గ్రీన్‌ రివల్యూషన్‌ కారణంగా మన దేశంలో వ్యవసాయ దిగుబడులు పెంచేందుకు రసాయనాల వాడకం బాగా పెరిగిపోయింది. రైతులు పంటల సాగును రసాయనాల మీదే ఆధారపడడం, వాటి వినియోగం ఎక్కువైన నేపథ్యంలో వాటి ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. చివరికి రసాయన ఎరువులు కొనలేని స్థితికి అన్నదాతలు, చాల వరకు విదేశాల నుంచి దిగుమతి చేసి, రైతుల అవసరాలకు సరిపడినంతగా అందించలేని స్థితిలోకి ప్రభుత్వాలు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే పలువురు రైతులు సహజ పంటల వైపు అడుగులు వేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహజ పంటల సాగును బాగా ప్రోత్సహిస్తున్నాయి. కొందరు ఇన్నోవేటివ్ రైతులు సాగు పెట్టుబడులు తగ్గించే ప్రక్రియలను అన్వేషిస్తున్నారు.

ఇలాంటి కృషిలో భాగంగా SRT బెడ్స్‌ విధానం వచ్చింది. తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేసేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. వరిసాగు కోసం భూమిని సిద్ధం చేసి, విత్తనాలు వేసేందుకు కనీసం 10 నుంచి 13 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే.. విత్తనాల ఖర్చుతో కలిసి ఎకరానికి రెండు వేల రూపాయలలో సాగు ప్రారంభించడం ఈ సాగు విధానం. భూమిని పంట వేసే ప్రతిసారీ దున్నే పనిలేకుండా, భూమిని బురద చేయకుండా, శాశ్వత ఎలివేటెడ్‌ బెడ్స్‌పై పంటలు పండించే కొత్త విధానం సగుణ రీజనరేటివ్‌ టెక్నిక్‌ సాగు విధానం. ఈ పద్ధతిని మహారాష్ట్ర వ్యవసాయ శాస్త్రవేత్త చంద్రశేఖర్‌ హరిబావు బడ్సావే రూపొందించారు. భూమిలో కర్బనాన్ని పెంచి, నేలను సారవంతంగా మార్చడంలో SRT విధానంతో చాలా సులువు. రైజింగ్‌ బెడ్స్‌పై సాగు చేసిన పంటలు తీసుకొని, మొక్కలను అవే బెడ్లపై మల్చింగ్‌గా వేస్తూ ఉంటే.. మూడేళ్లలో నేల సారవంతం అవుతుంది.ఈ విధానంలో మీటర్‌ వెడల్పుతో శాశ్వతంగా కాస్త ఎత్తుగా తయారుచేసే బెడ్‌ దీనిలో ముఖ్యం. బెడ్‌ను ఒకసారి తయారు చేసుకుంటే తర్వాత 25 ఏళ్ల వరకు దానిని దున్నే అవసరం ఉండదు. ఆ మేరకు ప్రతి పంటకూ చేసే ఖర్చు రైతుకు తగ్గిపోతుంది. మీటర్ వెడల్పు, అడుగు నుంచి అడుగున్నర ఎత్తులో బెడ్లు చేసుకోవాలి. బెడ్‌కు బెడ్‌కు మధ్య 14 అంగుళాల ఖాళీ వదలాలి. రోటావేటర్‌తో మట్టిని సిద్ధం చేసి, బెడ్ మేకర్‌తో బెడ్లు వేసుకోవాలి. బెడ్‌ అంచుల్లోని మట్టి జారిపోతే చిన్న చిన్న రిపేర్లు చేసుకోవచ్చు. ఈ బెడ్లపై తొలి పంటగా వేర్లు ఎక్కువగా ఉండే మిల్లెట్స్‌ లాంటి పంటలు సాగు చేస్తే.. బెడ్లు వాటి వేర్లతో షేప్‌ మారిపోకుండా ఉంటాయి. ఆ వేర్లు మెల్లిమెల్లిగా కుళ్లిపోతాయి. భూమికి బలాన్నిస్తాయి. ఆ తర్వాత ఆ బెడ్లపై పెట్టే మొక్కల వేర్లు పోషకాలను గ్రహించుకొని, బలంగా, ఏపుగా, పచ్చగా ఎదుగుతాయి. తద్వారా దిగుబడి అధికంగా ఇచ్చి, రైతుకు లాభాలు తెచ్చిపెడతాయి.ఒక బెడ్‌పై అత్యధికంగా వరి అయితే ఐదు వరుసల్లో విత్తనాలు నాటుకోవచ్చు. మట్టి తీరును బట్టి పత్తి రెండు వరుసలు, సోయాబీన్‌, సెనగ విత్తనాలైతే మూడు నుంచి నాలుగు వరుసల్లో వేసుకోవచ్చు. అదే కంది అయితే.. ఒక్క వరుస మాత్రమే వేయాలి. రెండు కందిమొక్కల మధ్య అంతర పంటగా వేరే విత్తనాలు వేసుకోవచ్చు. ఇలా బెడ్లపై ఒకేసారి 22 రకాల పంటల వరకు పండించవచ్చు. SRT బెడ్ల సాగు విధానంలో భూమి లోపల ఉండే వేర్లు భూమికి, భూమి పైన ఉండే కాండాలు, ఆకులు పశువులకు దాణాగా ఉపయోగపడతాయి. ఆ పైన దిగుబడి వచ్చే గింజలు మనుషులకు ఆహారంగా వాడుకోవడం SRT బెడ్లపై సాగు పద్ధతి.