ప్రపంచం మొత్తంలో అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం కుంకుమపువ్వు. రెడ్ గోల్డ్‌గా పిలుచుకునే కుంకుమపువ్వు క్రోకస్ సటైవస్ పువ్వుల రేకల నుంచి సేకరిస్తారు. కుంకుమపువ్వును అత్యధికంగా పండించే దేశాల్లో ఇరాన్‌ది అగ్రస్థానం. మన జమ్మూ కాశ్మీర్‌లోని పాంపోర్‌లో పండే కుంకుమపువ్వుకు అత్యంత నాణ్యమైనదని ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. కుంకుమపువ్వును రంగు, పొడవు ఆధారంగా (1) మోంగ్రా, (2) లాచా, (3) జర్దా రకాలుగా వర్గీకరించారు. వీటిలో మోంగ్రా రకానికి అత్యధిక ధర పలుకుతుంది. భారతదేశం మొత్తం కుంకుమపువ్వు ఉత్పత్తిలో సుమారు 90 శాతం పాంపోర్‌లోనే పండుతోంది.
కుంకుమపువ్వులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. కుంకుమపువ్వును తీసుకున్నవారికి జ్ఞాపకశక్తి పెంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. గర్భిణుల జీర్ణక్రియను మెరుపరుస్తుంది. రక్తపోటు నియంత్రణకు, వారిని మానసికంగా ప్రశాంతంగా ఉంచేందుకు కుంకుమపువ్వు పనిచేస్తుంది. దీనిని గర్భిణులకు పాలలో కలిపి తాగిస్తారు. బిర్యానీలు, పాయసం, లడ్డూల తయారీలో వాడతారు. మిఠాయిల్లో మంచి రంగు, చక్కని సువాసన వచ్చేందుకు వినియోగిస్తారు. చర్మాన్ని కాంతివంతం చేయడానికి, ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు తగ్గించే ఫేస్ క్రీములు, సబ్బులు, బాడీ లోషన్ల తయారీలో కుంకుమపువ్వు వాడతారు. నాణ్యమైన కిలో కుంకుమపువ్వు ధర మార్కెట్లో లక్షన్నర రూపాయల నుంచి రూ. 3 లక్షల వరకు పలుకుతుంది. తక్కువ స్థలంలో ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. కుంకుమపువ్వుకు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ స్థిరమైన డిమాండ్ ఉంటుంది.
కుంకుమపువ్వును జమ్ము కాశ్మీర్‌లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లోనూ పలువురు పండిస్తున్నారు. పట్టణాలు, నగరాలు, మెట్రోపాలిటన్ నగరాల్లో కూడా ఔత్సాహిక రైతులు, ఉద్యోగులు, గృహిణులు ఇళ్లలోనే దీన్ని సాగు చేసి, లాభాలు ఆర్జిస్తున్నారు.
కేంద్ర పాలిత ప్రాంతం లడాలోని ఎత్తైన ప్రాంతాల్లో కుంకుమపువ్వు పండుతుందా? అనే ప్రశ్నకు జవాబు దొరికింది. నాలుగు వేల చదరపు మీటర్ల భూమిలో చేపట్టిన ప్రయోగం దీనికి మంచి సమాధానం ఇచ్చింది. అక్కడ నాటిన 90 వేల దుంపల నుంచి మొలిచిన మొక్కలు 30 రోజుల్లోపే తొలిసారి పూత పూయడం ప్రారంభమైంది. తొలి దశలోనే 22 గ్రాముల దిగుబడి కూడా వచ్చింది. లడాఖ్‌లోని లేహ్ వంటి అత్యంత శీతల, ఎత్తైన ప్రాంతంలో ఒకప్పుడు పంటలు వేయకుండా వదిలిపెట్టిన నిస్సారమైన భూమిలో ఇప్పుడు కుంకుమపువ్వు పండుతోంది. వ్యవసాయానికి ఎంతో కఠిన పరిస్థితులు ఉండే ఇలాంటి ప్రాంతంలో కుంకుమపువ్వు పంట రావడం వ్యవసాయ రంగంలో కొత్త ఆశలు కల్పిస్తోంది.
లడాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ప్రారంభించిన ప్రయోగాత్మక కార్యక్రమం ‘ప్రాజెక్ట్ హిమ్ సరోవర్’ కింద బంజరు భూముల్లో తొలి పూలు పూశాయి. ఈ ప్రయోగంలో కుంకుమపువ్వు పువ్వులు అనుకున్న సమయం కన్నా ముందే పూయడం విశేషం. సాధారణ పరిస్థితుల్లో కుంకుమపువ్వు దుంపలు నాటిన తర్వాత పువ్వులు పూసేందుకు సుమారు రెండు నెలల సమయం పడుతుంది. కానీ లేహ్‌లో పువ్వులు దానిలో సగం కన్నా తక్కువ సమయంలోనే పూయడం గమనార్హం. దీంతో రైతులు, స్థానిక పారిశ్రామికవేత్తలు, యువతకు అదనపు ఆదాయ వనరులు సృష్టించే అవకాశం కలిగింది.
