారు. దీంతో 30 నుంచి 35 రోజుల వరకు కలుపు రాకుండా చేస్తుందన్నారు. అప్పటికి కంది మొక్కలు పైకి వచ్చేస్తాయని తెలిపారు. ఆ తర్వాత మరోసారి హిమాజిత ఫైర్ మందు కూడా స్ప్రే చేసినట్లు చెప్పారు. దాంతో మరో 30 నుంచి 35 రోజుల వరకు కలుపు రాలేదన్నారు. కలుపు మందు ఎక్కువసార్లు ఇస్తే.. కంది మొక్కల ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుందని అన్నారు. అదనపు ఆదాయం కోసం వేసిన పెసర మొక్కలు ఆ తర్వాత కలుపు పెరగకుండా కాపాడాయన్నారు.
కందిపంటకు ఎండు తెగులు వస్తే.. ఆ మొక్కలను తీసేసి, కాల్చేయాలని ప్రతాప్ సూచించారు. కందిని పొగాకు లద్దిపురుగు ఆశిస్తే.. ఫ్లూ బెండమైడ్ అనే పురుగు మందు, 13:0:45 మందు కలిపి స్ప్రే చేసి, నివారించినట్లు చెప్పారు. అంతకు ముందు తాను వేపనూనె, మోనో కలిపి స్ప్రే చేశామన్నారు. కందిమొక్కలను ఫ్లవరింగ్ స్థాయికి వచ్చే వరకు అడుగు మందులు వేయక్కరలేదు. పై మందులేవీ స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. చివరి దుక్కిలో వేసిన సింగిల్ సూపర్ ఫాస్పేట్, నత్రజని సరిపోతాయి. కందికి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత నెలన్నర, రెండు నెలల కాలం చాలా కీలకం అన్నారు ప్రతాప్. ఫ్లవరింగ్ సమయంలో కందికి మార్కా మచ్చల పురుగులు, లద్దెపురుగులు నాలుగైదు రకాల పురుగులు ఆశిస్తాయి. ఫ్లవరింగ్ తర్వాత రెండు నెలల పాటా కందిమొక్కలను కాపాడుకుంటే.. దిగుబడి ఎక్కువగా వస్తుందని చెప్పారు.
పత్తి, వరి మాదిరిగా కందిసాగుకు రిస్క్ ఉండదు. కంది విత్తనాలను జూన్, జులై నెల్లలో విత్తుకుంటే మంచి సమయం. ఈ సమయంలో పెట్టిన మొక్కలకు వర్షం ద్వారా నీరు అందుతుంది. అయితే.. ఫ్లవరింగ్ సమయంలో మాత్రం ఒక్క తడి నీరు ఇవ్వాలి. పూత కాయగా మారినప్పుడు రెండో తడి పెట్టుకుంటే సరిపోతుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలు కూడా అనుకూలం. ఈ సమయంలో అయితే.. కందికి నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది.
మూస ధోరణిలో ప్రతి ఏటా ఒకే రకం పంట వేస్తే.. భూసారం క్రమేపీ తగ్గిపోతుందని, పంటల మార్పిడి విధానం వల్ల భూసారం మరింత పెరుగుతుందన్నారు. కందిసాగు విషయానికి వస్తే.. మొక్కలకు రెండు అడుగుల ఎత్తు వరకు ఆకులు పండి నేల రాలిపోయి, తర్వాతి పంట వేసేసరికి భూమిలో కలిసిపోయి చక్కని సేంద్రీయ ఎరువుగా మారతాయి. కంది, పెసర, మినుము, ఉలవ మొక్కల వేర్లలో నైట్రోజన్ నిల్వ ఎక్కువగా ఉంటుంది. కందిపంటను మార్కెట్‌లో అమ్మే కంటే.. స్థానికంగా విక్రయిస్తే.. ధర ఎక్కువ వస్తుందని ప్రతాప్ తెలిపారు. రైతు- వినియోగదారుడి మధ్య దళారులు లేకపోతేనే ఇద్దరికీ లాభం ఉంటుంది. క్వింటాల్ కందులకు మార్కెట్‌లో సుమారు రూ.10 వేలు వస్తే.. స్థానికంగా విక్రయిస్తే.. రూ.12 వేలు వరకు ధర వచ్చే అవకాశం ఉంటుంది. ఖర్చు, రిస్క్ చాలా తక్కువ, దిగుబడి ఎక్కువ వచ్చే కంది సాగు రైతులకు అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.





















