మన దేశంలోని సగానికి పైగా ప్రాంతాలు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ నీటితోనే వ్యవసాయం చేసేందుకు మహారాష్ట్రలోని బీడు ప్రాంతం రైతు పరమేశ్వర్ తోరట్ ఎంచుకున్న నాలుగు మార్గాల గురించి తెలుసుకుందాం. పరిమితమైన నీటితో పంటల సాగుకు బిందు సేద్యం, పంటల ఎంపిక తనకు ఏ విధంగా సహాయపడ్డాయో పరమేశ్వర్ తోరట్ వివరించారు.
నైరుతి రుతుపవనాలు తగ్గిపోవడం మొదలవడంతో దేశంలోని పలు ప్రాంతాల రైతులు చాలా కాలం పాటు వర్షాలు లేని, నేలలో తేమ తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ‘డౌన్ టు ఎర్త్’ నివేదిక ప్రకారం ఐఐటీ గాంధీనగర్‌కు చెందిన ‘ఇండియా డ్రాట్ మానిటర్’ తాజా అంచనా ఇలా ఉంది. 2026 సెప్టెంబర్ 16 నాటికి దేశంలోని సగం కంటే ఎక్కువ ప్రాంతం పొడిబారింది. లేదా కరువు పరిస్థితులైనా ఎదుర్కొంటోంది. ఇలాంటి ప్రాంతం సుమారు నెల రోజుల క్రితం 38.9 శాతం నుండి 52.5 శాతానికి పెరిగింది. ఇలా నిత్యం కరువు ఒత్తిడితో ఉంటున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర ఒకటి. జూన్ 1 నుండి సెప్టెంబర్ 20 మధ్య మరాఠ్వాడాలో 36 శాతం లోటు వర్షపాతం నమోదైంది.
ఈ పరిస్థితుల్లో రైతులకు కీలకమైన సమయంలో ఆందోళనగా మారింది. అనేక ప్రాంతాలలో ఖరీఫ్ పంటలు కోతకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో నేల, జలాశయాలలో మిగిలి ఉన్న కొద్దిపాటి నీరు తరువాతి పంట కాలాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కొన్ని ఇతర రాష్ట్రాలలో వర్షాకాలంలో రెండు నుండి మూడు వారాలు పొడి వాతావరణం నమోదైంది. మహారాష్ట్ర బీడ్ ప్రాంతంలో ఎంతో కాలంగా పొడిబారిన పరిస్థితులు, నీటి కొరత వ్యవసాయాన్ని కష్టంగా మార్చాయి. ఈ నేపథ్యంలోనే రైతు పరమేశ్వర్ తోరట్ పరిమితమైన నీటితో సాగు చేయడం ప్రారంభించారు.
తన పొలంలో నీటిని అవసరమైన చోటికి మళ్లించారు. వర్షాలు రాని కాలంలో వర్షపు నీటిని నిల్వ చేస్తారు. తన ఎకరం 75 సెంట్ల భూమిని విత్తనాలు నాటేందుకు ముందుగా సిద్ధం చేయడం ద్వారా అవకాడో సాగు చేశారు. అర్కా సుప్రీమ్ రకం అవకాడోతో ఆయన 2018 నుంచి ప్రయోగాలు మొదలుపెట్టారు. తర్వాత ఆ పంట గురించి మరింత బాగా అర్థం చేసుకునేంఉకు ఐసీఏఆర్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్‌కు వెళ్లారు. నీటి కొరత వచ్చినప్పుడు పంటలను రక్షించుకోవాలనుకునే రైతులకు పరమేశ్వర్ తోరట్ అనుభవం కొన్ని ఆచరించదగిన పాఠాలు నేర్పుతోంది.
మొక్కల వేర్ల వద్ద నీటి ఆదా:
పరమేశ్వర్ థోరట్ చేపట్టిన తొలి చర్యలలో ఒకటి ‘బిందు సేద్యం’. అంటే మొక్కల వేర్ల వద్దే నీటిని అందించడం. మొత్తం పొలంలో నీరు పారించడానికి బదులు బిందు సేద్యంతో నీటిని నేరుగా మొక్కలకు అందిస్తారు. బిందు సేద్యం వల్ల నీటి వృథా తగ్గుతుంది. నీరు మొక్కల వేర్ల వద్దే పడుతుంది. బిందు సేద్యంలో నీరు, ఇతర పోషకాలు నేరుగా వేర్లకు చేరవేస్తుంది. వృథాను తగ్గిస్తుందని తోరట్ చెప్పారు. నీటి కొరత ఎదుర్కొంటున్న రైతులు పొలం అంతా భారీగా నీరు పారించే పద్ధతికి స్వస్తి చెప్పొచ్చు. నిర్దిష్ట ప్రాంతాలకే నీరుం అదించేందుకు బిందు సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషన్ విధానం అనుకూలంగా ఉంటుంది.
