ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. కేవలం ప్రజల భాగస్వామ్యంతో 21 ఎండిపోయిన చెరువులకు ప్రాణం పోశారు. మహారాష్ట్రలోని భండారా ప్రాంతంలో ఒక నిజాయితీ గల ప్రభుత్వ ఇంజనీర్ శిరీష్ ఆప్టే అద్భుతం సృష్టించారు. ఆయన ఒకే ఒక్క ఆలోచన 50కి పైగా గ్రామాలలోని అన్నదాతల తలరాతను మార్చేసింది. ఎండిపోయిన భూములను పచ్చని పంట క్షేత్రాలుగా నిలబెట్టింది.
ప్రజల భాగస్వామ్యంతో జల విప్లవం:
ప్రభుత్వ నిధులు లేవు. భారీ యంత్రాలు కూడా అందుబాటులో లేవు, అయినప్పటికీ దృఢ సంకల్పం, ప్రజల భాగస్వామ్యంతో అసాధ్యాలను సుసాధ్యాలు చేయొచ్చు. మహారాష్ట్రలోని భండారా జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శిరీష్ ఆప్టే దీన్నే నిరూపించారు. 2008వ సంవత్సరంలో ఈ పీడబ్ల్యుడీ ఇంజనీర్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టే నాటికి భండారా ప్రాంతం తీవ్ర కరువు కోరల్లో చిక్కుకుని ఉంది. తాగడానికి గుక్కెడు నీరు దొరకేది కాదు. దాహంతో ప్రజలు అల్లాడిపోయేవారు. పంటలు ఎండిపోయి, అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడే విషాదకర పరిస్థితులు ఉండేవి. భండారా ప్రాంతంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న సమయం. ఎండిపోయిన జలవనరుల పునరుద్ధరణకు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఈ మేరకు అధికారులు నివేదికలు సిద్ధం చేసి, తర్వాత చేతులు దులిపేసుకున్నారు.
కానీ.. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యే వరకు వేచి చూస్తే భండారా ప్రాంతం పూర్తిగా ఎడారిగా మారిపోతుందని గ్రహించారు ఇంజనీర్ శిరీష్ ఆప్టే. ప్రభుత్వ ఖజానా నుండి ఒక్క రూపాయి కూడా ఆయన ఆశించలేదు. సరికొత్తగా పాత కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. సుమారు మూడు వందల ఏళ్ల క్రితం గోండు రాజుల కాలంలో నిర్మించిన ‘మాల్గుజారీ చెరువుల’ వ్యవస్థను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. కొండల వాలు ప్రాంతాల్లో ఒక చెరువు నిండితే మరో చెరువులోకి నీరు వెళ్లేలా కాలువలు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఉండేది. ఈ అద్భుతమైన పురాతన సాంకేతిక గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ కాలక్రమేణా పూడిక పేరుకుపోయి నిరుపయోగంగా మారింది.
సాగుకు, చేపలకు ప్రధాన వనరు:
ఈ గొలుసుకట్టు చెరువులు ఆ కాలంలో తూర్పు విదర్భ ప్రాంతంలో వరి, చెరకు పంటల సాగుకు, మత్స్య సంపదకు ప్రధాన నీటి వనరుగా ఉండేవి. ఆ రోజుల్లో స్థానిక జమీందార్లు అంటే మాల్గుజార్లు, కోహ్లీ సామాజిక వర్గం రైతులు వీటిని నిర్మించారు. రైతులకు నీటిని సమానంగా పంపిణీ చేసేందుకు ‘ఫంకర్’ అనే ప్రతినిధిని ప్రత్యేకంగా నియమించారు. 1950లలో జమీందారీ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం ఈ గొలుసుకట్టు చెరువులకు ఆదరణ తగ్గిపోయింది. దీంతో మాల్గుజారీ చెరువుల వ్యవస్థకు గ్రహణం పట్టింది.
మాల్గుజారీ చెరువుల అడుగు భాగంలో పేరుకుపోయిన నల్లమట్టి వందల ఏళ్ల నాటి వృక్ష అవశేషాలతో కూడిన ఎంతో సారవంతమైన సేంద్రియ ఎరువుగా మారిందని ఇంజనీర్ శిరీష్ ఆప్టే గుర్తించారు. ఈ విషయం రైతులకు అర్థం అయ్యేలా చెప్పారు. ఆ చెరువులలోని మట్టిని వారి వారి పొలాలకు తరలించుకోవాలని పిలుపునిచ్చారు. దీనితో రైతుల భూములకు ఉచితంగా బలమైన ఎరువు లభిస్తుందన్నారు. దీంతో పాటు మాల్గుజారీ చెరువుల చెరువుల లోతు పెరుగుతుందని ఇంజనీర్ శిరీష్ ఆప్టే చేసిన ఆలోచన అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది.
శిరీష్ యత్నానికి ఆటంకాలు:
అయితే.. శిరీష్ ఆప్టే ప్రయత్నానికి మొదట్లో షరా మామూలుగానే పై అధికారుల నుంచి బెదిరింపులు వచ్చాయి. రైతుల్లో అపనమ్మకం ఏర్పడింది. అయినా ఆప్టే వెనకడుగు వేయలేదు. స్వయంగా పార పట్టి, మాల్గుజారీ చెరువులో మట్టి తవ్వడం ప్రారంభించారు. ఆయన ప్రయత్నాన్ని చూసిన గ్రామస్థులంతా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లతో చెరువులలోని వేలాది టన్నుల పూడికను తరలించారు. దీంతో జనోగా చెరువుతో పాటు మొత్తం 21 పురాతన సరస్సులు మళ్ళీ జలకళతో ప్రాణం పోసుకున్నాయి. భండారా ప్రాంతంలో కురిసిన తొలి వర్షానికే చెరువుల్లో జల విప్లవం కనిపించింది.
ఇంజనీర్ శిరీష్ ఆప్టే కృషి కారణంగా 800 అడుగుల లోతుకు పడిపోయిన భూగర్భ జలాలు కేవలం రెండేళ్లలోనే 10 అడుగుల పై వరకు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడ బోరు వేసినా, ఎక్కడ నుయ్యి తవ్వినా నీరు సమృద్ధిగా లభించేది. పంటల దిగుబడి 40 శాతం పెరిగింది. ఏడాదికి మూడు పంటలు పండే స్థాయికి ఆ ప్రాంతం చేరుకుంది. తమ సొంత ప్రాంతంలోనే పంటలు, పనులు ఉండడంతో ప్రజల వలసలు పూర్తిగా ఆగిపోయాయి.
నిజాయితీ, సేవా దృక్పథం ఉన్న ఒక అధికారి తలచుకుంటే ప్రజల శక్తితో ఎలాంటి అద్భుతాలైనా సృష్టించవచ్చని ఇంజనీర్ శిరీష్ ఆప్టే నిరూపించారు. నీతి ఆయోగ్ నుంచి ఈ నమూనా దేశానికే ఆదర్శం అని ప్రశంసలు అందుకుంది. ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ నానుడికి ఇంజనీర్ శిరీష్ ఆప్తే సజీవ నిదర్శనంగా నిలిచారు.




















