ఎల్నినో ప్రభావం కారణంగా దేశంలో ఇంతవరకు సరైన వర్షపాతం నమోదు కాలేదు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో వరుస తుఫాన్లతో కొద్దిగా భూగర్భ జలాలు పెరిగినట్లు చెబుతున్నారు. తెలంగాణ లాంటి మరికొన్ని రాష్ట్రాల్లో సరైన వర్షాలు లేక భూగర్భ జలాలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. దీంతో బోర్లు కూడా వట్టిపోతున్నాయి. అనేక నగరాలు, పట్టణాలలో నివాసం ఉండే పలువురు తాగునీరు, నిత్యావసరానికి కావాల్సిన నీటి కోసం ఇక్కట్లు పడుతున్నారు. ముందు ముందు ఈ ఇబ్బంది మరింత పెరిగిపోయే ప్రమాదం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. తాగునీటికే కష్టంగా ఉన్న ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పంటల సాగు కోసం నీరు ఎక్కడి నుంచి లభిస్తుంది? అందుకే రైతులు నీటి ఎద్దడి సమస్యను తట్టుకునేందుకు కొన్ని కీలకమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
ప్రకృతి మనకు అందించిన అమూల్యమైన వరం వర్షం. కానీ.. కొన్ని సంవత్సరాలుగా వర్షాకాలంలో భారీగా కురిసే వర్షపు నీరు అంతటినీ ఒడిసిపట్టలేకపోవడంతో ఆ నీరు చాలావరకు వృథాగా డ్రైనేజీల్లోకి, సముద్రంలోకి పోతోంది. వ్యవసాయ క్షేత్రాలను చదును చేయడం కోసం అనేక మంది రైతులు చెట్లు, కంపచెట్లను పూర్తిగా తీసేశారు. దీంతో వర్షపునీరు భూమిలో ఇంకడం లేదు. ఆ నీరు నేరుగా బయటికి కొట్టుకుపోతోంది. దీనితో భూగర్భ జలాలు తగ్గిపోయి, వేసవికాలం రాక ముందే పొలాల్లోని బోర్లు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది.
సాగునీటి కష్టాలు తీరేందుకు రైతులు తమ పొలాల్లో చిన్నచిన్న కందకాలు తవ్వుకుని, వర్షపునీటిని ఒడిసిపట్టుకోవాలి. ఆ నీటిని నిల్వ చేసుకుని పంటలు, మొక్కలకు సక్రమంగా అందిస్తే.. పంట దిగుబడులకు ఢోకా ఉండదు. పొలాల్లో, పొలాల చుట్టూరా కందకాలు తవ్వుకొని, నీరు నిల్వ చేయడం వల్ల ఆ పరిసరాల్లో భూగర్భ జలమట్టాలు పెరుగుతాయి.
అనావృష్టి కారణంగా భూగర్భ జలాలు తగ్గిపోయి రైతులు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. నీరు కోసం రైతుల బోర్ల మీద బోర్లు వేసి నష్టాల పాలవుతున్నారు. కానీ.. రైతు లోకసాని పద్మారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో జలకళ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కందకాలు ఏర్పాటు చేయడం ద్వారా పద్మారెడ్డి తమ క్షేత్రంలో వేసిన పంటలకు సాగునీటి కష్టాలు లేకుండా చేయగలిగారు. ఎల్నినో ప్రభావంపై ఆయన కందకాలతో ‘జల విజయం’ సాధించారు. పద్మారెడ్డి పొలంలో, చుట్టుపక్కల కురిసిన వర్షంలో చుక్కనీరు కూడా బయటకి వెళ్లిపోకుండా కందకాలతో ఒడిసిపట్టారు. పదేళ్ల క్రితం తాము తవ్విన కందకాలే తమ పంటలకు ‘జలరక్ష’గా మారాయన్నారు.