ప్రతి నీటిచుక్కనూ పట్టుకోవడం:
రైతు తోరట్ తన పొలంలోని చెరువును వర్షపునీటి ప్రవాహాన్ని ఒడిసి పట్టేందుకు కూడా ఉపయోగించారు. వర్షాకాలంలో చెరువులోకి వచ్చిన నీటిని నిల్వ చేసి, తర్వాత వేసవి కాలంలో వాడుకుంటారు. దీనివల్ల వర్షాలు లేనప్పుడు భూగర్భజలంపై ఆధారపడాల్సిన అవసరం అంతగా ఉండదు. వర్షాకాలంలో వీలైనంత ఎక్కువ వర్షపు నీటిని చెరువులో నిల్వ చేస్తామని తోరట్ చెప్పారు. ఆ నీటిని వేసవి కాలంలో పైర్లకు వాడతామని తెలిపారు. దీంతో వ్యవసాయ క్షేత్రంలో తేమ నిలకడగా ఉంచేందుకు తోడ్పడుతుంది. ఈ పద్ధతి వర్షాలు తక్కువ కురిసే ప్రాంతాల పొలాలకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. వర్షపు నీటిని పొలం నుండి వృథాగా బయటికి పోనివ్వకుండా ఈ పద్ధతిలో సాధ్యం అవుతుంది. నీటిని నిల్వ చేయడం ద్వారా తర్వాత వచ్చే వేసవిలో వాడుకోవడానికి నీటి నిధి అవుతుంది.
నేలను సిద్ధం చేయడం:
పొలంలో అవకాడో మొక్కలు నాటేందుకు ముందుగా రైతు తోరట్ తన రెండు అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పు గల గుంతలు తవ్వి నేలను సిద్ధం చేశారు. మొక్కలు నాటే ముందే ఆ గుంతలను ఆవుపేడ ఎరువుతో నింపారు. మొక్కలకు అవసరమైన పోషకాలు అందించేందుకు నేలను సారవంతం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. బీడ్ ప్రాంతంలోని ఛాలెంజింగ్ పరిస్థితుల్లో మొక్కలు నాటేందుకు తోరట్ చేసిన ప్రయత్నంలో నేల తయారీ కూడా ఒక భాగం. మొదట్లో తోరట్ ఉపయోగించిన రసాయన ఎరువులు, పురుగు మందుల స్థానంలో ఆవు పేడ ఎరువు, సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించారు. తర్వాత సేంద్రియ వ్యవసాయం ప్రారంభించారు.
సరైన పంట ఎంపిక:
ఏ పంట పండించాలనే ఆలోచనతోనే తోరత్కు కరువు నిర్వహణ మొదలుపెట్టాడు. పొలంలో వెనువెంటనే అవకాడో మొక్కలు నాటలేదు. బెంగళూరు పర్యటనలో అర్కా సుప్రీమ్ రకం గురించి పరిశీలించాడు. తర్వాత.. మహారాష్ట్ర వాతావరణానికి అర్కా సుప్రీమ్ అనుకూలతపై పరిశోధన చేశాడు. అర్కా సుప్రీమ్ అవకాడో సాగు గురించి తెలుసుకోవడానికి ICAR-IIHRను సందర్శిచారు. ఆర్కా సుప్రీమ్ రకం 40 నుండి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను తట్టుకోగలదు. బీడ్‌లోని వేడి పరిస్థితులకు ఇది అనువైనదని తోరట్ భావించారు. తర్వాత కర్ణాటక నుండి 50 మొక్కలు తెప్పించారు. మారుతున్న వర్షపాతం తీరు రైతులకు తోరట్ అనుభవం మరో ముఖ్యమైన విషయం చెబుతోంది. పంట పండించే ప్రాంతంలోని పరిస్థితులను గమనించుకొని ఏది సాగు చేయాలో ఎంచుకోవాలి.
తక్కువ నీటితో వ్యవసాయం:
నీటి కొరత ఉన్న ప్రాంతంలో అవకాడో రైతు అనుసరించిన వ్యవసాయ పద్ధతి ఒకే ఒక్క పరిష్కారంపై ఆధారపడలేదు. తోరట్ పొలంలో బిందు సేద్యం, వర్షపు నీటి నిల్వ, నేల తయారీ వంటి పద్ధతులను కలిపారు. పొలంలో నీరు ఎప్పుడూ సమృద్ధిగా ఉంటుందని అనుకోలేదు. అందుబాటులో ఉన్న నీటితోనే ఒక వ్యవసాయ వ్యవస్థ రూపొందించుకున్నారు. వర్షాకాలం చివరి దశలోకి ప్రవేశిస్తున్న రైతులకు తోరట్ అనుభవం చక్కని పాఠం చెబుతుంది. వర్షపాతంలో అనిశ్చితి ఏర్పడిప్పుడు అందుబాటులో ఉన్న ప్రతి నీటిచుక్కను జాగ్రత్తగా ఉపయోగించడం, నీరు వచ్చినప్పుడు నిల్వ చేయడం, స్థానిక పరిస్థితులకు అనువైన సాగు పద్ధతుల ఎంపిక ద్వారా పంటలను కాపాడుకోవచ్చు.
అనుకూల పరిస్థితులు లేనప్పుడు వ్యవసాయం చేయడం అంత సులభం కాకపోవచ్చు. సాగులో సవాళ్లు ఎప్పుడూ ఉంటాయి. అయితే.. పట్టుదల, నేర్చుకోవాలనే తపన ఉన్న రైతు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవచ్చు. ఏ ఇబ్బందినైనా అధిగమించవచ్చు.




















