వారం మొత్తంలో ఉద్యోగ బాధ్యతలు, వ్యాపార లావాదేవీలతో అలసిపోతున్నారా? వారాంతంలో కాస్త సేదదీరితే బాగుంటుందని భావిస్తున్నారా? అయితే.. వారాంతంలో ప్రకృతి వ్యవసాయం చేస్తే.. అలసట తీరే మార్గం ఒకటుంది. వారంతంలో మాత్రమే ప్రకృతి వ్యవసాయం చేసే విధానం. కాంక్రీట్‌ జంగిల్‌లో నలిగిపోయే వారికి సిటీకి కాస్త దగ్గరలో ఏమాత్రం ఖాళీ స్థలం ఉన్నా ఇలాంటి వ్యవసాయం చేసుకోవచ్చు. సొంతంగా భూమి లేకపోయినా లీజుకు తీసుకుని ఈ మాదిరి వ్యవసాయం చేయొచ్చు. ఇదే విషయాన్ని నిరూపించారు శాంతి గట్టినేని.

నగర వాతావరణంలో కాలుష్యం ఎక్కువ అయిన నేపథ్యంలో కనీసం వీకెండ్‌లో అయినా మంచి గాలి పీల్చుకోవాలని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవించాలనే ఉద్దేశంతో వీకెండ్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ చేస్తున్నట్లు శాంతి చెప్పారు. తన ఫార్మ్‌లో పనివాళ్లను, సూపర్‌వైజర్లను కానీ నియమించలేదన్నారు. వారాంతాల్లో తాను మాత్రమే వచ్చి మొక్కలకు నీళ్లు పెడతానని, ఫార్మ్‌లోని సెటప్‌ ఎలా ఉందో పరిశీలిస్తానని తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం సీతారాంపేటలో శాంతి ఇలా వీకెండ్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్ చేపట్టారు.

ఇలాంటి ఒక ఆలోచన తనకు కలిగిన తర్వాత సుభాష్‌ పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయ విధానం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లు శాంతి చెప్పారు. ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయ విధానాలపై జరిగిన కొన్ని సెమినార్లలో పాల్గొన్నట్లు తెలిపారు. తమ తోటలో అడవి వాతావరణం వచ్చేందుకు ఐదంచెల విధానాన్ని రెండంచెలుగా మార్చినట్లు శాంతి చెప్పారు. వారాంతంలో మాత్రమే క్షేత్రానికి వస్తున్న ఆమె ఒక మొబైల్‌ మోటర్ స్టార్టర్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు. దానితో ఇంటి నుంచే వర్షాకాలంలో రోజుకు ఒకసారి గంట, ఎండలు ఉంటే ఉదయం, సాయంత్రం రెండేసి గంటల చొప్పున మొక్కలకు నీరు అందిస్తున్నట్లు తెలిపారు.ఎకరం పొలంలో 100 మునగ, 100 బొప్పాయి, 100 అరటి మొక్కలు నాటారు శాంతి. దాంతో పాటుగా భూమికి లైవ్‌ ఆచ్ఛాదన బొబ్బర్లు, ఉలవలు సాగు చేశారు. నేలపై కలుపు ఉన్నప్పుడే తాను బొబ్బర్లు, ఉలవ విత్తనాలు చల్లినట్లు తెలిపారు. ఈ విత్తనాలు మొలిచిన తర్వాత కలుపు మొక్కలు పీకినప్పుడు బొబ్బర్లు, ఉలవల మొక్కల మొదళ్లలోని భూమి గుల్లగా మారిందన్నారు. ఈ మొక్కలే ప్రధాన మొక్కలకు ఆచ్ఛాదనగా, భూమిలో నైట్రోజన్‌ ఫిక్స్‌ చేసేవిగా, వానపాములు పెరిగేలా, భూమికి సారాన్నిచ్చేలా పనికి వస్తాయి.

