అశ్వగంధకు ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. అధిక ఒత్తిడిని నియంత్రిస్తుంది ఈ మొక్క. శరీర, మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో దీని పనితనం అద్భుతం అనే చెప్పాలి. ఒత్తిడికి మూలమైన కార్టిసాల్ హార్మోన్ లెవెల్స్‌ను అశ్వగంధ తగ్గిస్తుంది. నిద్రలేని సమస్యను తొలగించి, గాఢ నిద్ర పట్టేలా చేస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. అశ్వగంధ వాడిన వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఆలోచనా శక్తి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తినిచ్చి వ్యాధుల బారిన పడకుండా అడ్డుకుంటుంది. అశ్వగంధ వాడిన మగవారిలో టెస్లోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి. వీర్యకణాల నాణ్యత పెరుగుతుంది. సంతానోత్పత్తిని మెరుగు పరుస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ పెంచి, రక్తంలో సుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుతుంది. కండరాల పనితీరును మెరుగు పరిచి, శరీర దారుఢ్యాన్ని పెంచుతుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కల్పించే అశ్వగంధకు ‘కింగ్ ఆఫ్ ఆయుర్వేద’ అని పేరు
అశ్వగంధ 35 నుంచి 75 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. అంటే 1.25 మీటర్ల ఎత్తులో గుబురు పొదలా ఉంటుంది. అశ్వగంధ సామాన్యంగా సమశీతోష్ణ ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. అశ్వగంధను మధ్యప్రదేశ్, పంజాబ్, సింధ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రైతులు ఎక్కుబగా సాగు చేస్తారు. తెలుగులో దీనిని పెన్నేరుగడ్డ, పన్నీరు పులివేండ్రం, పిల్లివేండ్రం, దొమ్మడోలు, మాదావి, వాజిగంధి అని పిలుస్తారు.
అశ్వగంధ వేర్లు, ఆకులు, పండ్లు, విత్తనాలు మన ఆరోగ్య రక్షణకు ఎంతో ఉపయోగపడతాయి. మత్తు కలిగించే ఔషధంగా, ఉదర వ్యాధుల నివారణకు పనికొస్తుంది. క్యాన్సర్ వ్యాధి నివారణకు దీన్ని దివ్య ఔషధం అంటారు. విషాన్ని హరించే శక్తి అశ్వగంధకు ఉంది. డీహైడ్రేషన్‌ను, ఉబకాయాన్ని తగ్గిస్తుంది. ఎముకలకు బలం ఇస్తుంది. అశ్వగంధ ఆకులు, వేర్లు, పువ్వులు, కాయలు పుండ్లు, కడుపులో అల్సర్లను నివారిస్తాయి. మోకాలి నొప్పులకు అశ్వగంధ చక్కని ఔషధం. లివర్ సంబంధ వ్యాధులను అశ్వగంధ అరికడుతుంది. ఇలా ఎన్నెన్నో ప్రయోజనాలను మనకు అందించే అశ్వగంధకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. వాణిజ్యపరంగా దీనికి ప్రాధాన్యం ఉంది.
తక్కువ నీటితో, మెట్ట లేదా తేలికపాటి నేలల్లో అశ్వగంధను సులభంగా పండించవచ్చు. అశ్వగంధ ముఖ్యంగా వేర్ల కోసం ఐదారు నెలలు సాగుచేసే ఔషధ పంట. 7.5 నుంచి 8.0 మధ్య PH విలువ, మంచినీటి పారుదల సదుపాయం ఉన్న ఇసుక లేదా ఎర్రనేలలు అశ్వగంధ సాగుకు అనుకూలం. నీరు నిలిచి ఉంటే భూమిల్లో అశ్వగంధ పెరగదు. ఎండాకాలం ముగిసే సమయం అంటే జూలై- ఆగస్టు నెలల్లో సాగు ప్రారంభించేందుకు అశ్వగంధకు సరైన సమయం. విత్తనం నాటే ముందు భూమిని లోతుగా దున్ని, చదును చేసుకోవాలి. కొన్ని రోజుల పాటు ఆ భూమిని అలాగే ఉంచేయాలి. ఇలా చేయడం వల్ల పంటకు భూమి అనుకూలంగా మారుతుంది. విత్తనాలను సీడ్ డ్రిల్‌తో సమానంగా భూమిలో నాటుకోవాలి.
