మన దేశంలో ప్రతి ఇంటిలో ఒక డయాబెటస్‌ రోగి ఉన్నారనే అంచనాలు ఉన్నాయి. దేశంలో 11.4 శాతం మంది అంటే సుమారు 10 కోట్ల మంది చక్కెర వ్యాధిగ్రస్తులు ఉన్నారు. మరో 15.3 శాతం మంది ప్రీ డయాబెటిక్‌ అంటే మధుమేహం వచ్చే అవకాశం ఉన్నవారు ఉన్నారు. దేశంలో కేరళం రాష్ట్రంలో అత్యధికంగా 25.9 శాతం మంది సుగర్ వ్యాధి రోగులు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో 22.4 శాతంతో గోవా, 21.4 శాతంతో తమిళనాడు ఉండగా.. 20.6 శాతం మంది డయాబెటిస్‌తో ఆంధ్రప్రదేశ్‌లో బాధపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సుమారు 10 నుంచి 18 శాతం వరకు మధుమేహ రోగులతో నాలుగో స్థానంలో ఉన్నట్లు నిర్ధారణ అయింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం తెలంగాణలోని పురుషులు 13.8 మంది, మహిళలు 10.2 మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. తెలంగాణలో దాదాపు 24.5 లక్షల మందికి పైగా మధుమేహ బాధితులు ఉన్నారు. అంటే ప్రతి ఏడుగురిలో ఒకరు ఈ వ్యాధితో బాధపడుతున్నారు.

బ్లడ్‌ షుగర్‌ స్థాయిలను అదుపులో ఉంచాలంటే ఫైబర్‌, ప్రోటీన్లు అధికంగా ఉండి, గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండే పంటలను ఆహారంగా తీసుకోవాలి. ఇలాంటి ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకుంటే డయాబెటిస్‌ వ్యాధి రాకుండా నివారించవచ్చు. ఇప్పటికే ఉన్నవారికి సుగర్‌ స్థాయిలను అదుపులో ఉంచవచ్చు. దేశ వ్యాప్తంగా ఇంత భారీ సంఖ్యలో డయాబెటిస్ రోగులు ఉన్నారు కాబట్టి, వారు ఉపయోగించే పంటలు, పంట ఉత్పత్తులను రైతులు అధికంగా పండిస్తే.. లాభదాయకంగా ఉంటుంది. మధుమేహ వ్యాధి రోగులకు మేలు చేసినట్లు అవుతుంది. మధుమేహాన్ని నియంత్రించే లేదా నివారించే పండ్లు, ఆహారాల గురించి చూద్దాం.సుగర్ వ్యాధిగ్రస్తులు మొట్టమొదటగా వినియోగించాల్సినవి చిరుధాన్యాలు. జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, సామలు లాంటి చిరుధాన్యాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. రక్తంలో సుగర్ లెవెల్స్‌ను అకస్మాత్తుగా పెరగకుండా చేస్తాయి. దాల్చినచెక్క, మెంతులు కూడా మధుమేహాన్ని నియంత్రించడంలో, ఇన్షులిన్‌ స్ధాయిలను మెరుగు పరచడంలో పనిచేసే తీరు అద్భుతం. దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. డిమాండ్‌ ఎక్కువగా ఉండే ఇలాంటి పంటలను రైతు విరివిగా పండించవచ్చు. తద్వారా లాభాలు పొందవచ్చు.కూరగాయల విషయానికి వస్తే.. చక్కెర వ్యాధిగ్రస్థులకు కాకరకాయ ది బెస్ట్‌ అంటారు ఆరోగ్య నిపుణులు, చక్కెర స్థాయిలను తగ్గించడంతో దీని పని ప్రశంసనీయం. బెండకాయలో కరిగిపోయే ఫైబర్‌ ఉంటుంది. చక్కెర స్థాయిలను ఇది స్థిరంగా ఉంచుతుంది. ములక్కాయల్లో ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచే గుణం ఉంది. ఆకు కూరల్లో పాలకూర, మెంతికూర, బ్రోకలీ లాంటివి రోజూ ఆహారంలో తీసుకుంటే శరీరానికి కావాల్సిన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అందిస్తాయి. క్యాబేజి జాతికి చెందిన కాలే లేదా కేల్‌ ఆకులను చక్కెర వ్యాధిగ్రస్తులకు ‘సూపర్‌ఫుడ్‌’ అంటారు. సలాడ్లలో ఎక్కువగా వినియోగించే కాలే ఆకుల్లో ఉండే ఫైబర్‌, ఫ్లేవనాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఓట్స్‌ లేదా ఓట్స్‌ నుంచి వచ్చే