కందకాలు ఎలా నిర్మించాలంటే.. పొలంలో ఏటవాలుగా ఉన్న ప్రదేశాల్లో సుమారు నాలుగు అడుగుల వెడల్పుతో కందకాలు తవ్వుకోవాలి. ఆ కందకాల్లో కొబ్బరి ఆకులు, చెత్తా చెదారం వేస్తే అవి మంచి సేంద్రీయ ఎరువుగా మారతాయి. వర్షపునీరు కందకాల్లో నిలబడి, భూమిలోకి ఇంకి, బోర్లు ఎండిపోకుండా కాపాడతాయి. భూమి నుంచి బోర్ల ద్వారా తోడే నీటిని కూడా నేరుగా పంటలకు వదలకూడదు. పొలంలో నీటిసంపు లేదా ఫాంపాండ్ నిర్మించి, దానిలో నీరు నిల్వ చేస్తే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది. సంపుల్లోని నీటిని మోటార్లు లేదా డ్రిప్ ద్వారా లేదా కాలువల ద్వారా పంటలకు అందించవచ్చు. దీనితో కరెంట్ కోతలు ఉన్న సమయంలో కూడా పంటలకు నీటి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉండదు. సాగునీటి కోసం ప్రభుత్వాల మీదో, వర్షాల మీదో ఆధారపడే కంటే రైతులందరూ తమ పొలంలో పడే ప్రతి వర్షపునీటి చుక్కను నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తే.. పంటలకు నీటి కష్టాలు తొలగించుకోవచ్చు.
భూగర్భ జలాలు అడుగంటినప్పుడు సాధారణంగా పాత బోర్లు ఎండిపోతాయి. దీనికి కొత్త బోర్లు వేయడం పరిష్కారం కాదు. బోర్లకు నీరు అందనప్పుడు మరింత లోతుకు వేయడమూ సరికాదు. కొత్త బోర్లు అనవసరంగా వేసి, అప్పులపాలయ్యే కంటే, ఉన్న నీటిని భద్రపరుచుకునేందుకు కందకాలు తవ్వితే ఉపయోగం అవుతుంది. తద్వారా రైతులు ఆర్థికంగానూ నిలదొక్కుకోవచ్చు. కొన్ని చోట్ల రైతులు ఎండిపోతున్న తమ పంటలకు ట్యాంకర్లతో నీరు తీసుకొచ్చి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం మంచిదే అయినా.. రైతుకు మరింత ఆర్థిక భారం అవుతుంది. వర్షపు నీటిని సంరక్షించుకుంటేనే తమ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని అన్నదాతలు గ్రహించాలి.
పొలం చుట్టూ కందకాలు, పంట కుంటలతో ఉన్న బోర్లను రీఛార్జి చేయడమే సరైన పరిష్కారం అంటారు లోకసాని పద్మారెడ్డి. తమ క్షేత్రంలోని కందకాలే దీనికి చక్కని నిదర్శనం అని చెప్పారు. తమకు ఉన్న అతిపెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని కేవలం మూడు బోర్లతో పచ్చదనంతో ఉండేలా చేశామన్నారు. అందుకు కందకాల్లో నిల్వ ఉన్న నీరు కారణం అని చెప్పారు. భవిష్యత్తులో వ్యవసాయంపై ఆధారపడే కుటుంబాలు నిలదొక్కుకోవాలంటే ప్రతి రైతు పొలంలో కందకాలు తవ్వుకోవాలని సూచించారు. రైతులకు ఈ విషయం అర్థమైనా ఆచరించేందుకు ఎందుకో వెనుక ముందు అవుతుండడం గమనార్హం. ఎల్నినో కారణంగా నీరు దొరకని పరిస్థితులు రావడంతో రైతుల్తో ఆలోచనా ధోరణి మారే అవసరం తొందరలోనే రావచ్చు. ఆలోచన మారితే ఎల్నినో కష్టాల సమయంలోనే కాకుండా అనావృష్టి ఏర్పడ్డ ప్రతి సందర్భంలోనూ కందకాలు పంటలను, రైతులను కాపాడతాయి.




















