వంటింటి రాణి చింతపండు అంటారు. ఆరోగ్యాలు అందించే మహారాణి అని కూడా చెబుతారు. ప్రపంచం మొత్తంలో చింతపండు లేని వంటిల్లు ఉండదంటే అశిశయోక్తి కాదు. చింతపండు, చింతకాయలు, చింతాకు తెలియని వారు దాదాపు ఉండకపోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా చింతపండు, చింత గింజలకు వ్యాపారపరంగా మంచి డిమాండ్‌ ఉంది. చింతగింజల పొడి డిసెంటరీ, డయేరియా నివారణకు మంచి ఔషధం. చింతచెట్టు వేర్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. చింతచెట్టు ప్రతి అణువూ మనకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. ఎలాంటి పోషణా లేకుండా దానంతట అది సహజంగా పెరిగే అడవిచెట్టు చింతచెట్టు. ఒకప్పుడు ఇవి పుంతలు, పొలం గట్లు, తోటల్లో సహజంగా పెరిగేవి. ఇప్పుడు చింతచెట్లను వాణిజ్య పంటగా పలువురు రైతులు సాగు చేస్తున్నారు.

చింతలోని ఆరోగ్య ప్రయోజనాలు, ఆర్థిక ఉపయోగాలు తెలుసుకున్న పలువురు వ్యాపార పంటగా సాగు చేస్తున్నారు. ఉష్ణమండలాలు, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో చింతచెట్ల సాగు జరుగుతోంది. సీ విటమిన్‌ సమృద్ధిగా ఉండే చింతకాయలు పుల్లగా ఉంటాయి. అక్కడక్కడా కొన్ని చెట్ల చింతకాయలు కాస్త తియ్యగానూ ఉంటాయి. పుల్లగా ఉండే చింతపండును అనేక రకాల వంటల్లో వినియోగిస్తారు. రోటి పచ్చడిగా, ఊరగాయగా, చింతపండు పులిహోరలో, పులుసు కూరల్లో, రసం, సాంబారులలో దీని వినియోగం బాగా ఎక్కువ. వేసవి కాలానికి ముందు వచ్చే చింతచిగురును పప్పులో వేసి చాలా మంది వండుతారు. దీని రుచి గురించి అస్వాదించిన వారే చెప్పాలి. మాంసాహారులు చింతచిగురును మాంసం, పచ్చి రొయ్యలు, ఎండు రొయ్యలతో కలిపి వండుకుంటారు. లేత చింతకాయలు లేదా వామన చింతకాయలతో చేపలు, పప్పు కూరలుగా చేస్తారు.పాత చింతకాయ పచ్చడి జబ్బు నయం అయిన వారికి తొలిసారి అన్నంలో పత్యంగా కలిపి పెడతారు. చింత గింజలను పై పొట్టు తీసేసి, వాటి పౌడర్‌ను బిస్కట్‌ల తయారీలో, ఇతర ఆహార పదార్థాల్లో వాడుతున్నారు. పాత చింతపండు రక్తహీనతను తొలగిస్తుంది. చింతచిగురు రసంలో పటిక బెల్లం కలిపి తాగితే కామెర్ల వ్యాధి తగ్గుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. చింత చిగురు ఉడికించి కీళ్ల వాపులకు పూత పూస్తే వాపులు, నొప్పులు తగ్గుతాయి. చింతచెట్టు బెరడును గుల్మ వ్యాధుల వైద్యానికి వాడతారు. 100 గ్రాముల చింతపండులో 283 క్యాలరీల శక్తి లభిస్తుంది. చింతపండులో విటమిన్ ఏ, విటమిన్‌ బీ, విటమిన్‌ సీ, ఐరన్‌, కాల్షియం ఎక్కువగా లభిస్తాయి. పుల్లటి తేన్పులను అరికట్టేందుకు, కడుపు ఉబ్బరానికి, జ్వరం, వికారం లాంటి రోగాలకు మందుల్లో వాడతారు. ఆకలి మందగించినప్పుడు ఉదయమే నాలుగైదు చెంచాల చింతపండు రసం తాగితే చక్కగా ఆకలి పుడుతుంది. అజీర్ణ రోగాలను తగ్గించి, జీర్ణశక్తిని పెంచేందుకు చింతపండు చక్కని ఔషధం అంటారు.అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం అమ్మవారిపేట రైతు మల్లికార్జున్‌ నాలుగున్నర ఎకరాల్లో చింతచెట్ల వనం పెంచుతున్నారు. నాలుగేళ్ల క్రితం ఆయన చింతమొక్కలు తెచ్చి నాటారు. ఎలాంటి రసాయనాలు లేకుండా సహజసిద్ధంగా చింత సాగు చేపట్టారు. చింత ఆకు, చింతకాయలు, చింతగింజలు, చింత బెరడు, చింతచెట్టు చెక్కల ఉపయోగాల గురించి తెలుసుకున్న ఆయన చింత వనాన్ని వాణిజ్య పరంగా అభివృద్ధి చేశారు. చింత మొక్కలు నాటిన మల్లికార్జున్ నిశ్చింతగా ఉన్నారు. తమ క్షేత్రంలోని చింతచెట్లకు భూ అమృతిని ఎరువుగా భూమికి ఇవ్వడమే కాకుండా, క్రిమిసంహారిణిగా చెట్లపై స్ప్రేచేస్తున్నారు. దీని వాడకంతో చింతచెట్లు ఏపుగా ఎదుగుతున్నాయని, తెగుళ్లు తగ్గిపోయాయని తెలిపారు. సహజసిద్ధంగా పెరిగే చింతచెట్లను చాలవరకు చీడపీడలు ఆశించవు. కానీ ఇటీవల రైతులు పెంచుతున్న హైబ్రీడ్ రకం చింతచెట్లకు అప్పుడప్పుడూ తెగుళ్లు వస్తున్నాయని చెప్పారు.అనంతపురంలోని హార్టీకల్చర్‌ యూనివర్సిటీలో లభించే చింత మొక్కలు తెచ్చి నాటినట్లు మల్లికార్జు తెలిపారు. నాటిన తర్వాత ఏడాది పాటు తాను జీవామృతం, చెక్క, వర్మీ కంపోస్ట్‌ లాంటివి వాడినట్లు వెల్లడించారు. కొద్ది రోజుల తర్వాత ఒక రకం పురుగు ఆకులను తినేస్తుంటే.. వేపనూనె, వేప కషాయం, పచ్చిమిరప కాయలు కలిపి ఉడికించి, స్ప్రే చేస్తే అది తగ్గిందన్నారు. ఆ తర్వాత తమ చెట్లకు వేరుపురుగు ఆశించినప్పుడు తాను ఏమి వాడాలనే విషయం పరిశీలించినప్పడు గ్రో అమృత్‌ గురించి తెలిసిందన్నారు. మూడున్నరేళ్లుగా గో అమృత్‌ వాడిన తర్వాత చెట్లకు ఎలాంటి నష్టం లేదని, బాగా రికవరీ అయ్యాయని చెప్పారు. గో అమృత్‌ వారి భూ అమృతిని చెట్లకు స్ప్రే చేస్తే.. వైరల్‌, ఫంగల్‌ వ్యాధులతో పాటు చీడ పీడలు, బంక తెగులు తగ్గిందన్నారు.తమ ప్రాంతంలో లేబర్‌కు డిమాండ్ ఎక్కువ అని, వారు దొరకడం కష్టం అని చెప్పారు. అందుకే కూలీలతో ఎక్కువగా అవసరం ఉండదనే ఉద్దేశంతో చింతచెట్లు పెంచుతున్నట్లు మల్లికార్జున్‌ వెల్లడించారు. వ్యవసాయంపై తనకు అంతగా అనుభవం లేదని, చింతచెట్ల సాగు అయితే.. ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో ప్రారంభించానన్నారు. హార్టీ కల్చర్‌ యూనివర్సిటీ రూపొందించిన తెట్టోమాలిక రకం చింత మొక్కలు నాటినట్లు చెప్పారు. ఈ చెట్లు నాలుగేళ్ల నుంచి కాపు కాస్తాయని యూనివర్సిటీ అధికారులు చెప్పడంతో ఈ రకాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. వారు చెప్పినట్లు నాలుగేళ్లకు చెట్లు పూతపూశాయని, కానీ గాలి, వాన ఎక్కువగా రావడంతో పూత రాలిపోయిందన్నారు. ఇకపై పూత, కాయ బాగా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెట్టోమాలిక చింతచెట్ల కాయలు పెద్దగా ఉంటాయి. కాపు విపరీతంగా కాస్తాయి.