గులాబీ రంగులో మెరిసిపోతున్న ఈ అరటి చెట్లు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.  డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఉబలంక గ్రామంలో ఈ సుందర దృశ్యం అందరినీ ఆకర్షిస్తోంది. ఉబలంక పంచాయతీ కార్యాలయ సమీపంలో నుంచి వెళ్లే బాటసారులు, గ్రామస్థులు ఒక్క క్షణం ఆగి ఆశ్చర్యంతో చూస్తున్నారు. పచ్చని ఆకుల మధ్య ముదురు గులాబీ రంగులో ఎంతగానో మురిపిస్తున్న ఈ ప్రత్యేకమైన అరటి చెట్లే కారణం. మనం ఎప్పుడూ చూసే అరటి చెట్లకు, గెలలకు ఇది పూర్తిగా భిన్నం. ఈ అందమైన అరటి చెట్ల విశేషాలు, ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం.

ఈ గులాబీ అరటి ప్రత్యేకత ఏమిటంటే.. దీని పువ్వులు గులాబీ రంగులో ఉంటాయి. శాస్త్రీయంగా దీని పేరు ‘మూసా ఆర్నాటా’ (Musa ornata). ఈ రకం అరటిని సాధారణ భాషలో ‘గులాబీ అరటి’ లేదా ‘ఆర్నమెంటల్ బనానా’ అంటారు.

సాధారణంగా మనం ఎప్పుడూ చూసే అరటి చెట్ల పువ్వులు, గెలలు చెట్టు పైనుంచి కిందకు వేలాడుతుంటాయి. కానీ గులాబీ అరటి మొక్క పువ్వులు మాత్రం ఆకాశం వైపు పైకి నిటారుగా నిలబడి పూస్తాయి. ఈ అరటి చెట్లు 5 నుండి 9 అడుగుల ఎత్తు మాత్రమే పెరుగుతాయి. వీటి ముదురు గులాబీ రంగు పూలు, చిన్నగా ఉండే పండ్లు చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. గులాబీ అరటి చెట్ల కాండం చాలా దృఢంగా ఉంటుంది. దీంతో వాయు గుండాలు, తుపానులు వచ్చినా, పెను గాలులు వీచినా చెక్కు చెదరకుండా నిలబడతాయి. నేలకు పడిపోవు.పెద్దగా స్థలం లేని చోట్ల కూడా ఈ రకం అరటి మొక్కలు పెరుగుతాయి. వీటిని టెర్రస్‌లపైన, ఇంటి వాకిట్లో కుండీలు పెట్టుకుని కూడా సులభంగా పెంచుకోవచ్చు. గులాబీ అరటి రకం చెట్లు తక్కువ నీరు ఉన్నా, మరింత తక్కువ సంరక్షణ చేసినా కూడా బాగా పెరుగుతాయి.గులాబీ అరటి ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ అరటి పండ్లలో విటమిన్ సీ, విటమిన్‌ బీ6, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్‌, పీచుపదార్థాలు అధికంగా ఉంటాయి. గులాబీ అరటి పండులో ఉండే విటమిన్‌ సీ, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలంగా చేస్తాయి. వీటిలో పొటాషియం బీపీని అదుపులో ఉంచుతుంది. గుండె సంబంధ సమస్యలను దూరం చేస్తుంది. గులాబీ అరటి పండు తొక్క, గుజ్జులో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి, ఈ పండ్లలోని పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను సరిచేస్తుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.ఊబలంక గ్రామ పంచాయతీ ఆవరణలో పర్యావరణ అందాన్ని, కొత్తదనాన్ని తేవాలనే ఉద్దేశంతో ధనరాజు కొవ్వూరు నుంచి ఈ మొక్కలను తీసుకొచ్చి ప్రత్యేక శ్రద్ధతో పెంచుతున్నారు. ఒకే ఒక్క గులాబీ అరటి మొక్క మొత్తం కాంపౌండ్‌కే సరికొత్త రూపునిచ్చింది. గ్రామాల్లో ఇలాంటి అలంకారిక, పర్యావరణానికి మేలు చేసే మొక్కలను పెంచితే ఊరి అందం రెట్టింపు అవుతుంది. చూసేవారి మనసుకు ఎంతో ఆహ్లాదం ఇస్తాయనడంలో సందేహం ఉండదు.