సేంద్రీయ సహజ పంటల సాగు దిశగా భారతదేశం వడివడిగా అడుగులు వేస్తోంది. సహజ వ్యవసాయ విధానాలు భారత సాంప్రదాయ జ్ఙాన వ్యవస్థలు, ఆధునిక పర్యావరణ అంశాల నుంచి తీసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. మొక్కలు, చెట్లు, పశువులు కలిసి సహజంగా జీవించేందుకు ప్రకృతి వ్యవసాయం దోహదం చేస్తుంది. బయటి నుంచి ఇచ్చే పోషకాల కన్నా వ్యవసాయంలో మిగిలిన అవశేషాలను రీ సైక్లింగ్ చేయడం, ఆచ్ఛాదన, గాలి ద్వారా భూమి ఆరోగ్యాన్ని పెంచడంపై సహజసిద్ధ వ్యవసాయం ఆధారపడి ఉంటుందని మోడీ వివరించారు. సహజసిద్ధ సేంద్రీయ సాగుబడి ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతున్న సమయంలో ప్రధాని మోడీ కోయంబత్తూరులో జరిగిన దక్షిణ భారతదేశం నేచురల్ ఫార్మింగ్ సమ్మిట్ తన అభిప్రాయాలు వెలువరించారు. భవిష్యత్తులో సహజ సేంద్రీయ వ్యవసాయంతోనే దేశంలో సాగుబడి ఉంటుందన్నారు. దేశాన్ని గ్లోబల్ ఆర్గానిక్ ఫార్మింగ్ హబ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రకృతి పంటల సాగుకు తమ ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తాయని స్పష్టంగా తెలిపారు. జీరో బడ్డెట్ వ్యవసాయాన్ని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ పద్ధతి వ్యవసాయంతో రైతు నెత్తిన పెట్టుబడి భారం తగ్గుతుందని, భూసారం బాగా పెరిగి సహజ పంటలు బాగా ఎదుగుతాయని చెప్పారు. సహజ పంటల ద్వారా మన ఆరోగ్యం మెరుగు అవుతుందని కేంద్రం కూడా ఇలాంటి వ్యవసాయాన్నే ఆదరిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో జీరో బడ్జెట్ సహజ వ్యవసాయం తమ లక్ష్యం అన్నారు. ప్రకృతి సిద్ధమైన సాగుతో భూమిని బాగుచేద్దామన్నారు. భూమి ఆరోగ్యాన్ని కాపాడుతూ ప్రజలకు విషరహిత ఆహారం అందిద్దామని చంద్రబాబు రైతులకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 18 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో 50 ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రకృతి సేద్యం చేసే రైతు పంటలకు లాభం వచ్చేలా ధరలు, మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.
రసాయన ఎరువుల వాడకం మానుకొని, సహజసిద్ధ సేంద్రియ వ్యవసాయం చేయాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. కెమికల్ ఎరువులు వాడి భూసారాన్ని రైతులు నాశనం చేసుకోవద్దని లోకేష్ అన్నారు. పెట్టుబడి ఖర్చు తగ్గించుకొని, భూసారం పెంచేందుకు రైతులు సహజపంట వైపు వెళ్లాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయిలో జీరో బడ్జెట్ సహజ వ్యవసాయ సాగును ప్రోత్సహించడం ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం అని పేర్కొన్నారు. తాజాగా ఆయన కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలంలోని పెనికలపాడులో రైతుమునగాల ద్వారకానాథరెడ్డి సమీకృత సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు.
లోకేష్ తమ క్షేత్రంలోకి వచ్చిన వెంటనే ద్వారకానాథరెడ్డి తమ పొలంలో ఒక చెట్టుకు పిచ్చుకలు కట్టిన గూడు గురించి ప్రత్యేకంగా చూపించారు. రసాయన ఎరువులు వాడిన చోట పిచ్చుకలు ఉండవని, చనిపోతాయి లేకపోతే మరోచోటకు వెళ్లిపోతాయని, గూళ్లు కట్టుకోవని, సంతానాన్ని వృద్ధి చేయలేవని తెలిపారు. పిచ్చుకలు గూళ్లు కట్టాయంటే అక్కడ సహజ పంటల సాగు జరుగుతున్నట్లు తెలుసుకోవచ్చని వివరించారు. సహజంగా పండించిన మామిడిపళ్లు చక్కగా ముగ్గి, రుచిగా ఉంటాలంటే.. బాగా ముగ్గిన ఒక అరటిపండును వాటి మధ్య ఉంచితే సరిపోతుందని రమణారెడ్డి చెప్పారు. సపోట కాయలు బాగా తయారైన తర్వాత చెట్టు నుంచి తెంపి, ఒక డబ్బాడు కాయల్లో ఒక్క స్పూన్ ఆవాలు వేస్తే.. 24 గంటల్లో చక్కగా ముగ్గుతాయన్నారు. సహజసిద్ధంగా పండిస్తున్న తమ పంటలను అమ్మేందుకు తాము ఎక్కడికీ తీసుకెళ్లాల్సిన అవసరమే ఉండదన్నారు. వినియోగదారులు స్వయంగా తమ క్షేత్రానికి వచ్చి తమకు కావాల్సిన పంటలను కొని తీసుకెళ్తారని చెప్పారు. తమ పంటలను ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల ఆహారంలో వినియోగించేందుకు ఆకుకూరలు, కూరగాయలు, దుంపకూరలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఒక మెసేజ్ పెట్టారని ద్వారకానాథరెడ్డి తెలిపారు.
