రసాయన ఎరువులతో పండించిన పంటలు తిని తిని శరీరాన్ని రోగాలపుట్టగా మార్చుకుంటున్న వారి సంఖ్య ఈ రోజుల్లో ఎక్కువనే చెప్పాలి. ఆరోగ్యం పట్ల పలువురిలో ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. సహజసిద్ధ పంటల ఆహారం వైపు అనేక మంది అడుగులు వేస్తున్నారు. వైద్యులు,  ఆహార నిపుణులు అంతా రకరకాల గింజలు, విత్తనాలను ఆహారంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. డాక్టర్లు, నిపుణులు చెబుతున్న ఎన్నో ప్రయోజనాలు కలిగించే గింజల్లో చియా సీడ్స్‌ ఒకటి. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చియా సీడ్స్‌ను వైద్యులు, నిపుణులు సూచిస్తుండడంతో వినియోగించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

చియా సీడ్స్‌లో లభించే పీచుపదార్థం, ప్రొటీన్‌, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న అత్యంత శక్తవంతమైన ఫుడ్ చియా సీడ్స్‌ అని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని ఫైబర్‌ బరువు తగ్గించడానికి పనిచేస్తుంది. చియా సీడ్స్‌ నానబెట్టినప్పుడు తయారయ్యే జెల్‌ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. బ్లడ్‌షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడంలో చియా సీడ్స్‌ బాగా పనిచేస్తాయి. చియా సీడ్స్‌ను నీటిలో నానబెట్టి గానీ సలాడ్‌లలో కలిపి తీసుకుంటే ప్రయోజనాలు అధికంగా ఉంటాయంటున్నారు. చియా సీడ్స్‌ నుంచి మంచి ఫలితాలు రావాలంటే.. ఒక టీ స్పూన్‌ చియా సీడ్స్‌ను గ్లాసు నీటిలో ఉదయం పది నుంచి 15 నిమిషాలు నానబెట్టి ఖాళీ పరగడుపునే తాగితే ఉత్తమ ఫలితాలు ఇస్తాయి. అయితే.. రోజుకు ఒకటి లేదా రెండు టీ స్పూన్ల కంటే ఎక్కువ తీసుకోకూడదన నిపుణుల సూచన.కర్ణాటకలోని బీదర్‌ వ్యాపారి రైతుల వద్దకే వచ్చి కిలో రూ.120 నుంచి రూ. 135కు కొని తీసుకెళ్తున్నారని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం రంజోల్ గ్రామంలోని యువరైతు రమేష్‌రెడ్డి తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కొందరు రైతులు ఇప్పటికే చియాసీడ్స్‌ సాగుచేస్తున్నారు. జహీరాబాద్‌లోని అగ్రికల్చర్ ఆఫీసర్‌ ప్రదీప్‌ సలహా మేరకు తాను చియాసీడ్స్ సాగుచేస్తున్నట్లు చెప్పారు. అందరూ వేసే పంటల కంటే కాస్త భిన్నమైన పంటలు వేస్తే డిమాండ్ ఉంటుందని తాను ఆలోచించానన్నారు. రమేష్‌రెడ్డి రెండున్నర ఎకరాల్లో చియాసీడ్స్ సాగు చేస్తున్నారు. ఇది 120 నుంచి 130 రోజుల పంట. చియాసీడ్స్ పంట చలికాలంలో వేసుకుంటే నాలుగు నెలల్లోనే ఆదాయం చేతికి వస్తుంది. చలికాలపు పంట అయిన చియాసీడ్స్‌ను సాగులో ఎక్కువ పెట్టుబడి పెట్టలేని వారు కూడా వేసుకోవచ్చు.భూమిని దుక్కి దున్ని, నాలుగు రోజులు ఆరనిస్తే.. ఎండకు భూమిలో ఫంగస్‌, చెడు బ్యాక్టీరియా, పురుగులు చనిపోతాయి. తర్వాత భూమిలో ఎరువు వేసుకోవాలని చెప్పారు రమేష్‌రెడ్డి. తర్వాత రోటావేటర్‌తో నాలుగు అడుగుల వెడల్పుతో బెడ్లు తయారుచేయాలి. బెడ్లపై అరక దున్ని, సాళ్లు వేసుకొని, ఆ సాళ్లలో చియా విత్తనాలు చల్లాలి. రెండున్నర ఎకరాలకు 750 గ్రాముల విత్తనాలు సరిపోయాయని అన్నారు రమేష్‌రెడ్డి. విత్తనాలు కొంచెం సేపటికే చెమ్మగా మారి