చింతచెట్లకు నీరు పెద్దగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. తమ క్షేత్రంలోని భూమిలో నీరు పుష్కలంగా ఉందన్నారు. దాంతో మోటార్ వేసి మొక్కల వద్ద స్ప్రింక్లర్లు అమర్చినట్లు తెలిపారు. చింతతోటలో కలుపు ఎక్కువగా పెరిగినప్పుడు రొటావేటర్ వేయిస్తానని మల్లికార్జున్‌ వివరించారు. ఇక నుంచి గ్రాస్ కట్టర్‌తో కలుపును చాపింగ్ చేయించాలని చూస్తున్నట్లు తెలిపారు. భూమిని దున్నే పని లేకుండా పూర్తిగా నేచురల్ సేద్యం చేస్తున్నట్లు చెప్పారు. తమ ప్రాంతంలో తన కంటే ఏడాది ముందు ఒక రైతు, తన కన్నా ఆరు నెలల తర్వాత మరో రైతు చింతమొక్కలు సాగు చేపట్టారన్నారు. మల్లికార్జున్ తమ పొలంలో ఎకరానికి 40 చింత మొక్కలు నాటారు. చెట్టుకు చెట్టు మధ్య, వరసకు వరసకు మధ్య 30 అడుగుల దూరం పెట్టాలని హార్టీ కల్చర్‌ యూనివర్సిటీ అధికారులు చెప్పారన్నారు.చింతపండుకు ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌ హిందూపురంలో ఉందన్నారు. దాంతో తనకు మార్కెటింగ్‌కు ఇబ్బంది ఉండదని చెప్పారు. తమ జిల్లాలోనే ఉన్న కళ్యాణదుర్గం, రాయదుర్గంలో, మొలకలమూరు మార్కెట్లలో కూడా చింతపండు అమ్ముకోవచ్చన్నారు. గతంలో అనంతపురం జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సోమేశ్‌కుమార్‌ ‘చింత నిశ్చింత’ అంటూ పలుచోట్ల పూర్వకాలం నాటి చింత మొక్కలు నాటించి, ప్రచారం చేశారని మల్లికార్జున్ చెప్పారు.ఒక్కో చింతచెట్టు నుంచి గింజలు, కాయపైన ఉండే బెరడు పోగా 200 కిలోల వరకు పండు వస్తుందని హార్టీ కల్చర్‌ యూనివర్సిటీ అధికారులు చెప్పారన్నారు మల్లికార్జున్‌. చింతపండు తమకు కిలో 60 నుంచి 70 రూపాయల ధర పలికినా గిట్టుబాటు అవుతుందన్నారు. చింత గింజలను కూడా కిలో 15 నుంచి 20 రూపాయలకు కొంటారని చెప్పారు. చింతకాయలపై ఉండే పెంకులు కూడా గాడిపొయ్యిల్లో వాడుతున్నారన్నారు.చింతచెట్టు నుంచి లభించే ప్రతీదీ ఉపయోగమే అని, డబ్బులు తెచ్చిపెట్టేదే అని ఒక విధంగా దాన్ని కల్పవృక్షం అని చెప్పొచ్చంటారు. చింతగింజల పొడి ఎక్స్‌పోర్ట్‌ అవుతోంది. నీటిలో కలిసిపోయిన మైక్రో ప్లాస్టిక్‌ కణాలను చింతగింజల పొడి చక్కగా వేరు చేస్తున్నట్లు ఇటీవలి పరిశోధనల్లో తేలింది. ఈ పరిశోధనకు విదేశాల్లో బహుమతి వచ్చింది. ఈ పరిశోధన చేసిన విద్యార్థులను ప్రధాని మోడీ అభినందించారు.