దిష్టి తగలకూడదని ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయలు కట్టేవారు మన పూర్వీకులు. ఈ ఆధునిక కాలంలో కూడా పలువురు ఇలా చేస్తున్నారు. ఒకప్పుడు బూడిద గుమ్మడికాయలతో వడియాలు తయారు చేసి, ఆహారంలో వాడేవారు. ఇప్పుడు ఆగ్రాపేటా లాంటి మిఠాయి తయారు చేస్తున్నారు. కూరగా కూడా వాడుతున్నారు. అయితే.. బూడిద గుమ్మడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆధునిక వైద్యులు సూచిస్తున్నారు. ఉదయమే పరగడుపున బూడిద గుమ్మడి రసం తాగితే మంచిదని వైద్యులు చెబుతున్నారు. బూడిద గుమ్మడి రసం ఉదయాన్నే తాగితే.. శరీరానికి చలవ చేస్తుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. కిడ్నీలో రాళ్లను నివారిస్తుంది. శక్తిని పెంచడంతో పాటు బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. బూడిద గుమ్మడి విత్తనాలు తింటే అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బూడిద గుమ్మడిలో 96 శాతం నీరు, పోషకాలు ఉంటాయి.

బూడిద గుమ్మడి రసం మన శరీరం నుంచి వ్యర్థాలను బయటికి పంపిస్తుంది. దీనిలో క్యాలరీలు తక్కువ కాబట్టి ఆహారంగా లేదా జ్యూస్‌గా తీసుకున్న వారి బరువు తగ్గిస్తుంది. బూడిద గుమ్మడిలో ఉండే అధిక పీచుపదార్థం, ఎక్కువగా ఉండే నీరు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. కిడ్నీలో రాళ్లు తగ్గడానికి, మూత్రాశయ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. ఎండాకాలంలో శరీరంలో వేడిని తగ్గించి, డీహైడ్రేషన్‌ రాకుండా రక్షిస్తుంది. బూడిద గుమ్మడిలో కాల్షియం, ఐరన్‌, జింక్‌, బీ 1, బీ 2, బీ 3, బీ5, బీ 6 విటమిన్లు పుష్కలం. బ్లడ్‌ షుగర్‌ స్థాయిలు అదుపులో ఉండేందుకు గుమ్మడి తోడ్పడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతారు.మనుషులకు అనెక ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తున్న బూడిద గుమ్మడి సాగు రైతు రొక్కం కూడా దండిగానే అందిస్తుందని చెబుతున్న అమరావతి ప్రాంతంలోని పెనుబాక రైతు మేకా వెంకటరెడ్డి అనుభవాల గురించి తెలుసుకుందాం. వెంకటరెడ్డి 12 ఎకరాల్లో 11 ఏళ్లుగా బూడిద గుమ్మడి సాగు చేస్తున్నారు. ఒక పక్కన బూడిద గుమ్మడి కాయలు అమ్ముతూనే మరో పక్కన ఒక ఎకరంలో పండించిన బూడిద గుమ్మడి కాయల నుంచి విత్తనాలు తయారుచేసి విక్రయిస్తున్నారు. ఆరోగ్యాన్ని కోరుకునే అనేక మంది ఇప్పుడు అన్నం కూడా మానేసి, బూడిద గుమ్మడి రసం తాగుతుండడంతో సేల్స్ బాగా పెరిగిందని వెంకటరెడ్డి చెప్పారు. బూడిద గుమ్మడికి ధర తక్కువ ఉన్నప్పుడు అవసరం అయితే.. కోతకు వచ్చిన తర్వాత కూడా రెండు నెలల పాటు పాదు నుంచి కోయకుండా ఆపుకోవచ్చన్నారు.బూడిద గుమ్మడి కాయ విత్తనాలు నాటినప్పటి నుంచి 90 నుంచి 115 రోజుల్లో కోతకు వస్తుంది. రేటు లేకపోతే మరో 50 రోజులు పాదుకే ఉంచినా నష్టం ఉండదు. లేదా కాయలు కోసి గుట్టగా వేసినా చెడిపోదు. కోసి, గుట్టగా వేసిన బూడిద గుమ్మడికాయలు చెడిపోకూడదంటే అప్పుడప్పుడూ అటూ ఇటూ తిప్పుతుండాలి. విత్తనం నాటిన తర్వాత 60 రోజుల నుంచి పూత, పిందెలు వస్తు కాపు మొదలవుతుంది చెప్పారు.బూడిద గుమ్మడికాయ పైన చెక్కు తీస్తే.. లోపలి గుజ్జు కాస్త తియ్యగా ఉంటుందని చెప్పారు. బూడిద గుమ్మడి కాయలను భారతదేశం అంతా విశేషంగా వినియోగిస్తున్నారన్నారు. హైబ్రీడ్ బూడిద గుమ్మడి కాయ లావుగా ఎక్కువ బరువు ఉంటుంది. అమరావతి నాటుగా పిలిచే తాము పండించే దేశవాళీ బూడిద గుమ్మడికాయలకు ఎక్కువ డిమాండ్ ఉందని చెప్పారు. అమరావతి నాటు బూడిద గుమ్మడికాయలు టన్ను రూ.10 నుంచి రూ. 