భూమిని దున్నే పని లేదు. ఎలాంటి రసాయన ఎరువులు పశువుల ఎరువుతో సహా ఏదీ వేసే అవసరం లేదు. సహజసిద్ధంగా కషాయాలు లాంటి జీవన ద్రావణాలతో సహా రసాయన పురుగు మందులు వాడే పనే లేదు. కలుపును నిర్మూలించాల్సిన అక్కర ఉండదు. అంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకున్న మాదిరిగా భూమిని క్లీన్‌గా పెట్టుకునే అవసనం ఉండదు. కలుపు మందులు వాడకూడడు. ఇలా చేయడాన్ని ‘Do Nothing Farming’ వ్యవసాయం. అంటే భూమికి, పైర్లు, మొక్కలకు ఎలాంటి పనీ చేయకుండానే పంట పండించడం అన్నమాట.
‘డు నథింగ్ ఫార్మింగ్’ అంటే తొలి రోజు నుంచీ పైన చెప్పుకున్న నాలుగు పనులు చేయకూడదని కాదు. వ్యవసాయ క్షేత్రానికి మొదట అవసరమైన పనులన్నీ చేయాలి. క్షేత్రాన్ని స్థిరమైన, పరిపక్వ దశకు తీసుకెళ్లిన తర్వాత ఇంకేమీ చేసే పని ఉండదు. ఇదే ‘డు నథింగ్ ఫార్మింగ్’ అర్థం. ఆ తర్వాతి నుంచి కూడా భూమి నుంచి, పైర్లు, మొక్కలు, చెట్ల నుంచి మనకు దిగుబడులు, ఆదాయం ఇచ్చేదే ‘డు నథింగ్ ఫార్మింగ్’. మొదటి రోజు నుంచే ‘డు నథింగ్ ఫార్మింగ్’ అంటే ఏమీ చేయకుండా వదిలిపెట్టిన క్షేత్రం అంటారు.
కర్ణాటక రాష్ట్రం దావణగెరె జిల్లాలోని ఐకాంతిక పేరిట రాఘవ మూడు దశాబ్దాలుగా వ్యవసాయ క్షేత్రం నిర్వహిస్తున్నారు. అడవిని తలపించేలా అసాధారణ ఫుడ్ ఫారెస్ట్ తయారు చేశారు. పచ్చదనం, పక్షులు, కీటకాల సహజ జీవనం కనిపిస్తుంది. వ్యవసాయం అంటే భూమిని దుక్కి దున్నాలి. ఎరువులు వేయాలి. పురుగుమందులు వాడాలి. కలుపు తీయాలి.. సాధారణంగా మనకు తెలిసిన పద్ధతులు ఇవే. కానీ 30 ఏళ్లుగా ప్రకృతితో కలిసి నడుస్తూ, ఒక వ్యవసాయ క్షేత్రాన్ని ఫుడ్ ఫారెస్ట్‌గా అభివృద్ధి చేశారు ఐకాంతిక రాఘవ. ఆయన సాగు విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
రాఘవ 1996 నుంచి వ్యవసాయం చేస్తున్నారు. అంతకు మందు తనకు వ్యవసాయం గురించి అస్సలు అవగాహన లేదని చెప్పారు. ఒక సహజ వ్యవసాయ సెమినార్లో పాల్గొన్న తనకు ఆలోచనా విధానం మారిపోయిందని రాఘవ అన్నారు. రసాయన వ్యవసాయం వల్ల కలిగే దుష్పరిణామాలు తెలుసుకుని, రసాయనాలు వాడని సహజ సిద్ధమైన సాగు వైపు ఆయన అడుగులు వేశారు. ఐకాంతికలో వరి, కొబ్బరి, పండ్ల చెట్లు, కూరగాయలు, ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాలు, మసాలా పంటలు, అలంకరణ మొక్కలు, కలపగా వాడే చెట్లు.. ఇలా అనేక మొక్కలను సహజ పద్దతిలో పెంచుతున్నారు.
జపాన్‌లోని ప్రముఖ రైతు తత్వవేత్త మసనోబు ఫుకుఓకా (Masanobu Fukuoka) ప్రపంచానికి ఈ ‘డు నథింగ్ ఫార్మింగ్’ విధానాన్ని పరిచయం చేసినట్లు అవంతిక రైతు రాఘవ వెల్లడించారు. ప్రారంభంలో ప్రకృతికి అనుగుణంగా అవసరమైన చెట్లు, పంటల నమూనాను సిద్ధం చేసి, ఒక పరిపక్వ స్థాయికి తీసుకురావాలి. ఆ వ్యవస్థ స్థిరపడిన తర్వాత ప్రకృతి తనంతట తానుగానే పంటలను పెంచుతుంది. ఆ తర్వాత మనుషులు చేయాల్సింది ఏమీ ఉండదు. దాన్నే ‘డు నథింగ్ ఫార్మింగ్’ అంటారు. పురుగు మందుల వల్ల నష్టం ఉందని ఇప్పుడు చాలా మంది రైతులు గ్రహించారు. కానీ.. కలుపుమందులు (Weedicides) వల్ల జరిగే నష్టాన్ని గుర్తించడం లేదని రాఘవ అన్నారు. నిజానికి పురుగు మందుల కంటే నేలకు, మన ఆరోగ్యానికి కలుపు మందులే మరింత ఎక్కువ ప్రమాదకరం అని చెప్పారు.
ఈ ఫుడ్ ఫారెస్ట్‌లో ప్రతి మొక్కా ప్రకృతి సూత్రాల ప్రకారమే ఒకదానికొకటి తోడ్పడుతూ పెరుగుతున్నాయి. ఈ అడవిని తాను సృష్టించాను అనడం కంటే, ప్రకృతి సహజంగా చేస్తుంటే నేను దానికి మద్దతుగా నిలిచాను అనడమే కరెక్ట్ అంటా రాఘవ. రసాయన వ్యవసాయం వల్ల కార్పొరేట్ కంపెనీలు లాభపడుతున్నాయి తప్ప, ఐదు దశాబ్దాలు అలాంటి సాగు చేస్తున్న ఏ ఒక్క రైతు కూడా ఎవరూ బాగుపడిన దాఖలా లేదు. సహజ వ్యవసాయం వల్ల రైతులకు ప్రత్యక్షంగా మేలు జరుగుతుంది.
ముప్పై ఏళ్ల సుదీర్ఘ సహజ వ్యవసాయ ప్రయాణంలో రాఘవ సాధించిన విజయం ప్రపంచంలో ఎంతోమందికి మార్గదర్శకంగా నిలుస్తోంది. కర్ణాటక మాత్రమే కాక, మన దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి, ప్రపంచంలోని ఐదు ఖండాల నుండి ప్రజలు, వాలంటీర్లు అవంతిక క్షేత్రానికి వచ్చి ఈ విధానాలను ఆచరణాత్మకంగా చూసి నేర్చుకుంటున్నారు. ప్రకృతితో పోరాటం ఆపేసి, దానితో కలిసి నడవడం నేర్చుకుంటే భూమి సుభిక్షంగా ఉంటుంది, మనుషుల ఆరోగ్యం, రైతుల భవిష్యత్తు సురక్షితంగా ఉంటాయని ‘ఐకాంతిక’ ద్వారా అర్థం చేసుకోవచ్చు.




