ఎకరం భూమిలో అశ్వగంధ సాగు కోసం సుమారు 7 కిలోల విత్తనాలు కావాలి. విత్తనాలను నేలలో విత్తే ముందు కేజీ విత్తనాలకు 3 గ్రాముల థైరామ్ లేదా డిథాన్‌తో తప్పకుండా శుద్ధి చేసుకోవాలి. అశ్వగంధ విత్తనాలను వెదజల్ల వచ్చు. లేదా వరుసలుగా విత్తుకోవచ్చు. అయితే.. వరుసల మధ్య 20 నుండి 25 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉంచాలి. నారుమడిలో విత్తనాలు వేసి, మొలకెత్తిన 30 నుండి 35 రోజుల తర్వాత ప్రధాన పంట భూమిలో నాటుకోవాలి. అశ్వగంధ నాటిన 30 రోజులకు క్షేత్రంలో కలుపు తీయాలి. ఇది వర్షాధార పంట. మొక్కలకు నీరు ఎక్కువ అవసరం ఉండదు. పంట కాలంలో ఒకటి రెండు సార్లు తేలికపాటి తడులు ఇస్తే సరిపోతుంది. విత్తనం నాటినప్పుడు ఇచ్చిన తడి కాకుండా నెల రోజులకు మరోసారి, తర్వాత నెలన్నర రోజులకు ఒకసారి నీరు ఇస్తే సరిపోతుంది. పశువులు అశ్వగంధ మొక్కల జోలికి రావు. ఎరువులు, పురుగు మందుల అవసరం అంతగా దీని సాగుకు అవసరం ఉండదు.
అశ్వగంధ విత్తనాలు నాటిన 150 నుండి 180 రోజులకు అంటే జనవరి- మార్చి నెలల మధ్య పంట కోతకు వస్తుంది. అశ్వగంధ ఆకులు పసుపురంగులోకి మారి, ఎండిపోవడం మొదలైనప్పుడు మొక్కలు పరిపక్వం చెందినట్లు లెక్క. మొక్కను వేర్లతో సహా నేల నుంచి పీకి, 7 నుండి 10 సెంటీమీటర్ల పొడవు ముక్కలుగా గడ్డి, వేర్లను కట్‌చేసి ఎండబెట్టాలి. ఎకరం భూమిలో 3 నుంచి 5 క్వింటాళ్ల వరకు ఎండిన వేర్లు, 50 నుండి 75 కిలోల విత్తనాలు, గడ్డి దిగుబడి వస్తాయి.
ఒక ఎకరంలో అశ్వగంధ సాగు చేయడానికి సుమారు రూ.20 వేలు ఖర్చు అవుతుంది. అశ్వగంధ గడ్డి కిలో రూ.8కి, విత్తనాలు క్వింటాలుకు రూ.5 వేలు ధర పలుకుతాయి. అశ్వగంధలో ముఖ్యమైనవి దాని వేర్లు. వీటి ధర క్వింటాలుకు రూ.30 నుంచి 50 వేలు వరకు ఉంటుంది. అంటే రైతు పెట్టిన పెట్టుబడికి సుమారు 10 రెట్ల ఆదాయం వస్తుంది. పెట్టుబడిని బట్టి చూసుకుంటే అత్యధిక లాభాలు వస్తాయి. ఒకే ఒక్క పంటతో భారీ మొత్తంలో లాభాలు రావడం చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి ఔషధ విలువలు కలిగిన పంటను ప్రభుత్వం కూడా బాగా ప్రోత్సహిస్తోంది. అశ్వగంధ సాగుపై రైతులకు శిక్షణ, విత్తనాల సరఫరా, మార్కెటింగ్ లాంటి సదుపాయాలను వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కల్పిస్తోంది.
సహకార సంఘాలు, కొన్ని ఫార్మా సంస్థలు అశ్వగంధ దిగుబడులను రైతు నుండి నేరుగా కొనేందుకు ముందుకు వస్తున్నాయి. అశ్వగంధ ఉత్పత్తులకు భారత దేశంలోనే కాకుండా అమెరికా, యూరప్, జపాన్ లాంటి దేశాల్లో భారీ డిమాండ్ ఉంది. ఆయుర్వేద సప్లిమెంట్లు, ఎనర్జీ డ్రింకుల తయారీలో అశ్వగంధను అధికంగా వాడుతున్నారు. అశ్వగంధ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో కోట్లాది రూపాయల మార్కెట్ ఉంది.
ఆధునిక కాలంలో అశ్వగంధ సాగు తక్కువ మెయింటెనెన్స్‌తో రైతులకు బంగారు బాటలా మారింది. తక్కువ పెట్టుబడితో, రైతులు ఎక్కువ శ్రమ చేయకుండానే అధిక లాభాలు తెచ్చిపెట్టే పంట అశ్వగంధ. దీని సాగు రైతులకు అనుకూలంగా ఉంటుంది. అందుకే ఏటికేడాదికీ అశ్వగంధ సాగు చేసేందుకు ఔత్సాహిక రైతులు ముందుకు వస్తున్నారని, తద్వారా సాగుబడి, ఉత్పత్తి పెరుగుతూ వస్తోందని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అశ్వగంధ దిగుబడులకు భవిష్యత్తులో మరింతగా మార్కెట్ డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. అందుకే రైతులు ఇతర సాంప్రదాయ పంటలతో పాటు కొంతమేర అశ్వగంధ సాగు చేసుకుంటే లాభసాటిగా ఉంటుందని వ్యవసాయ, మార్కెటింగ్ నిపుణులు సూచిస్తున్నారు.
NOTE: వివిధ మాధ్యమాల ద్వారా సేకరించిన సమాచారంతో ఈ వ్యాసం తయారైంది.





















