భూమి తల్లిపై ఆధారపడడం అంటే జూదం కాదు. కన్నతల్లి, భూమితల్లి కంటే గొప్పవి సృష్టిలోనే లేవంటారు. మాతృమూర్తి కని, జాగ్రత్తగా పెంచినట్లే.. మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు పుడమితల్లి అంతే ప్రేమగా మన అవసరాలు తీరుస్తూనే ఉంటుంది. ఈ సూత్రాన్నే చక్కగా అర్థం చేసుకున్నారు రిటైర్ ఉద్యోగి నెల్లూరి వెంకటేశ్వర్లు. పల్నాడు జిల్లా పొందుగులకు చెందిన ఔత్సాహిక రైతు వెంకటేశ్వర్లు 15 ఎకరాల్లో పంటల వైవిధ్యంతో సహజ వ్యవసాయంలో విజేతగా నిలిచారు. అందరి మాదిరిగానే ఆయన ఒకే పంట వేసి, ఫలితం కోసం ఎదురూ చూస్తూ ఎదురు చూడలేదు. తన అనుభవాన్ని, స్మార్ట్ ఆలోచనను వెంకటేశ్వర్లు పంటల సాగుకు అమలు చేశారు. పక్కా ప్రణాళికతో శాస్త్రీయ విధానాలను కలిపి పొలంలో మిశ్రమ, అంతర పంటల సాగు చేపట్టారు.
అరటి, పసుపు, మిరప, మునగ, బొప్పాయి, తాటిచెట్లను ఒకే పొలంలో వెంకటేశ్వర్లు సాగు చేస్తున్నారు. ఇలా అద్భుతమైన పంటల వైవిధ్యం ప్రదర్శిస్తున్నారు. అరటి తోటలో అంతర పంటగా పసుపు నాటారు. దీని వల్ల అరటి తోటలో కలుపు సమస్య ఉండదు. పైగా ఒకే నీటితో ఈ రెండు పంటలూ పండుతాయి. వెంకటేశ్వర్లు వాణిజ్య పంటలు వేయడంతో పాటు పంటలను ఈదురుగాలుల నుంచి రక్షించేందుకు క్షేత్రానికి నాలుగు వైపులా మామిడి, సపోటా మొక్కలు నాటారు. వాతావరణ పరిస్థితులో, మార్కెట్లో ధరల హెచ్చు తగ్గుల కారణంగానో ఒక పంటలో నష్టం వచ్చినా మిగతా పంటలు ఆర్థికంగా ఆదుకుంటాయని రైతు వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తం చేశారు. ఈ తరం ఔత్సాహిక రైతులకు వెంకటేశ్వర్లు ఇచ్చే అత్యంత ముఖ్యమైన పాఠం ఇదే.
ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత ఏ ఉద్యోగి అయినా ఏమి ఏం కోరుకుంటారు? రిటైర్మెంట్ బెనిఫిట్లు, పెన్షన్ డబ్బులు జాగ్రత్తగా పెట్టుబడి పెట్టి, తద్వారా వచ్చే ఆదాయంతో హాయిగా జీవితం గడిపేయాలనుకుంటారు. మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఎలాంటి ఒత్తిడీ లేని శేష జీవితం జరగాలని భావిస్తారు. కానీ.. నెల్లూరి వెంకటేశ్వర్లు అలా రిటైర్డ్ ఉద్యోగులు అందరిలా ఆలోచించలేదు. ప్రకృతి ఒడిలోకి ఆయన ఆలోచనలు, నడక సాగాయి. విశ్రాంతి తీసుకునే వయసులో మట్టితో సావాసం ప్రారంభించారు. తన చెమటను వెచ్చించి, సమాజంలో కొందరికైనా ఆరోగ్యకర ఆహారం అందిస్తున్నారు.
వెంకటేశ్వర్లు హైదరాబాద్లోని ఓ ప్రసిద్ధ కంపెనీలో 40 ఏళ్లు పనిచేసి రిటైర్ అయ్యారు. నగరాల్లోని ప్రజలు కల్తీ ఆహారం, రసాయనాలతో పండించిన కూరగాయలు తిని రోగాల బారిన పడుతున్న తీరు ఆయనను తీవ్రంగా కలిచివేసింది. అందుకే ఆయన సొంతూరికి వచ్చిన తర్వాత ప్రజలకు రసాయనాలు లేని, స్వచ్ఛమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే.. యధా ప్రకారం ఆయన తలపెట్టిన మంచి పనికి మొదట్లో విమర్శలు వచ్చాయి. రిటైరైన వయసులో వ్యవసాయం ఎందుకు? అనే ప్రశ్నలు బంధు, మిత్రుల నుంచి ఎదుర్కొన్నారు. సహజ వ్యవసాయంలో అడుగుపెడితే పెన్షన్ డబ్బులు కూడా నష్టపోతావని కుటుంబ సభ్యులు భయపెట్టారు.
అయినా వెంకటేశ్వర్లు వెనుకడుగు వేయలేదు. వ్యవసాయం అదృష్టం మీద ఆధారపడే జూదం కాదని, అదొక శాస్త్రమని ఆయన బలంగా నమ్మారు. అదే నమ్మకంతో వెంకటేశ్వర్లు 15 ఎకరాల్లో ప్రకృతి సేద్యం ప్రారంభించారు. నిజానికి పల్నాడు అనగానే ఎండలు, రాతి నేలలు గుర్తుకొస్తాయి. అలాంటి నేలలో కూడా ఆయన ‘సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ’ పద్ధతులను నూటికి నూరుశాతం అనుసరిస్తున్నారు.