15 వేలు వరకు ధర పలుకుతుంది. ఎకరం నేలలో సుమారు 15 టన్నుల వరకు దిగుబడి వస్తుందని వెంకటరెడ్డి తెలిపారు. పంట కోతకు వచ్చిన తర్వాత కూడా పాదు చనిపోదు. కాబట్టి కోయని కాయలు ఏమాత్రం చెడిపోవు.వేసవి కాలం తప్ప శీతాకాలం, వర్షాకాలాల్లో బూడిద గుమ్మడి సాగుకు అనుకూలం.  ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటితే పంట దిగుబడి కొద్దిగా తగ్గుతుందని రైతు వెంకటరెడ్డి తెలిపారు. మేనెలలో విత్తనాలు నాటుకొని జాగ్రత్తగా నిర్వహిస్తే.. ఏప్రిల్‌ నాటికి పంట చేతికి వస్తుంది. విత్తనానికి విత్తనానికి మధ్య దూరం అడుగున్నర, సాలుకు సాలుకు మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా విత్తనాలు నాటుకోవాలి. దుక్కి బాగా దున్నిన తర్వాత మడిని సాళ్లుగా చేసుకొని నీరుపెట్టి విత్తనాలు నాటుకోవాలి. డ్రిప్ విధానం ఉంటే బూడిద గుమ్మడి పాదులకు నీటి సరఫరా మరింత సులువు అవుతుంది. పంట కూడా నాణ్యంగా వస్తుంది. దుక్కి దున్నిన తర్వాత రెండు బస్తాల కాంప్లెక్స్ ఎరువు వేయాలని వెంకటరెడ్డి తెలిపారు. దుక్కి దున్నేటప్పుడే పశువుల పెంట వేసుకోవచ్చన్నారు.ఏ నేలలో అయినా బూడిద గుమ్మడి పంట పండుతుంది. ఎకరం నేలలో కిలో నుంచి కిలో పావు విత్తనాలు అవసరం అవుతాయి. వీటి కొనుగోలుకు 1500 రూపయాలు సరిపోతాయి. ఒక్కో పాదులో రెండు విత్తనాలు నాటుకుంటే మంచిదన్నారు. ఒకదాన్ని చీమలు తినేసినా మరో విత్తనం మొలకెత్తుతుందని చెప్పారు. బూడిద గుమ్మడి విత్తనాలు రైతుల వద్ద లభిస్తాయి. వేసవి కాలంలో అయితే.. మూడుసార్లు నీరు సరఫరా చేయాలి. వర్షాకాలంలో ఒక తడి సరిపోతుంది. వర్షాకాలంలో నీరు ఎక్కువ అయితే.. ఆరుదల భూమి అయితే పాదులకు ఏమీ కాదని వెంకటరెడ్డి చెప్పారు. బూడిద గుమ్మడి కాయలు కోతకు వచ్చిన తర్వాత వాటి సైజును బట్టి, బూడిద రంగులోకి మారడాన్ని బట్టి రెండు లేదా మూడు కటింగ్‌లు వస్తుంది.నేల స్వభావాన్ని, వాతావరణాన్ని బట్టి బూడిద గుమ్మడి పాదులకు వచ్చే తెగుళ్ల నివారణకు అంత ఖరీదు లేని పురుగు మందులు స్ప్రే చేస్తే సరిపోతుంది. పంట కాలంలో నాలుగైడు సార్లు పురుగు మందులు స్ప్రే చేస్తే సరిపోతుంది. ఎరువులు, పురుగు మందుల కోసం ఎకరానికి రూ.10 వేలు వరకు ఖర్చు వస్తుంది. దుక్కి దున్నేందుకు ఎకరానికి రూ.2 వేలు అవుతుంది. ఇద్దరు మనుషులు ఉంటే ఎకరం నేలలో విత్తనాలు నాటుతారు. కూలి ఖర్చు సుమారు వెయ్యి రూపాయలు వస్తుంది. అమ్మినప్పుడు బూడిద గుమ్మడి కాయలను కొనుగోలు దారులే కూలీలతో కోయించుకుంటారు. కూలీల ఖర్చు, రవాణా ఛార్జీలు రైతుకు ఉండదు. ఎకరం భూమిలో బూడిద గుమ్మడి కాయలు తొలి కోతలో 10 టన్నుల వరకు వస్తుంది. మార్కెట్‌ డిమాండ్‌ను బట్టి నాలుగైదు టన్నుల చొప్పున కూడా కాయలు కోసుకోవచ్చు. మొత్తం బూడిద గుమ్మడి పంట పూర్తయ్యే సరికి 15 నుంచి 20 టన్నుల దిగుబడి రావచ్చు. టన్ను ధర రూ. 10 వేలే వచ్చినా, 10 టన్నులే దిగుబడి వచ్చినా రైతులకు లక్ష రూపాయలు నికర ఆదాదం ఉంటుంది. దుక్కి విత్తనాలు నాటడం, నీరు సరఫరా, ఎరువులు, పురుగు మందులకు అత్యధికంగా రూ.15 వరకు ఖర్చు అవుతుంది. పొలం కౌలు అన్నీ కలిపి అత్యధికంగా రూ.35 వేలు ఖర్చు వస్తుంది. దీంతో రైతులకు 65 వేల రూపాయలు నికర లాభం ఉంటుందని రైతు వెంకటరెడ్డి వివరించారు. సొంత భూమి అయితే.. కౌలు ఖర్చు మిగులుతుంది.బూడిద గుమ్మడికి ఇప్పుడు డిమాండ్‌ బాగా పెరిగింది కాబట్టి పండించిన రైతు వద్దకే వచ్చి కొనేవారు చాలా మంది ఉన్నారని వెంకటరెడ్డి చెప్పారు. డిమాండ్‌ ఉంది కనుక ఔత్సాహిక రైతులు బూడిద గుమ్మడి సాగు చేసుకుంటే లాభదాయకమే అన్నారు వెంకటరెడ్డి.

మరిన్ని వివరాలు కావాలంటే రైతు వెంకటరెడ్డి నెంబర్‌: 9441193617లో సంప్రదించవచ్చు.