తవుడు కూడా సుగర్ స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. వాటితో పాటు కొద్దిగా పులిసిన పాల ఉత్పత్తులైన పెరుగు, మజ్జిగలో ప్రో బయోటిక్స్ ఉంటాయి. ఇవి మంచి బ్యాక్టీరియా, ఈస్ట్‌ కలిగి ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు బాగా ఉపయోగపడతాయి. దాంతో పాటు వీటిలో ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవన్నీ డయాబెటిస్‌ రోగులకు మేలు చేస్తాయి. గుడ్లలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన ఫ్యాట్లు, విటమిన్లు, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల సుగర్‌ను నియంత్రించే చక్కటి ఆహారం అని చెబుతారు.గింజ ధాన్యాల్లో సోయాబీన్స్‌, చిక్కుడు కాయలు, కందులు, చియాసీడ్స్‌, పెసర్లు, గుమ్మడికాయ, గుమ్మడి గింజలను ఆహారంలో తీసుకుంటే ప్రోటీన్లను పుష్కలంగా అందించి, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ను తగ్గిస్తాయి. మొక్కజొన్న గింజలు, వాటి ఉత్పత్తులను తింటే మూడు నెలల (HBA1C) సుగర్ స్థాయిలను తగ్గిస్తాయి. నేరేడు పండ్లు, జామకాయ, బొప్పాయి, పుచ్చకాయ, యాపిల్‌ లాంటి పండ్లలో సుగర్‌ శాతం తక్కువ. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్‌బెర్రీలు, పియర్‌, నారింజ, నిమ్మ, చెర్రీస్‌, పీచెస్‌, కివీస్‌, అవకాడో, ద్రాక్షపండ్లు, దానిమ్మ, రేగుపండ్లు డయాబెటిస్‌ రోగులకు అత్యుత్తమమైనవిగా నిపుణులు స్పష్టం చేశారు. వీటిలో ఉండే సుగర్ సహజసిద్ధంగా వచ్చింది కాబట్టి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మేలైనవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పైగా వీటిలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. పండ్లలో సహజంగా ఉండే సుగర్‌ రక్తంలో గ్లూకోజ్‌ పెరుగుదలను నియంత్రిస్తుంది.మాంసాహారం విషయానికి వస్తే.. సముద్రపు చేపల్లో ప్రొటీన్‌, ఆరోగ్యకరమైన ఫ్యాట్లు, విటమిన్‌లు, మినరల్స్‌, యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చెక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. బ్లడ్‌ సుగర్‌ను క్రమబద్ధీకరించడంలో ప్రోటీన్‌ బాగా ఉపయోగపడుతుంది. బ్లడ్‌లో సుగర్‌ ఎక్కువ కాకుండా నియంత్రిస్తుంది. సాల్మన్‌ లాంటి ఫ్యాటీ ఫిష్‌ను ఆహారంగా ఎక్కువగా తీసుకుంటే శరీరానికి అవసరమైన మంచి ఫ్యాట్స్‌ను అందిస్తుంది.మనం చెప్పుకున్న ఆహారాలు, పండ్లు, గింజలు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకుంటే సుగర్‌ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం బాగవుతుంది. అవి విష రసాయనాలు వేసిన వాటి కంటే సహజసిద్ధ పద్ధతిలో పండించినవి అయితే.. ఫలితాలు మరింత బాగా ఉంటాయి. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యం పట్ల అవగాహన, జాగ్రత్తలు బాగా పెరిగాయి. ఇలాంటి పంటలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ కూడా ఉంది. ఇప్పటికే సహజసిద్ధ విధానంలో పంటలు పండిస్తున్న పలువురు రైతులు తమ ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి వస్తున్న ఆదరణ గురించి చెబుతున్నారు. తమ తమ క్షేత్రాల వద్దకే రెగ్యులర్‌ కస్టమర్లు వచ్చి, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాలను మంచి ధర ఇచ్చి మరీ తీసుకుపోతున్నారని అంటున్నారు.