రైతు ద్వారకానాథరెడ్డి, సోదరుడు రమణారెడ్డి ఐదేళ్లుగా ఉమ్మడి కుటుంబానికి చెందిన 17 ఎకరాల్లో ప్రకృతి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. చక్కని సహజ పంటలతో పాటు వారు పశువులను పోషిస్తున్నారు. కోళ్లు, గొర్రెలు, చేపల పంపకాన్ని అనుసంధానం చేశారు. తద్వారా స్థిరమైన ఆదాయం ఆర్జిస్తున్నారు. ద్వారకానాథరెడ్డి సహజ వ్యవసాయ క్షేత్రంలో మామిడి, బత్తాయి, నేరేడు, కొబ్బరి, జామ, ఉసిరి, మునగ, రామాఫలం, సీతాఫలం లాంటి చెట్లను పెట్టారు. అలాగే 250 నాటుకోళ్లు, 60 పొట్టేళ్లతో పాటు చేపలను సక్సెస్‌ఫుల్‌గా పెంచుతున్నారు. తమ గ్రామంలో వృద్ధుడైన రైతు లక్ష్మీనారాయణ స్ఫూర్తితో సహజ పంటల సాగు వైపు తాము వచ్చామన్నారు ద్వారకానాథరెడ్డి సోదరులు.
సహజ పంటల సాగు ప్రారంభించిన తొలిరోజుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని, వ్యవసాయ అధికారుల ప్రోత్సాహంతో వాటిని అధిగమించినట్లు చెప్పారు. తమ క్షేత్రంలోని తాము సహజ ఎరువులతో పాటు, 32 రకాల జీవ వైవిధ్య విత్తనాలు తయారుచేస్తున్నామని చెప్పారు. ఒక్క దేశీ ఆవుతో 20 ఎకరాల సేంద్రియ వ్యవసాయం చేయొచ్చని వారు అనుభవంతో చెప్పారు. నాటుకోళ్ల పెంచడం ద్వారా క్షేత్రంలో కలుపు తీసే పని లేదన్నారు. ఒక్క రూపాయి ఖర్చు చేయకుండానే తమ క్షేత్రంలోని మామిడి చెట్ల ద్వారా ప్రతి ఏటా 3 నుంచి 3.50 లక్షల రూపాయల ఆదాయం వస్తోందని ద్వారకానాథరెడ్డి సోదరులు సంతోషంగా చెప్పారు. ద్వారకానాథరెడ్డి సోదరులు తమ వ్యవసాయ క్షేత్రం మధ్యలో 35 లక్షల నీరు నిల్వ ఉండేలా తయారు చేసిన సంపు గురించిన ప్రత్యేకంగా లోకేష్‌కు వివరించారు.
అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిరుధాన్యాల (మిల్లెట్స్) సాగును ప్రోత్సహిస్తున్నట్లు లోకేష్ స్పష్టం చేశారు. రాయలసీమలో బిందు సేద్యం, గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు రైతుల అనుసంధానం పెంచాలని అన్నారు.
భారతదేశంలోనే కాకుండా అగ్రదేశం అమెరికా సహా పలు విదేశాల్లో సేంద్రియ వ్యవసాయమే చేస్తున్నారు రైతులు. ఆర్గానిక్ పంటలను ప్రత్యేక కౌంటర్లలో పెట్టి పెద్ద పెద్ద మాల్స్ సైతం అమ్ముతున్నాయి. భూమి ఆరోగ్యంగా ఉంటే.. పంటలు బాగుంటాయి. ఆరోగ్యకరమైన పంటలు తినన మనుషుల జీవనం మెరుగవుతుంది. రోగాలు, రొస్టులు లేని ఆరోగ్యకరమైన సమాజాం తయారవుతుంది.





