మొక్కలను ఒక క్రమపద్ధతిలో కాకుండా అడవి వాతావరణం కనిపించేలా ర్యాండమ్‌గా మొక్కలు నాటినట్లు చెప్పారు. వారాంతపు ఫార్మింగ్‌లో శాంతి మొక్కలు నాటేందుకు బెడ్స్‌ ఏర్పాటు చేయలేదు. మామూలుగా భూమిలోనే మొక్కలు నాటారు. దీంతో బెడ్స్ వేసుకునే ఖర్చు కూడా తగ్గిపోయింది.శాంతి గట్టినేని ఏడాది కాలంగా వారాంతపు ఆర్గానిక్ ఫార్మింగ్‌ చేస్తున్నారు. నేచురల్ ఫార్మింగ్‌లో మునగ, బొప్పాయి పంటలు తక్కువ దిగుబడి ఇస్తాయని అంటారు కానీ.. తనకు అంత తక్కువ అనిపించలేదన్నారు. ఆర్గానిక్‌ పంటలకు బాలాపూర్‌లోని జేపీ ఆర్గానిక్స్‌ షాపులో మామూలు పంటల కన్నా మూడు రెట్లు అధిక ధర ఇస్తున్నట్లు చెప్పారు. వారు గ్రేడింగ్‌ చేయగా మిగిలిన వాటిని కొత్తపేటలోని ఎన్టీఆర్ నగర్‌ మార్కెట్లో హోల్‌సేల్‌గా అమ్ముతానని అన్నారు. వంద మునగ చెట్ల నుంచి ఒక్కొక్క కాపులో 80 కిలోల వరకు దిగుబడి వచ్చిందన్నారు. ఒక్కోసారి 90 నుంచి 100 కిలోలు కూడా వచ్చినట్లు చెప్పారు. మొక్కలకు శాంతి కేవలం ఘన జీవామృతం మాత్రమే ఇచ్చారు.లైఫ్‌ మల్చింగ్‌ మొక్కలు బొబ్బర్లు, ఉలవ మొక్కలు నేలతో తేమ నిల్వ ఉండేలా చేస్తాయి. వాటి వేర్లు భూమిలో నైట్రోజన్‌ను స్థిరీకరిస్తాయి. క్రిమికీటకాలు ప్రధాన మొక్కలను ఆశించకుండా చేస్తాయి. వాటి ఆకులు కాడలు సహజసిద్ధ ఎరువుగా ప్రధాన పంట మొక్కలకు ఉపయోగపడతాయి. వీటితో పాటు గౌప్రతిష్ఠ సంస్థ నుంచి నెలకు లేదా రెండు నెలలకు ఒకసారి 200 కిలోల ఘన జీవామృతం తీసుకొచ్చి మొక్కలకు వేస్తారు. మొక్క సైజును బట్టి ఒక్కోసారి రెండు నుండి మూడు కిలోల చొప్పున వేస్తామన్నారు. మొక్కలు నాటే ముందు వాటిని నాటేందుకు తీసిన ఒక్కో పిట్‌లో రెండు కిలోల ఆర్గానిక్‌ ఎరువును మట్టిలో కలిపారు. మొక్కలు నాటిన తొలిరోజుల్లో నెలకొకసారి ఎరువు వేసినట్లు చెప్పారు. మధ్య మధ్యలో ఒకసారి ఎరువు వేయకపోయినా మొక్కలు బాగా ఎదిగాయన్నారు.నీటిని క్రమం తప్పకుండా సరఫరా చేస్తేనే చాలావరకు సరిపోతుంది. మొక్కలకు క్రిమికీటకాలు ఆశించకుండా అగ్ని అస్త్రం, దశపర్ణి కషాయం, పంచగవ్య, వేప- గానుగ- సీతాఫలం గింజల కషాయం స్ప్రే చేసినట్లు శాంతి తెలిపారురు. ఆరు వేల రూపాయలతో కొన్న ఆర్గానిక్‌ మందులు తమ ఎకరం తోటలో సంవత్సరం పొడవునా వాడినా ఇంకా సగం మిగిలే ఉన్నాయన్నారు.

ఎకరం భూమిలో ఆర్గానిక్‌ తోట పెంచడానికి శాంతి చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తే.. రూ.2.50 లక్షలు అయింది. దీనిలో రూ.1.2 లక్షలు ఆయిల్‌కు ఖర్చయింది. డ్రిప్‌ వేసేందుకు రూ.30 వేలు, భూమిని సాగుకు అనుకూలంగా మార్చేందుకు, జేసీబీ ఖర్చులు, మోటార్‌, స్టార్టర్లు, కషాయాలు, మొక్కలు కొనేందుకు అన్నీ కలిపి సుమారు రూ. 30 నుంచి రూ. 40 వేలు వరకు అయిందని చెప్పారు. కూలీల ఖర్చు మరో రూ.30 వేలు వచ్చిందన్నారు. ఇవన్నీ కలిపి రూ.1.2 లక్షలు అయింది. ఆరు నెలల్లోనే రూ.40 వేలు రిటర్న్ వచ్చిందని, మరో రెండున్నరేళ్ల పాటు తనకు పంట దిగుబడి వస్తూనే ఉంటుందని తెలిపారు.మొక్కలు పెట్టిన ఆరు నెలలకు కేవలం మునగకాయలు, బొప్పాయిల ద్వారా సుమారు రూ.40 వేలు రిటర్న్‌ వచ్చిందని శాంతి తెలిపారు. ఇంకా అరటి కాయలు కోతకు సిద్ధంగా ఉన్నాయని, వాటిని కూడా హార్వెస్ట్ చేస్తే దాదాపు రూ.1.5 నుండి రూ. 2 లక్షల వరకు రావచ్చని చెప్పారు. ఇలా శాంతి పెట్టుబడి పెట్టిన డబ్బులు తిరిగి వచ్చేశాయి. మామూలు రైతులు ఏడాదంతా ప్రతిరోజూ కష్టపడినా పెట్టిన పెట్టుబడి పోగా కేవలం రూ.30 నుంచి రూ.40 వేలు కూడా మిగలడం లేదు. శాంతి కేవలం వారాంతం రెండు రోజులే స్వయంగా ఫాంలో కష్టపడితే ఫలితం ఇలా ఉంది. ప్రతిరోజూ ఇంటి నుంచి నీటి సదుపాయం చూసుకుంటున్నా అంత కష్టమేమీ లేదని చెప్పారు.శాంతి చేస్తున్న విధానంలో మరో జాబ్‌ చేసుకుంటూ వారాంతంలో ప్రకృతితో మమేకం కావచ్చు. చక్కని గాలి పీల్చుకోవచ్చు. ఆదాయానికి లోటు ఉండదు. ఆరోగ్యమూ ఉంటుంది. స్థలం కొని, ఖాళీగా ఉంచేవారు తన లాంటి ఔత్సాహికులకు లీజుకు ఇస్తే.. ఆదాయం వస్తుంది. భూమి సారవంతం అవుతుందని శాంతి చెప్పారు. ఈ విధానంలో వ్యవసాయం చేస్తూ కూడా అనేక మెళకువలు నేర్చుకోవచ్చని, అలా ఏడాదిలో తాను కూడా చాలా నేర్చుకున్నానని తెలిపారు.

శాంతి గట్టినేనిని ఇన్‌స్టాగ్రామ్‌ thatweekendfarmermomలో సంప్రదించవచ్చు.