భూమిని చాలా లోతుగా దున్నితే పైమట్టి కిందకు, లోపల మట్టి మీదకి వెళ్తాయి. దీనితో భూమికి మేలు చేసి, సారవంతంగా మార్చే కోట్లాది సూక్ష్మజీవులు చనిపోతాయి. వర్షాలు కురిసినప్పుడు భూమిలోని సారం బురదగా మారి బయటికి కొట్టుకుపోయే నష్టం ఉంటుంది. మూడో నష్టం ఆర్గానిక్‌ మేటర్‌ తగ్గిపోతుంది. చాలా ఏళ్ల పాటు దుక్కి దున్నే అవసరం SRT బెడ్ల విధానంలో ఉండదు కాబట్టి ఇలాంటి నష్టాలు రాకుండా భూమిని కాపాడుకోవచ్చు. వాతావరణం రైతు చేతుల్లో ఉండదు. పంట దిగుబడులు అమ్ముకోవాలంటే మార్కెట్‌ కంట్రోల్‌ ఉండదు. కూలీలు సరిగా దొరకడం లేదు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం SRT బెడ్ల సాగు అని శాస్త్రవేత్త వెంకటరావు చెప్పారు.భూమిని తొలిసారి గుల్లగా మార్చేందుకు దున్నుకోవాలి. ఆ తర్వాత రొటావేటర్‌ తప్పకుండా వేయాలి. బల్లపరుపుగా బెడ్లు వేయాలి. భూమిని దున్నే సమయంలోనే పెంట ఎరువు వేసి, మట్టిలో బాగా కలిసేలా చేసుకోవాలి. పెంట ఎరువు లేకపోతే వేల రూపాయల ఖర్చుతో ఎరువులు కొని వేయనక్కరలేదు. రెండు మూడేళ్లలోనే SRT బెడ్ల లోపలి మట్టిలో మిగిలిన మొక్కల వేర్లు కుళ్లిపోయి ఆటోమేటిక్‌గా పోషకాలు తయారవుతాయి. బెడ్లపై డ్రిప్‌ విధానం వేసుకుంటే పంటలకు నీటి సరఫరా మరింత సులువు అవుతుంది. బెడ్లు వేసుకున్న మొదటి సంవత్సరం కలుపు అంతగా రాదు. రెండు మూడు పంటల నుంచి భూమిలోని సహజసిద్ధంగా వానపాములు పుడతాయి. ఇవి భూమిని గుల్లబారుస్తాయి. సారవంతం కావడానికి సహాయపడతాయి. ఈ సాగు పద్ధతిలో భూమిలో మైక్రోబియల్‌ కౌంట్‌ 20 నుంచి 24 వరకు వస్తోంది. మిథేన్‌ తగ్గిపోతుంది. దీంతో మట్టిలో ఆక్సిజన్‌ స్థాయిలు పెరుగుతాయి. అనేక జీవరాశులు భూమిలో పెరిగి, పంటలకు ఎంతో మేలు చేస్తాయి.SRT బెడ్ల విధానంలో చేత్తో నడిపే పుష్‌ సీడర్‌, భుజాన వేసుకునే స్ప్రేయ క్యాన్‌, ఒక బ్రష్ కట్టర్ ఉంటే మూడు ఎకరాల్లో భార్య, భర్త ఎలాంటి యంత్రాలు లేకుండా సునాయాసంగా వ్యవసాయం చేయొచ్చు. వీటి ద్వారా సమయం చాలా ఆదా అవుతుంది. ఒక ఎకరం రెండు లేదా మూడు ఎకరాలు ఉన్న మహారాష్ట్ర రైతులు సమారు 10 వేల మంది వీటితోనే వ్యవసాయం చేస్తున్నారు. ఈ సాగు పద్ధతిలో రెండో పంట నుంచి దుక్కి దున్నే ఖర్చు ఉండదు. మూడో ఏట నుంచి పురుగు మందులు కొట్టే అవసరం రాదు. కేవలం విత్తనాల ఖర్చు, వాటిని నాటేందుకయ్యే వ్యయం, నీటి సరఫరాకు పెట్టుబడి మాత్రమే ఉంటాయి. సాగు పెట్టుబడి తగ్గిపోతుంది. రిటర్న్స్‌ వస్తాయి. రెండు, మూడు పంటల నుంచి పురుగు మందుల ఖర్చు తగ్గిపోతుంది. ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌ అంటే పంటలు సులువుగా సాగు చేయవచ్చు.ప్రతి చిన్న రైతు నుంచి పెద్ద పెద్ద కమతాలు ఉన్నవారు కూడా ఈ విధానంలో సాగు చేయవచ్చు. సాగు పెట్టుబడి ఖర్చు తగ్గిపోతుంది కాబట్టి కౌలు రైతులకు కూడా SRT విధానం లాభదాయకం అని చెప్పొచ్చు. తక్కువ ఖర్చుతో భూమిలో కర్బనం పెంచి, నేలను సారవంతం చేయడానికి SRT విధానం చక్కని ఫలితాలు ఇస్తోంది. ఖర్చు తక్కువలో ఎక్కువ లాభాలు తీసుకొచ్చి, ఏ రైతు అయినా అవలంబించేందుకు SRT పద్ధతి అనుకూలం.