ఈ క్రమంలోనే వెంకటేశ్వర్లు ఐదు అంచెల పంటల సాగు విధానం చేపట్టారు. ఒకే పొలంలో రకరకాల పంటలు పండిస్తున్నారు. వాటిలో పెద్దగా ఎదిగే మామిడి, తాటిచెట్లు. మధ్యస్థంగా ఉండే నిమ్మ, జామ, సపోటా, మూడో అంచెలో అరటి, బొప్పాయి, మునగ. నాలుగో అంచెలో మిరప మొక్కలు, ఐదో అంచెగా భూమి లోపల పండే పసుపును వెంకటేశ్వర్లు ఎంచుకున్నారు. వెంకటేశ్వర్లు తమ పొలాన్ని 60X60 అడుగుల సైజులో బెడ్లుగా తయారు చేశారు. ఆ బెడ్లపై పంట వ్యర్థాలను కప్పారు. నేలకు మేలు చేసే బ్యాక్టీరియా వృద్ధి చెందేందుకు దేశీ ఆవుపేడతో జీవామృతాన్ని స్వయంగా తయారు చేసి ఇచ్చారు. దీంతో తమ పొలం సాగులో మంచి ఫలితాలు వచ్చాయన్నారు.
మొదటి అంచెగా బెడ్ల మూలల్లో మామిడి మహా వృక్షాలు పెట్టారు. రెండో అంచెలో బెడ్ మూల నుంచి 30 అడుగు దూరంలో సపోటా, నిమ్మ, జామ లాంటివి వేశారు. మూడో అంచెలో అరటి, బొప్పాయి, మునగ చెట్లు పెట్టారు. నాలుగో అంచెగా బెడ్ల అంచున భూమిపైన పంట వచ్చే మిర్చి మొక్కలు వేశారు. ఐదో అంచెలో భూమి లోపల పండే పసుపును ఎంచుకున్నారు.
సుభాష్ పాలేకర్ విధానంలో సహజంగా ముందుకు వచ్చే జీవామృతంతో సేద్యం చేపట్టారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని పూర్తిగా వదిలేశారు. దేశీయ ఆవుల పేడ, గోమూత్రం, వేపపిండి, శనగపిండి, బెల్లం, పుట్టమన్నుతో ‘జీవామృతం’ తయారుచేసి పంటలకు అందిస్తున్నారు. దాంతో పాటు వ్యవసాయ వ్యర్థాలను పంటనేలపైనే కప్పి, భూమిలో తేమ ఆరిపోకుండా కాపాడుతున్నారు. దీనితో భూమిలో వానపాములు విపరీతంగా పెరుగుతాయి. పంటనేలను అవి సహజంగానే గుల్లగా చేస్తాయి. భూమిని సారవంతంగా మారుస్తాయి.
ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టిన ఏడాదిన్నర కాలంలోనే పసుపు, మిరప, అరటి, మునగ పంటలు దిగుబడులను వెంకటేశ్వర్లు అందుకున్నారు. తాను ఆశించిన దాని కంటే అధిక దిగుబడులే సాధించినట్లు చెప్పారాయన. వెంకటేశ్వర్లు సహజ పంట ఉత్పత్తుల అమ్మకాల్లో దళారుల అవసరమే రాలేదు. కొనుగోలుదారులే నేరుగా పొలానికి వచ్చి పంట తీసుకెళ్లేంతగా డిమాండ్ వచ్చింది. ఒకసారి తమ పంట ఉత్పత్తులు కొని, తీసుకెళ్లి, వినియోగించిన వారు మళ్లీ మళ్లీ కావాలని అడుగుతున్నారని వెంకటేశ్వర్లు ఆనందంగా చెప్పారు.
ప్రకృతిని నమ్మితే నష్టం ఉండదని వెంకటేశ్వర్లు కేవలం ఏడాదిన్నర కాలంలోనే నిరూపించి చూపించారు. నష్టపోతావని వెంకటేశ్వర్లును బెదిరించిన వారే ఆశ్చర్యపోయేలా అధిక లాభాలు సాధించారు. వెంకటేశ్వర్లు విజయాల గురించి తెలుసుకున్న ఇతర గ్రామాల రైతులు, వ్యవసాయ అధికారులు ఆయన క్షేత్రాన్ని ఉత్సాహంగా, ఆసక్తిగా సందర్శిస్తున్నారు. వెంకటేశ్వర్లు ఆచరిస్తున్న నీటి యాజమాన్య పద్ధతులు, చీడ పీడల నివారణ చర్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
నేలతల్లి నుంచి సహజ పంటల సాగుతో తిరుగులేని లాభాలు సాధించవచ్చని అన్నారు వెంకటేశ్వర్లు. వాటిని తిన్న వారి ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యవసాయం అంటే.. అందులోనూ సహజ సాగు అంటే భయంతో కాకుండా ఒక వ్యాపారంగా, సామాజిక బాధ్యతగా చేయాలంటారు వెంకటేశ్వర్లు. నలుగురి మాదిరిగా ఆలోచిస్తే.. వారికి వచ్చినట్లు సాధారణ జీతమే రావచ్చు. కాస్త విభిన్నంగా ఆలోచిస్తే విజయలక్ష్మి వరిస్తుంది. ‘వ్యవసాయం దండగ కాదు.. పండగ’ అని నిరూపించారు రైతు నెల్లూరి వెంకటేశ్వర్లు. భూమిని మనం సంరక్షిస్తే.. అది మనల్ని కాపాడుతుందని వెంకటేశ్వర్లు చెప్పారు.
మెగా 9 టీవీ అగ్రి సౌజన్యంతో..




