లడాఖ్‌లో బీడు భూమిని కుంకుమపువ్వు సాగు క్షేత్రంగా మార్చే ప్రయోగం 1 అక్టోబర్ 2026న మొదలైంది. ఆ రోజున లేహ్‌లోని 4 వేల చదరపు మీటర్ల భూమిలో 800 కిలోల (90 వేలు) అత్యుత్తమ నాణ్యమైన ఇరానియన్ కుంకుమపువ్వు దుంపలు (విత్తనాలు) నాటారు. భూమి లోపలే ఉండే ఈ దుంపలు కుంకుమపువ్వు మొక్కలు పెరిగి, పువ్వులు పూసేందుకు తోడ్పడతాయి
గతంలో ఆ భూమి సారం లేకుండా, సాగుకు పనికిరాకుండా ఉండేది. దానిని ‘ప్రాజెక్ట్ హిమ్ సరోవర్’ కింద పునరుద్ధరించారు. లడాఖ్‌లోని ఎత్తైన పర్వత ప్రాంత పరిస్థితులలో ఈ పంట పెరుగుతుందో లేదో చూసేందుకు కుంకుమపువ్వు సాగు ప్రారంభించారు. ఈ ప్రయోగంలో బీడుగా ఉన్న ఆ భూమిలో కొన్ని వారాల్లోనే జీవకళ రావటం ప్రారంభమైంది.
కుంకుమపువ్వు దుంపలు నాటిన తర్వాత పూత పూసేందుకు దాదాపు రెండు నెలలు పడుతుంది. కానీ లేహ్‌లో 30 రోజులలోపే తొలిసారి పువ్వులు పూయడం అందరినీ ఆశ్చపరిచింది. క్షేత్రంలో ప్రతిరోజూ సగటున 20 నుండి 25 పువ్వులు వికసిస్తున్నాయి. పూత మొదలైన నాలుగు రోజుల్లోనే సుమారు 22 గ్రాముల స్వచ్ఛమైన కుంకుమపువ్వు దిగుబడి వచ్చింది. ఈ దిగుబడి చాలా తక్కువే అయినప్పటికీ అంతకు ముందు సాగుకు పనికిరాదు అనుకున్న భూమిలో చేపట్టిన ఈ ప్రయోగానికి ఇది ఒక ఆశాజనకమైన ఆరంభం అనే చెప్పాలి. లడాఖ్ పరిస్థితుల్లో కుంకుమపువ్వు మొక్కలు ఎలా పెరుగుతున్నాయి? ఈ ప్రారంభంలో పుష్పించే దశ తర్వాత కూడా ఇలాంటి ఫలితాలు కొనసాగుతాయా? అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
లడాఖ్‌లో కుంకుమపువ్వు సాగు ప్రాజెక్ట్ ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. తొలి పూలు పూయడం ఒక సానుకూల సంకేతం. కానీ ఈ పంటను వాణిజ్య స్థాయిలో నిలకడగా, లాభదాయకంగా పండించవచ్చో లేదో నిర్ధారించుకోవడానికి మరిన్ని ప్రయోగాలు అవసరం అవుతాయి అంటున్నారు పరిశోధకులు. ఈ ప్రయోగం విజయవంతం కావడానికి కృషి చేసిన లడాఖ్ వ్యవసాయ శాఖకు, ప్రాజెక్టులో పాలుపంచుకున్న క్షేత్రస్థాయి సిబ్బందికి లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా నుంచి అభినందనలు లభించాయి. నవంబర్ 1న సక్సేనా ఈ ప్రయోగాత్మక క్షేత్రాన్ని సందర్శించినప్పుడు పూసిన మొదటి పువ్వులను స్వయంగా చూశారు. సక్సేనా సందర్శించిన రోజు ఉదయానికి కుంకుమపువ్వుల సంఖ్య 72కి చేరింది. నిజానికి లడాఖ్‌లో కుంకుమపువ్వు సాగుపై ప్రభుత్వం ప్రయోగాలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో లేహ్‌లో లిలియం, గ్లాడియోలస్తో భారీస్థాయిలో ప్రయోగాలు చేపట్టింది.




