ఒకదానితో ఒకటి అతుక్కుంటాయి కాబట్టి ఇసుకలో కలుపుకొని చల్లినట్లు చెప్పారు. ఎకరా భూమికి 250 గ్రాముల చియా విత్తనాలు సరిపోతాయి. కిలో విత్తనాలు రూ.600కు బీదర్‌ నుంచి తీసుకొచ్చినట్లు తెలిపారు. వాటి ట్రాన్స్‌పోర్టు అన్నీ కలుపుకొని తమకు రూ.800 అయిందన్నారు. నవంబర్‌ నెల మధ్యలో విత్తనాలు నాటినట్లు రమేష్‌రెడ్డి చెప్పారు. అక్టోబర్‌లో కూడా చియా విత్తనాలు నాటుకోవచ్చు. పగటి వెలుతురు ఉంటే ఈ పంట మరింత ఎక్కువ పండుతుంది. నవంబర్‌ మధ్యలో విత్తనాలు వేసుకుంటే ఫిబ్రవరి రెండో వారంలో పంట దిగుబడి వచ్చేస్తుంది.చియాసాగుకు చౌడు లేని, నీరు నిలవని భూములు ఏవైనా పరవాలేదు. నీరు నిల్వ అయితే., తేమ ఎక్కువై మొక్క సారిగా ఎదగకపోవచ్చు. ఫ్లవరింగ్‌ కూడా అంత బాగా వచ్చే ఛాన్స్‌ తగ్గొచ్చు. వచ్చిన పూత రాలిపోయే ప్రమాదం ఉందని రైతు రమేష్‌రెడ్డి చెప్పారు. ఎర్రబండలతో నిండి ఉన్న తమ పొలంలో నాలుగు అడుగుల ఎత్తు మట్టి పోసి, చియా సీడ్స్ సాగు చేస్తున్నట్లు చెప్పారు. చియాసీడ్స్‌ పంటకు తెగుళ్ల బాధ ఉండదని నిపుణులు చెప్పారన్నారు. కానీ మిగతా రైతులు ఎవ్వరికీ రాని త్రిప్ట్‌స్‌ తమకు వచ్చిందన్నారు. త్రిప్ట్స్‌ నివారణ కోసం తాను నాలుగు సార్లు రూ.30 వేల ఖర్చుతో మందులు స్ప్రేచేసినట్లు తెలిపారు. త్రిప్ట్‌స్‌ ప్రారంభ స్టేజ్‌లో ఎక్స్‌ఫ్లోర్డ్‌, తర్వాత కాస్త ఖరీదైన స్పీనోసాట్‌ 45 ఈసీ కొట్టామన్నారు. ఆకు తినే గొంగళి పురుగు అక్కడక్కడా కనిపించినా త్రిప్ట్స్‌ కోసం కొట్టిన మందుతో అవి చనిపోయాయని వెల్లడించారు.చియాసీడ్స్‌ విత్తనాలు వేసిన తర్వాత వారం రోజుల్లో మొలకలు వస్తాయి. ఆర్గానిక్‌ విధానంలో చియా సీడ్స్ సాగు చేయాలంటే మనుషులతో కలుపు తీయాల్సిందే. రెండుసార్లు కలుపును మనుషులతో తీయిస్తే.. రెండున్నర ఎకరాలకు సుమారు రూ.40 వేలు ఖర్చయిందన్నారు. దుక్కి దున్నేటపుడే గడ్డిమందు వేస్తే.. మొదటిసారి కలుపు తీయాల్సిన అవసరం ఉండదు. కానీ గడ్డిమందును ప్రభుత్వాలు నిషేధించాయి కాబట్టి రైతులు గమనించాలి. కలుపుతీసే ఖర్చు తగ్గించుకుంటే లాభం మరింత ఎక్కువ వస్తుంది. ఆ తర్వాత చియాసీడ్స్‌ పంటకు ఖర్చే ఉండదు. చియా మొక్కలు ఎత్తుగా దట్టంగా పెరిగినప్పుడు కలుపు మొక్కలు వచ్చే అవకాశం ఉండదు.రోటావేటర్‌కు రూ.2 వేలు, విత్తనాలు చల్లే కూలీలకు రూ.5 వేలు, దుక్కి దున్నేందుకు, డ్రిప్‌ పైపులు వేసేందుకు రెండున్నర ఎకరాలకు మరో రూ.5 వేలు, విత్తనాల ధర రూ.800  ఖర్చు వస్తుంది. మొత్తం మీద మొదటి పెట్టుబడి రూ.11 వేలు అయినట్లు రమేష్‌రెడ్డి వివరించారు. దాంతో పాటు కలుపు తీసేందుకు రూ.40 వేలతో కలుపుకొని రెండున్నర ఎకరాలకు రూ.51 వేలు ఖర్చు వచ్చిందన్నారు. పెట్టిన పెట్టుబడికి నాలుగు నెలల్లోనే రైతుకు రెట్టింపు ఆదాయం వస్తుందన్నారు రమేష్‌రెడ్డి.దిగుబడి విషయానికి వస్తే.. నెట్‌లో చూసినా, ఇంతకు ముందు చియాసీడ్స్ సాగు చేసిన రైతు చెప్పిన దాన్నిబట్టి ఎకరాకు 6 క్వింటాళ్లు వస్తుందని తెలిసిందని రమేష్‌రెడ్డి చెప్పారు. తమ క్షేత్రాన్ని చూసిన వ్యవసాయాధికారి ప్రదీప్ అయితే.. ఇంకా ఎక్కువే రావచ్చని అంచనా వేశారన్నారు. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో చియా సీడ్స్‌కు మార్కెట్‌ అంతగా లేదు. కానీ బీదర్‌ వ్యాపారులు వచ్చి కొంటున్నారు. ఢిల్లీ మార్కెట్‌లో కూడా చియాసీడ్స్‌కు డిమాండ్ ఉంటుంది.చియాసీడ్స్‌ను ఎగువ మధ్యతరగతి, అత్యధిక ఆదాయం ఉండే కుటుంబాలే ఎక్కువగా వినియోగిస్తున్నాయి. దిగువ మధ్యతరగతి, అంతకన్నా తక్కువ ఆదాయం ఉన్నవారు చియాసీడ్స్‌ ఇంకా సరిగా వినియోగించడం లేదు. ఆరోగ్యాన్ని అభిలషించే మధ్యతరగతి ప్రజలు కూడా అవగాహన పెరగడంతో ఇటీవలి కాలంలో చియాసీడ్స్‌ వాడుతున్నారు. రిటైల్‌ మార్కెట్‌లో చియా సీడ్స్ కొనాలంటే ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. సూపర్‌ మార్కెట్లలో కిలో రూ.800 నుంచి 1000 రూపాయలు పలుకుతోంది. చియాసీడ్స్‌ను అందంగా ప్యాక్‌ చేయడం, మంచి డబ్బాలలో సీల్‌ చేయడం వల్ల ధర ఎక్కువగా ఉంటుంది. కానీ గింజలు అమ్మే మార్కెట్లలో హోల్‌సేల్‌గా తీసుకుంటే రేటు తగ్గుతుంది. శివమొగ్గలో రేటు కాస్త ఎక్కువ ఉంటుంది. బీదర్‌లో కొద్దిగా తగ్గుతుందని రమేష్‌రెడ్డి చెప్పారు. ఐదు, ఆరుగురు రైతుల నుంచి బీదర్‌ వ్యాపారి ఒకేసారి చియాసీడ్స్ పంటను కిలో 120 నుంచి 130 రూపాయలకు కొంటున్నారు.పంట కోసిన తర్వాత చియా సీడ్స్‌ డ్రైఫ్రూట్ మాదిరిగా చాలా రోజులు నిల్వ ఉంటుంది. కాకపోతే వీటికి చెమ్మ రాకుండా చూసుకోవాలి. ఇటీవల ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ లాంటి ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థలు కూడా చియాసీడ్స్‌ను బ్రాండింగ్‌ చేసి అమ్ముతున్నాయి. చియాసీడ్స్ పండించిన రైతుకు ధర తక్కువ వచ్చినా పెట్టుబడితో పోల్చుకుంటే లాభం బాగా వచ్చినట్లని రమేష్‌రెడ్డి అన్నారు. రిటైల్‌ మార్కెట్‌లో వీటి ధర తగ్గితే కన్య్సూమర్లు పెరగవచ్చు. దాంతో డిమాండ్‌ కూడా పెరుగుతుంది.

ఇతర పంటల కోసం తాము అతకు ముందే వేసుకున్న డ్రిప్ పైపులకు అటు ఇటూ చియాసీడ్స్‌ విత్తనాలను రమేష్‌రెడ్డి వేశారు. పంటచేలో తడి తగ్గకుండా మూడు, నాలుగు రోజులకు ఒకసారి నీరు సరఫరా చేస్తే సరిపోతుంది. పంట కోతకు వచ్చే సమయానికి 15 రోజుల ముందే నీరు ఆపేయాలి. పొలంలో నీరు ఉంటే చియాసీడ్స్‌లో తేమ ఎక్కువ అవుతుంది. సీయా సీడ్స్‌ బాగా డ్రై అయితే.. ఆయిల్‌ శాతం ఎక్కువ ఉంటుంది. విత్తనం వేసినప్పటి నుంచి 60 రోజులకు చియాసీడ్స్‌ మొక్కలకు పూత మొదలువుతుంది. 120 రోజుల వరకు పువ్వులు తాజాగా ఉంటాయి. పంట ఆఖరి 15 రోజులు మొక్కపైనే గింజ బాగా ఆరిపోవాలి. దీంతో గింజ బాగా డ్రై అవుతుంది. ఆయిల్ శాతం కూడా పెరుగుతుంది. చియాసీడ్స్‌ పంటను కోసి, మిషన్‌లో వేసి గింజలను వేరు చేసుకోవచ్చు. లేదా నేరుగా పంట కోసి, గింజలు వేరుచేసే హార్వెస్టర్ల ద్వారా కూడా చేసుకోవచ్చు.ఇప్పుడు చియాసీడ్స్‌ను రైతులు అంత ఎక్కువగా పండించడం లేదు కాబట్టి మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. వీటిని ఎక్స్‌పోర్ట్‌ చేసే అవకాశం కూడా ఉంది. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం వచ్చే చియాసీడ్స్ పంట సాగు చేస్తే రైతులకు మంచి బెనిఫిట్స్ ఉంటాయని రైతు రమేష్‌రెడ్డి సలహా ఇచ్చారు.

చియాసీడ్స్ సాగుపై ఎలాంటి అనుమానాలు ఉన్నా రైతు రమేష్‌రెడ్డిని 7981999362లో సంప్రదించవచ్చు.